చార్మినార్ పాతబస్తీలో తీవ్ర విషాదం - అగ్నిప్రమాదంలో 17కు చేరిన మృతుల సంఖ్య-massive fire breaks out in a building nare charminar in hyderabad latest updates check here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  చార్మినార్ పాతబస్తీలో తీవ్ర విషాదం - అగ్నిప్రమాదంలో 17కు చేరిన మృతుల సంఖ్య
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్

చార్మినార్ పాతబస్తీలో తీవ్ర విషాదం - అగ్నిప్రమాదంలో 17కు చేరిన మృతుల సంఖ్య

Updated May 18, 2025 03:48 PM ISTUpdated May 18, 2025 03:48 PM ISTMaheshwaram Mahendra Chary
  • Share on Facebook
Updated May 18, 2025 03:48 PM IST

  • హైదరాబాద్‌ చార్మినార్‌ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.గుల్జార్ హౌస్‌లోని ఓ భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ విషాద ఘటనపై ప్రధాని మోదీ, సీఎం రేవంత్ సహా పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లైవ్ అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి

Sun, 18 May 202510:18 AM IST

గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంపై రాహుల్ గాంధీ విచారం వ్యక్తం

హైదరాబాద్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదంలో పలువురు మృతి చెందడం అత్యంత బాధాకరం అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Sun, 18 May 202510:18 AM IST

గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం అత్యంత బాధాకరం - వైఎస్ జగన్

హైదరాబాద్‌ పాతబస్తీ మీర్‌ చౌక్‌ గుల్జార్‌ హౌస్‌ అగ్ని ప్రమాదంలో పలువురు మృతి చెందడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

Sun, 18 May 202508:35 AM IST

గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంలో కేసీఆర్ దిగ్భ్రాంతి

పాతబస్తీ చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది అభాగ్యులు మృత్యువాత పడడం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తీవ్ర సంతాపం ప్రకటించారు. అగ్నిప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించి కాపాడాలని, మరణించిన వారి కుటుంబాలకు ఆర్థికసాయం చేసి అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ సూచించారు.

భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా నిత్యం అప్రమత్తంగా ఉంటూ తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి కేసీఆర్ సూచించారు.

మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Sun, 18 May 202508:10 AM IST

సీఎం రేవంత్‌కు మల్లికార్జున ఖర్గే ఫోన్‌

సీఎం రేవంత్‌కు మల్లికార్జున ఖర్గే ఫోన్‌ చేశారు. అగ్నిప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నామని సీఎం రేవంత్‌ వివరించారు. మంత్రులు ఘటనా స్థలానికి వెళ్లారని సీఎం రేవంత్‌ చెప్పారు.

Sun, 18 May 202508:03 AM IST

సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం

ఇంట్లోకి వెళ్లేందుకు ఒకే మెట్ల మార్గం ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. నిచ్చెనలతో మొదటి అంతస్తులోకి వెళ్లాల్సి వచ్చింది. లోపలికి వెళ్లి స్పృహ తప్పి ఉన్న పలువురిని బయటకు తీసుకొచ్చారు. అనంతరం వారిని అంబులెన్స్‌లలో వివిధ ఆస్పత్రులకు తరలించారు. వారిలో కొందరు మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచారు.

Sun, 18 May 202507:40 AM IST

విద్యుదాఘాతంతోనే ప్రమాదం - డీజీ నాగిరెడ్డి

ప్రమాద స్థలాన్ని అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి పరిశీలించారు. విద్యుదాఘాతం ప్రమాదం జరిగిందన్నారు.

Sun, 18 May 202507:24 AM IST

8 మంది చిన్నారులు

మీర్‌చౌక్‌ భారీ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 17కు చేరింది. వీరిలో ఎనిమిది మంది చిన్న పిల్లలు ఉన్నారు.

Sun, 18 May 202507:17 AM IST

17 మంది మృతి

ఉదయం 6.16 గంటలకు ప్రమాదం జరిగింది. గుల్జార్ హౌస్ లోని రెండత్తుల భవనలో జరిగిన ఘటనలో 17 మంది చనిపోయారు. మొదటగా గ్రౌండ్ ఫ్లోర్ మంటలు రాగా..పైకి వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే రెస్యూ బృందాలు ఆపరేషన్ మొదలుపెట్టాయని అగ్నిమాపక శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

Sun, 18 May 202507:12 AM IST

ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

గుల్జార్‌హౌస్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం అందిస్తామన్నారు.

Sun, 18 May 202506:48 AM IST

చాలా బాధాకరమైన ఘటన - కేటీఆర్

చార్మినార్ కు సమీపంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆక్షించారు.

Sun, 18 May 202506:44 AM IST

17కు చేరిన మృతుల సంఖ్య

మీర్‌చౌక్‌ భారీ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 17కి చేరింది. మృతుల్లో ఎనిమిది మంది చిన్న పిల్లలు ఉన్నారు. నలుగురు అరవై ఏళ్ళ నుంచి డెబ్బై ఐదేళ్ల ఏళ్ల వయస్సు వారు ఉన్నారు. మరో ఐదుగురు ముప్పై నుంచి నలభై ఏళ్ల లోపు వయస్సు వారు ఉన్నారు.

Sun, 18 May 202506:42 AM IST

ఏపీ సీఎం దిగ్భ్రాంతి

అగ్ని ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

Sun, 18 May 202506:35 AM IST

మృతుల వివరాలు

రాజేంద్రకుమార్‌ (67)

అభిషేక్‌ మోదీ (30)

రజని అగర్వాల్‌

అన్య మోదీ

పంకజ్‌ మోదీ

వర్ష మోదీ

ఇద్దిక్కి మోదీ

రిషభ్‌

ప్రథమ్‌ అగర్వాల్‌

ప్రాంశు అగర్వాల్‌

సుమిత్ర (65)

మున్నీబాయి (72)

ఆరుషి జైన్‌ (17)

శీతల్‌ జైన్‌ (37)

ఇరాజ్‌ (2)

హర్షాలీ గుప్తా (7)

Sun, 18 May 202506:33 AM IST

మృతులకు ఎక్స్ గ్రేషియా - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారి స్పందించారు. “గుల్జార్‌ హౌస్‌ వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో 16మందికి పైగా మరణించడం బాధాకరం. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశాను. మృతుల్లో చిన్నారులు సైతం ఉండడం దిగ్భ్రాంతికి గురిచేసింది. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించాను. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా, క్షతగాత్రులకు రూ.50 వేల ఆర్ధిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి.. మరోసారి నగరంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి” అని కిషన్ రెడ్డి తెలిపారు.

Sun, 18 May 202506:30 AM IST

రూ. 25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి - హరీశ్ రావ్

“హైదరాబాద్​లోని పాత బస్తీలో గుల్జార్‌ హౌస్‌ సమీపంలో అగ్నిప్రమాదం జరిగి 11 మంది మృతి చెందటం అత్యంత బాధాకరం. మంటల్లో చిక్కుకున్న కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రాష్ట్రంలో, హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాద ఘటనలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో దారుణంగా విఫలమవుతున్నది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి వెంటనే అగ్నిమాపక శాఖ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం” అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Sun, 18 May 202506:29 AM IST

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

హైదరాబాద్​ ఓల్డ్ సిటీ మీర్ చౌక్ లోని గుల్జార్‌ హౌస్‌ వద్ద జరిగిన అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మంటల్లో చిక్కుకున్న కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని మంత్రి గారిని, ఉన్నతాధికారులను ఆదేశించారు. పోలీస్​, ఫైర్​ విభాగం చేపడుతున్న చర్యలను ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించి సరైన వైద్య సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఐజీ నాగిరెడ్డి గారిని ఆదేశించారు

Sun, 18 May 202506:26 AM IST

కుట్ర కోణం లేదు - మంత్రి పొన్నం

“అగ్ని ప్రమాదంలో కుట్ర కోణం లేదు.. ప్రమాదవశాత్తు జరిగింది. ఏ అధికారి నిర్లక్ష్యం చేయకుండా ప్రమాదాన్ని తగ్గించారు. వారి కుటుంబాలను ఆడుకోవడానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. చనిపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం సంతాపాన్ని తెలుపుతుంది. ఘటనలో 17 మంది ఉన్నారు ఎంత మంది చనిపోయారు అనేది అధికారికంగా రావాల్సి ఉంది. సంఘటన జరగగానే అన్న డిపార్ట్మెంట్ లు చర్యలు తీసుకున్నాయి” అని మంత్రి పొన్నం వివరించారు.

Sun, 18 May 202506:25 AM IST

ఉదయం వేళ షార్ట్ సర్యూట్ జరిగింది - మంత్రి పొన్నం

“ఉదయం పూట 6:16 గంటలకు ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం రాగానే వెనువెంటనే నిమిషాల్లో ఫైర్ సిబ్బంది వచ్చి అగ్ని ప్రమాద నివారణ చర్యలు చేపట్టి మంటలు ఆర్పేశారు. అందులో నివసిస్తున్న 17 మంది కి తీవ్ర ఇబ్బందులు కలిగాయి. వారందరినీ హాస్పిటల్ కి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం వారందరికీ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. అగ్ని ప్రమాదంలో మెజారిటీ గా మరణించారనీ సమాచారం ఉంది. ప్రభుత్వం తరుపున అని రకాల చర్యలు చేపట్టాం” అని మంత్రి పొన్నం చెప్పారు.

Sun, 18 May 202506:25 AM IST

మెరుగైన వైద్యానికి ఆదేశాలు

అగ్ని ప్రమాద ఘటన పై హైదరాబాద్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరా తీశారు. అధికారులతో పాటు బాధిత కుటుంబాలతో మాట్లాడి వారికి అండగా ఉంటానని తెలిపారు. గాయపడిన వారికి నాణ్యమైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

Sun, 18 May 202506:22 AM IST

మృతుల వివరాలు

షీతల్‌ జైన్‌ (37), రాజేందర్‌ కుమార్‌ (67), సుమిత్ర (65), మున్నిబాయి (72), ఇరాజ్‌ (2), అభిషేక్‌ మోడీ (30), ఆరుషి జైన్‌ (17), హర్షాలి గుప్తా (7)ను మృతులుగా గుర్తించారు. మరికొంత మంది వివరాలు తెలియాల్సి ఉంది.

Sun, 18 May 202506:22 AM IST

కేంద్ర సాయాన్ని కోరుతాను - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

అగ్ని ప్రమాద ఘటనపై కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ …. "ఒక కుటుంబానికి చెందిన ముత్యాల దుకాణంలో మంటలు చెలరేగాయి. వారి ఇల్లు దుకాణం పైన ఉన్న అంతస్తులో ఉంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో చాలా మంది మరణించారు. కొందరు గాయపడ్డారు. కానీ హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం కాబట్టి… పోలీసు, మున్సిపల్, అగ్నిమాపక మరియు విద్యుత్ విభాగాలను బలోపేతం చేయాలి. ప్రధానమంత్రితో మాట్లాడిన తర్వాత, మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతాను" అని కిషన్ రెడ్డి వివరించారు.

Sun, 18 May 202506:21 AM IST

షార్ట్ సర్క్యూట్

షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే దట్టమైన పొగలు సంభవించాయి. అప్రమత్తమైన స్థానికులు…. పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అగ్నిప్రమాద సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఎస్డీఆర్‌ఎఫ్‌, పోలీసు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలో ఉన్న కొందర్నీ బయటకు తీసుకురాగలిగారు.

Sun, 18 May 202506:20 AM IST

మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్

ఆదివారం ఉదయం 6 తర్వాత ఓ భవనంలో ప్రమాదం సంభవించింది. ఈక్రమంలోనే భవనంలో ఉన్న ఏసీ కంప్రెషర్ పేలటంతో తీవ్రత పెరిగింది. ఈ ఘోర ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. గాయపడిన వారిని దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించారు.

ఈ అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. మొదట ఎనిమిది మంది చనిపోగా… ఆ తర్వాత 11కు చేరింది. ఆ కాసేపటికే 16కు చేరిపోయింది. ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Sun, 18 May 202506:20 AM IST

16 మంది మృతి

ఓ భవనంలోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 16 మంది మృతిచెందారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిసింది.ృ

Sun, 18 May 202506:18 AM IST

పాతబస్తీలో తీవ్ర విషాదం

హైదరాబాద్‌ చార్మినార్‌ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.గుల్జార్ హౌస్‌లోని ఓ భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందారు