MRF Factory Workers : పర్మినెంట్ చేయమన్నందుకు 350 మందికి పైగా ఉద్యోగులను తీసేసిన ఎంఆర్ఎఫ్, కార్మికుల ఆందోళన
MRF Factory Workers : సదాశివపేట పారిశ్రామిక ప్రాంతంలోని ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో 350కు పైగా కార్మికులను తొలగించారు. పర్మినెంట్ చేయాలని అడిగినందుకు తమ డ్యూటీని నుంచి తొలగించారని కార్మికులు ఆరోపిస్తున్నారు. తమను డ్యూటీలోకి తీసుకోవాలని కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు.

MRF Factory Workers : మెదక్ జిల్లా సదాశివపేట పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో గత నాలుగు సంవత్సరాల నుంచి పనిచేస్తున్న 350 మందికి పైగా కార్మికులను పర్మినెంట్ చేయాలని అడిగినందుకు తొలగించారని ఆరోపణలు వస్తున్నాయి.
ఈరోజు ఉదయం డ్యూటీకి వచ్చినా కార్మికులను గేటు బయటనే అడ్డుకోవడం దుర్మార్గమని తక్షణమే కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు వి.ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఎంఆర్ఎఫ్ అంకనపల్లి ప్లాంట్ కార్మికులను కార్మికులు విధుల్లోకి తీసుకోవాలని, ఆపరేటర్ గా పనిచేస్తున్న కార్మికులను తక్షణమే పర్మినెంట్ చేయాలని సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు.
సీఐటీయూ మద్దతు
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. అకారణంగా కార్మికులను తొలగించడం దుర్మార్గమన్నారు. నాలుగు సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని అడిగినందుకు మరుసటి రోజు నుంచి డ్యూటీకి రావొద్దని హుకుం జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ఆందోళన చేస్తున్న కార్మికులకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.
మూడు సంవత్సరాలు వెట్టి చాకిరీ
తమను విధుల్లోకి తీసుకునేటప్పుడు 3 సంవత్సరాల తర్వాత పర్మినెంట్ చేస్తానని యజమాన్యం చెప్పిందని కార్మికులు అంటున్నారు. నెలకు పదివేల రూపాయలు ఇచ్చి తమతో వెట్టి చాకిరి చేయించుకుంటుందని కార్మికులు ఆరోపించారు. దాదాపు 350 మంది శ్రమదోపికి గురవుతున్న పరిస్థితి ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో ఉందని సీఐటీయూ ఆరోపించింది.
ఈ కార్మికుల వయసు 25 సంవత్సరాల లోపు ఉందని, యజమాన్యం వీరితో తీవ్రమైన పని చేయించుకుంటుంది అన్నారు. వీరికి కనీస వేతనం కూడా అమలు చేయకుండా తక్కువ జీతాలు ఇచ్చి పని చేయించుకుంటున్న, ఎంఆర్ఎఫ్ యాజమాన్యంపై లేబర్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
సమస్య లేవనెత్తితే ఉద్యోగం పోతుంది
ఈ పరిశ్రమలో ఎవరైనా కార్మికులు ఏదైనా సమస్య అడిగితే వెంటనే వారిని డ్యూటీ నుంచి తీసివేయడం యజమానురానికి అలవాటైపోయిందని ప్రవీణ్ కుమార్ అన్నారు. కార్మికుల శ్రమతోనే యజమాన్యం విపరీతంగా లాభాలు అర్జిస్తుందని అన్నారు. కార్మికుల సమస్యలు అడిగితే మరుసటి రోజే గేటు దగ్గర ఆపేస్తున్నారు అన్నారు. ఈ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు సరైన సౌకర్యాలు చట్టపరమైన హక్కులు లేవని ఆరోపించారు. ఎంఆర్ఎఫ్ యజమాన్యం గత నాలుగేళ్లుగా నుంచి పని చేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆందోళనలో పాల్గొన్న కార్మికులను ఎవరిని కూడా డ్యూటీ ఆపకూడదని అన్నారు. యథావిధిగా డ్యూటీకి వచ్చేటట్లు యజమాన్యం ప్రయత్నం చేయాలని ఆయన కోరారు. యజమాన్యం కార్మికుల పట్ల కక్ష సాధింపు చర్యలను ఆపాలని డిమాండ్ చేశారు. కార్మికులు చేస్తున్న పోరాటానికి సీఐటీయూ సంఘం సంపూర్ణ మద్దతు ఉంటుందని, రాబోయే కాలంలో వారి సమస్యల పరిష్కారం కోసం ఎల్లవేళలా ముందంజలో ఉంటుందని అన్నారు.
సంబంధిత కథనం