Mini Medaram Jathara 2025 : మినీ మేడారం జాతర షురూ - వన దేవతల దర్శనానికి భారీగా తరలివస్తున్న భక్తులు
మినీ మేడారం జాతర ప్రారంభమైంది. వన దేవతల దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. జంపన్న వాగులో స్నానాలు ఆచరిస్తున్న భక్తులు…. వన దేవతలకు మొక్కులు సమర్పిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో ఆదివాసీ సంప్రదాయాల నడుమ వన దేవతల జాతర ప్రారంభమైంది. అమ్మవార్లను గద్దెల మీదకు తీసుకురావడం మినహా మిగతా అన్ని కార్యక్రమాలు మహా జాతర మాదిరిగానే జరగనుండగా, ఈ నెల 15వ తేదీ వరకు ఈ మేడారం మినీ జాతర కొనసాగనుంది.
ఈ మేరకు బుధవారం ఉదయం సమ్మక్క, సారలమ్మ పూజారులు ఆదివాసీ గిరిజన సంప్రదాయం ప్రకారం ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను అలంకరించి, పూజలు నిర్వహించారు. అంతకుముందు సమ్మక్క పూజా మందిరాన్ని అలుకు పూత చేసి రంగురంగుల ముగ్గులతో సుందరంగా తీర్చిదిద్దారు.
అమ్మవార్లకు చీరలు, పసుపు, కుంకుమలతో సారె సమర్పించారు. బొడ్రాయితో పాటు గ్రామ దేవతలకు పూజలు చేసి జాతరను ప్రారంభించారు. అనంతరం భక్తులను అనుమతించడంతో గద్దెల వద్ద సందడి మొదలైంది. ఇదిలాఉంటే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేయగా.. ఉమ్మడి వరంగల్ లోని వివిధ డిపోల నుంచి ఆర్టీసీ 200 బస్సు సర్వీసులు నడిపిస్తోంది.
10 లక్షల మంది భక్తుల అంచనా…!
ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నాలుగు రోజుల పాటు వన దేవతలైన సమ్మక్క, సారలమ్మ మేడారం మహా జాతర జరుగుతుంటుంది. మాఘ శుద్ధ పౌర్ణమి నుంచి ఈ జాతర ప్రారంభం కానుండగా.. ప్రతి సంవత్సరం ఆదివాసీ పూజారులు సమ్మక్క, సారలమ్మకు పూజలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే రెండేళ్లకోసారి మహాజాతర జరుగుతుండగా, ఆ తరువాతి సంవత్సరం మాఘ శుద్ధ పౌర్ణమి నుంచి జరిగే పూజల సమయంలో భక్తులు కూడా పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో మినీ జాతర కూడా నిర్వహిస్తునారు.
కాగా మినీ జాతరకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 10 లక్షల మంది వరకు భక్తులు తరలివస్తుంటారని అంచనా వేస్తున్నారు. కాగా బుధవారం మేడారం మినీ మేడారం జాతర ప్రారంభం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జంపన్నవాగులో స్నానాలాచరించి, వన దేవతలకు మొక్కులు సమర్పించుకున్నారు.
మేడారంలో భక్తుల సందడి
మేడారం మినీ జాతర సందర్భంగా సమ్మక్క ఆలయంలో పూజారులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కన్నేపల్లిలోని సారలమ్మ ఆలయంతోపాటు కొండాయిలోని గోవిందరాజులు, పూనుగొండ్ల లో పగిడిద్ద రాజు ఆలయంలో కూడా పూజలు చేశారు. కాగా వన దేవతల దర్శనానికి వచ్చిన భక్తులతో మేడారంలో సందడి నెలకొంది. శివ సత్తుల పూనకాలతో మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణం పులకించిపోయింది.
ఇదిలా ఉంటే మేడారం వన దేవతల జాతర సందడి వారం రోజుల ముందు నుంచే ప్రారంభవుతుంది. జాతరకు సరిగ్గా వారం రోజుల ముందు గుడిమెలిగె, మండెమెలిగే పండుగలతో మేడారంలో సందడి సంతరించుకోగా.. ములుగులోని గట్టమ్మ ఆలయం వద్ద నాయక్ పోడు వంశస్థులు ఎదురుపిల్ల పండుగ నిర్వహించి జాతరకు అంకురార్పణ చేసిన విషయం తెలిసిందే. ఇదిలాఉంటే మరో మూడు రోజుల పాటు మేడారం మినీ జాతర జరగనుండగా.. గత మినీ జాతరతో పోలిస్తే ఈసారి ఇంకా ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి).
సంబంధిత కథనం