కాళేశ్వరంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌.. అడవిలో భక్తుల ఇబ్బందులు.. తప్పని కాలినడక-massive traffic jam in kaleshwaram during saraswati pushkaralu ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  కాళేశ్వరంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌.. అడవిలో భక్తుల ఇబ్బందులు.. తప్పని కాలినడక

కాళేశ్వరంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌.. అడవిలో భక్తుల ఇబ్బందులు.. తప్పని కాలినడక

సరస్వతి పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. తెలంగాణ, ఏపీ నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ నుంచి భారీగా భక్తులు రావడంతో.. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో చాలా వాహనాలు అడవిలోనే చిక్కుకుపోయాయి. సెల్ ఫోన్ సిగ్నల్, తాగునీరు లేక అవస్థలు పడుతున్నారు.

ట్రాఫిక్ జామ్ (unsplash)

కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాల సందర్భంగా భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. దాదాపు 15 కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించిపోయాయి. 5 గంటలుగా భక్తులు నరకం చూస్తున్నారు. కొన్ని వాహనాలు అడవి ప్రాంతంలోనే ఉండిపోయాయి. అక్కడ కనీసం సెల్ ఫోన్ సిగ్నల్స్, తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్‌ నియంత్రణలో వైఫల్యం ఉందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పిల్లలను సంకనెత్తుకుని..

ఆదివారం తెల్లవారుజాము నుంచి ఇదే పరిస్థితి ఉంది. కొందరు పసి పిల్లలను సంకనెత్తుకుని.. కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ పుష్కరఘాట్‌కు చేరుకుంటున్నారు. కాళేశ్వరం ప్రధాన రహదారి నుంచి అన్నారం క్రాస్‌రోడ్డు తొమ్మిది కిలోమీటర్ల దూరం ఉంటుంది. అధికారులు రెండు రోజుల నుంచి వాహనాలను అన్నారం క్రాస్‌లోని స్తూపం నుంచి అన్నారం మీదుగా మద్దులపల్లి, పూస్కుపల్లి నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని కాళేశ్వర మార్గాన్ని వన్‌ వేగా మార్చి మళ్లిస్తున్నారు.

అందుకే ట్రాఫిక్ సమస్య..

ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్‌ వైపు జిల్లాల నుంచి వచ్చే వాహనాలు కాటారం- మహదేవపూర్‌ మీదుగా ఈ దారి గుండా కాళేశ్వరానికి చేరుకుంటున్నాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి వచ్చే వాహనాలు కాటారం గుండ్రాతిపల్లి మీదుగా ఈ మార్గంలో వచ్చి చేరుతుండడంతో.. ట్రాఫిక్‌ సమస్య పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. శనివారం కూడా 8 కిలోమీటర్ల మేర వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి.

గంటల తరబడి..

ఉమ్మడి ఆదిలాబాద్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలు సిరోంచ- కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన మీదుగా పుష్కరఘాట్‌కు చేరుకుంటాయి. సన్నిధానం నుంచి వంతెన అవతలి వైపు వరకు సుమారు 6 కిలోమీటర్ల మేర వాహనాలు గంటల తరబడి నిలిచాయి. ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్‌ జిల్లా నుంచి వచ్చే వాహనాలు.. అన్నారం క్రాస్‌ వన్‌వేతో పాటు కాళేశ్వరం ప్రధాన మార్గం మీదుగా మళ్లించారు. మహదేవపూర్‌ నుంచి కాళేశ్వరం వరకు 17 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచింది.

మరిన్ని బస్సులు వేయాలి..

ట్రాఫిక్‌తో గంటల కొద్ది మార్గమధ్యలో ఆగిపోయామని భక్తులు చెబుతున్నారు. చిన్నారులు ఉండడంతో తాగునీటికి ఇబ్బంది పడ్డామని అంటున్నారు. కిలోమీటర్ల మేర కాలినడకన వచ్చి నీటి కోసం వెతికామని వాపోతున్నారు. ఉచిత బస్సులు ఎక్కే ప్రాంతంలో పోలీసులను పెట్టి నియంత్రిస్తూ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రద్దీకి అనుగుణంగా మరిన్ని బస్సులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఎందుకీ సమస్య..

ప్రస్తుతం వేసవి సెలవులు ఉన్నాయి. ఇక్కడికి చేరుకోవడానికి సమీపంలో రైల్వే స్టేషన్ లేదు. దీంతో చాలామంది సొంత వాహనాల్లో పుష్కరాలకు వస్తున్నారు. అటు రోడ్లు కూడా చాలా ప్రాంతాల్లో వెడల్పు ఉండవు. అటవీ ప్రాంతం కావడంతో.. సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండవు. ఫలితంగా భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత కథనం