Massive fire breaks out in Swapnalok Complex: ఈ మధ్య కాలంలో హైదరాబాద్ నగరంలో భారీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అగ్నిమాపకశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నప్పటికీ.. తాజాగా సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం సాయంత్రం స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో 7,8 అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగసిపడుతుండగా.. భవనంలో పలువురు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని కాపాడేందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది ప్రయత్నిస్తోంది.,,లోపల ఎంతమంది ఉన్నారు..?ఘటనాస్థలిలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. సంఘటనా స్థలానికి నాలుగు ఫైరింజన్లను తరలించి, మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్నారు. భవనం లోపల చిక్కుకున్న ఏడు మందిని రక్షించగా... మరో ఎనిమిది మంది లోపల ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని బయటికి తీసుకువచ్చేందుకు అగ్నిమాపక శాఖ తీవ్రంగా శ్రమిస్తోంది. అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న మంత్రి తలసాని.. అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. లోపల ఇంకా ఎంతమంది ఉన్నారనేది స్పష్టత రావాల్సి ఉందని చెప్పారు.,ఇదిలా ఉంటే ఇదే ఏడాది జనవరిలో సికింద్రాబాద్ నల్లగుట్టలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆరంతస్తుల భవనంలో ఉదయం దుకాణాలు తెరువక ముందే మంటలు వ్యాపించాయి. గోడౌన్‌లో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. అవి క్రమంలో పై అంతస్తులో ఉన్న షోరూంకు వ్యాపించాయి.ఏకధాటిగా 10 గంటల పాటు తగలబడడమంతో.. భవనం మొత్తం ధ్వంసమైంది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అగ్నికి ఆహుతయ్యారు.,అయితే హైదరాబాద్ మహానగరంలో ఈ మధ్య కాలంలో వరుసగా అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా గోడౌన్ ల్లో ఈ ఘటనలు జరుగుతున్నాయి. కోట్లాది రూపాయల ఆస్తి నష్టంతో పాటు పలుచోట్ల ప్రాణాలు కూడా కోల్పోయారు. మరోవైపు జనావాసులు ఉంటున్న ప్రాంతాల్లో ఈ తరహా ప్రమాాదాలు జరుగుతుండటం ఆందోళనకరంగా మారింది. ఓవైపు అధికారులు చర్యలు చేపడుతున్నప్పటికీ… పరిస్థితి మారటం లేదు. ఆయా గోదాంల అనుమతులను పరిశీలించాలని… ఫైర్ సెఫ్టీ నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు.