Hyderabad : మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో భారీ చోరీ.. నగదు, బంగారు ఆభరణాలు మాయం!
Hyderabad : హైదరాబాద్‌లో మరో వీఐపీ ఇంట్లో దొంగతనం జరిగింది. మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో బంగారు ఆభరణాలు, డబ్బును దొంగలు దోచుకెళ్లారు. దీంతో ఆయన సతీమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో దొంగలుపడ్డారు. రూ.లక్షన్నర నగదు, భారీగా బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. గుర్తించిన పొన్నాల లక్ష్మయ్య సతీమణి అరుణాదేవి.. జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం రాత్రి చోరీ జరిగినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. జూబ్లిహిల్స్ ఏరియాలో చోరీలు జరగడం చర్చనీయాంశంగా మారింది. తెలిసిన వారే చోరీకి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
భట్టి ఇంట్లో..
గతేడాది సెప్టెంబర్ మాసంలో.. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 లోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ జరిగింది. ఆ చోరీ నిందితులను ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు బీహార్‌కి చెందిన రోషన్ కుమార్ మండల్, ఉదయ్ కుమార్ ఠాకూర్‌గా గుర్తించారు. నిందితుల నుంచి రూ.2.2 లక్షల నగదు, 100 గ్రాముల బంగారం, విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు.
మోహన్ బాబు ఇంట్లో..
ఇటీవల హీరో మోహన్ బాబు ఇంట్లో పని చేసే వ్యక్తి షాక్ ఇచ్చాడు. ఆయన ఇంట్లోనే దొంగతనం చేశాడు. నాయక్ అనే వ్యక్తి గత కొంత కాలంగా హైదరాబాద్ శివారులో జల్‌పల్లిలో మోహన్ బాబు ఇంట్లో పని చేస్తున్నాడు. ఇటీవల రాత్రిపూట దాదాపు రూ.10 లక్షల నగదుతో ఉడాయించాడు. ఇది గమనించిన మోహన్ బాబు.. వెంటనే రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. 10 గంటల్లోనే నిందితుడిని తిరుపతిలో అరెస్టు చేశారు.
డ్రైవర్‌పై అనుమానం..
ఇటీవల హైదరాబాద్ శివారులో భారీ దొంగతనం జరిగింది. ఓ ఇంట్లో రూ.2 కోట్లకు పైగా నగదు, బంగారం అపహరణకు గురైంది. పోచారం ఐటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ చోరి జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి నాగభూషణం ఇంట్లో దొంగలు రెండు కోట్ల నగదు తోపాటు భారీగా నగలు ఎత్తుకెళ్లారు. నాగభూషణం ఉదయం పాల కోసం బయటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి దొంగలు చోరీకి పాల్పడ్డారు.
రూ.రెండు కోట్ల నగదుతో పాటు 28 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు బాధితుడు వాపోయాడు. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్‌టీం సాయంతో విచారణ చేపట్టారు. తెలిసిన వారే దొంగతనం చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నాగభూషణం వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తిపై అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.