Telangana Police Cricket : తెలంగాణ పోలీస్ క్రికెట్ టీమ్‌లోకి మెదక్ కానిస్టేబుల్ సాయికుమార్
Telangana Police Cricket : తెలంగాణ క్రికెట్ టీమ్ మొదటిసారిగా అల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ క్రీడల్లో పాల్గొననుంది. ఈ టీమ్ తరఫున మెదక్ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ ఆడనున్నారు. జిల్లాల వారీగా జరిగిన పోటీల్లో ప్రతిభ కనబరచి.. క్రికెట్ టీమ్‌లో చోటు సంపాందించారు ఎం.సాయికుమార్.
ఇటీవల హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర పోలీస్ క్రికెట్ టీమ్ ఎంపిక జరిగింది. ఇందులో 33 జిల్లాలకు చెందిన పోలీస్ క్రీడాకారులు దాదాపు 250 మంది పాల్గొన్నారు. మెదక్ జిల్లా నుంచి కానిస్టేబుల్ ఎం.సాయికుమార్ ఆ ఎంపికలో పాల్గొన్ని.. తెలంగాణ పోలీస్ క్రికెట్ టీమ్‌కు సెలక్ట్ అయ్యారు. ఫిబ్రవరి 7 నుంచి 12 వరకు బెంగళూరులో క్రికెట్ టౌర్నమెంట్ జరగనుంది. ఇందులో సాయికుమార్ పాల్గొంటారు.

చిన్ననాటి నుంచే..
సాయికుమార్ చిన్ననాటి నుంచి క్రికెట్ పోటీల్లో ప్రతిభ కనపర్చేవారని పోలీస్ అధికారులు చెప్పారు. కానిస్టేబుల్‌గా పనిచేస్తూనే క్రికెట్ ఆడేవారని వివరించారు. తెలంగాణ పోలీస్ క్రీడల్లో ప్రతిభ కనపరచిన క్రీడాకారులకు సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కరీంనగర్‌లో జరిగిన పోలీస్ క్రీడల్లో.. మెదక్ జిల్లా పోలీసులు రికార్డు సృష్టించారని అభినందించారు.
మెదక్ జిల్లాకు 8 పతకాలు..
ఈ క్రీడలో మెదక్ జిల్లా పోలీసులు 8 పతకాలను సాధించారని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇందులో ఒక బంగారు పతకం, 2 రజతాలు, 5 కాంస్య పతకాలను గెలుచుకున్నారని చెప్పారు. కానిస్టేబుల్ రాజాశేఖర్ టేబుల్ టెన్నిస్ డబుల్స్‌లో బంగారు పథకం, సింగిల్స్‌లో కాంస్య పథకాన్ని కైవసం చేసుకున్నారని వివరించారు. మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్.. బ్యాట్మెంటన్ విభాగంలో రజత పతకం, ఒక కాంస్య పతకాన్ని గెలుపొందారని చెప్పారు.
సత్తా చాటాలి..
కానిస్టేబుల్ రమేష్ టెన్నిస్ డబుల్స్ విభాగంలో రజత పతకం, సింగిల్స్ విబాగంలో కాంస్య పతకాన్ని గెలుపొందారు. కానిస్టేబుల్ సంగ్రామ్ రెజ్లింగ్ 72 కేజిల విభాగంలో కాంస్య పతకాన్ని గెలుపొందారు. జాతీయ స్థాయి పోటీల్లో కూడా ప్రతిభచూపి.. తెలంగాణ పోలీస్ పేరును మార్మోగించాలని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. క్రీడాపోటీల్లో పాల్గొనడం వల్ల ఆరోగ్యాంగా ఉంటారని వివరించారు.
(రిపోర్టింగ్- ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)