Edupayala Temple : ఏడుపాయల వనదుర్గ ఆలయంలో చోరీ, రెండు హుండీలు ఎత్తుకెళ్లిన దుండగులు-medak edupayala temple two thieves stolen hundies cctv footage surfaced ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Edupayala Temple : ఏడుపాయల వనదుర్గ ఆలయంలో చోరీ, రెండు హుండీలు ఎత్తుకెళ్లిన దుండగులు

Edupayala Temple : ఏడుపాయల వనదుర్గ ఆలయంలో చోరీ, రెండు హుండీలు ఎత్తుకెళ్లిన దుండగులు

HT Telugu Desk HT Telugu
Aug 11, 2024 10:13 PM IST

Robbery In Edupayala Temple : మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గ ఆలయంలో చోరీ జరిగింది. ఇద్దరు ముసుగు దొంగలు ఆలయంలోకి ప్రవేశించి, రెండు హుండీలు ఎత్తుకెళ్లారు. ఆలయానికి కాస్త దూరంలో హుండీలు పగలగొట్టి సొమ్ము చోరీ చేశారు. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.

ఏడుపాయల వనదుర్గ ఆలయంలో చోరీ, రెండు హుండీలను ఎత్తుకెళ్లిన దుండగులు
ఏడుపాయల వనదుర్గ ఆలయంలో చోరీ, రెండు హుండీలను ఎత్తుకెళ్లిన దుండగులు

Robbery In Edupayala Temple : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ అమ్మవారి ఆలయంలో దొంగలు పడి రెండు హుండీలను ఎత్తుకెళ్లారు. ఇద్దరు దుండగులు ఆలయ మండపంలోనికి ప్రవేశించి రెండు హుండీలను కొంత దూరం తీసుకెళ్లి వాటి తాళాలు పగలగొట్టారు. వాటిలో ఉన్న నగదు, బంగారాన్ని అపహరించారు. ఈ ఘటన సీసీ కెమెరాలలో రికార్డు అయ్యింది. దీంతో స్థానికంగా కలకలం సృష్టించింది.

మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం మండపంలోకి శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు తాళం పగలగొట్టి లోనికి ప్రవేశించారు. మండపంలో మొత్తం 14 హుండీలు ఉండగా, అందులో 1, 12 నంబర్ గల రెండు హుండీలను ఆలయానికి 100 మీటర్ల దూరంలో ఉన్న చెట్లలోకి తీసుకెళ్లారు. అక్కడ వాటి తాళాలు పగలగొట్టి, అందులో ఉన్న సొత్తును ఎత్తుకెళ్లారు. ఖాళీ హుండీలను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఇలాంటి ఘటనలు గతంలో కూడా చోటుచేసుకున్నాయి.

ఈ ఘటన జరిగిన రోజు రాత్రి ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ పెట్రోలింగ్ కోసం ఏడుపాయల ఈవో కార్యాలయం వద్దకు వెళ్లగా .. ఆలయ సెక్యూరిటీ సిబ్బంది అక్కడే ఉన్నారు. దీంతో ఎస్ఐ సెక్యూరిటీని ఆలయం వద్ద ఉండకుండా ఇక్కడేం చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే ఆలయానికి వెళ్లాలని వారికి సూచించినా, సెక్యూరిటీ అక్కడే ఉన్నారు. అంతకు కొద్ది నిమిషాల ముందే ముసుకు దొంగలు దర్జాగా తమ పని ముగించుకొని వెళ్లినట్లు తెలుస్తుంది.

సీసీ కెమెరాలు ఉన్నా

ఏడుపాయల ఆలయంలో ఎలాంటి సంఘటనలు జరిగిన సీసీ కెమెరాలు ఉన్నాయి . ఆ సీసీ కెమెరాల లైవ్ ఫుటేజ్ ని ఈవో కార్యాలయంలోని టీవీలో పరిశీలించవచ్చు. కానీ ఆలయంలో దొంగతనం జరిగినప్పుడు అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఆలయంలో దొంగలు పడిన విషయాన్నీ గమనించకపోవడం గమనార్హం. అయితే ఆలయంలో దొంగతనం జరిగిన తీరు రికార్డు అయ్యాయి. ఇద్దరు ముసుకు ధరించిన వ్యక్తులు ఆలయ తలుపులు ఊడదీస్తున్న దృశ్యాలు కెమెరాలో కనిపిస్తున్నాయి. అయినా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ చోరీ జరిగినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై సీనియర్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

గతంలో మూడుసార్లు

ఏడుపాయల ఆలయం వద్ద గతంలో మూడుసార్లు ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. కొన్నేళ్ల కిందట రెండుసార్లు దొంగలు చోరీకి పాల్పడ్డారు. మూడోసారి 2022 జనవరి 20న ఆలయ గర్భగుడికి ఉన్న కిటికీని పగలగొట్టి లోనికి ప్రవేశించి నగదు,కానుకలు ఎత్తుకెళ్లారు. అనంతరం పోలీసులు నిందితులను పట్టుకొని సొమ్మును రికవరీ చేశారు. తాజాగా ఇప్పుడు హుండీలు చోరీకి గురి కావడం గమనార్హం.

సంబంధిత కథనం