తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా, పాశమైలారం పారిశ్రామిక వాడలోని ఒక కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. భారీ పేలుడు సంభవించి కొందరు కార్మికులు అక్కడికక్కడే మరణించగా, మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇప్పడి వరకు మెుత్తం 13 మంది మరణించారు. మరో 12 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మంటలను ఆర్పడానికి, సహాయక చర్యల కోసం 11 అగ్నిమాపక యంత్రాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉత్పత్తి యూనిట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మైక్రోక్రిస్టలైన్ సెల్యులోజ్, ఇతర ఫార్మా ఎక్సిపియంట్స్, ఆహార పదార్థాలను తయారు చేసే ప్రముఖ సంస్థ ఇది. "ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు పటాన్‌చెరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు" అని పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన అన్నారు.
పేలుడుకు గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. "పేలుడు ధాటికి పారిశ్రామిక షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది... పేలుడు తీవ్రత ఎంతగా ఉందంటే, కొంతమంది కార్మికులు సుమారు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు" అని కార్మికులను ఉటంకిస్తూ అధికారి తెలిపారు. ఒక భవనం కుప్పకూలగా, పక్కనే ఉన్న మరో భవనం పాక్షికంగా దెబ్బతింది. "దాదాపు కార్మికులందరూ యూనిట్ నుండి బయటకు పరుగులు తీశారు, కానీ కొందరు కార్మికులు ఇంకా లోపల చిక్కుకొని ఉండవచ్చని భయపడుతున్నారు" అని ఆయన చెప్పారు.
మంటలను ఆర్పడానికి, సహాయక చర్యల కోసం 11 అగ్నిమాపక యంత్రాలు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి. ప్రవిణ్య, పోలీస్ సూపరింటెండెంట్ పరితోష్ పంకజ్ ఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు.
ఈ పేలుడుతో దట్టమైన పొగ వ్యాపించి, ప్రజలకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలిగించింది, దీంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. ముందు జాగ్రత్త చర్యగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
సీగాచి పరిశ్రమలో జరిగిన ఘోర పేలుడు స్థలాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మరికొద్ది సేపట్లో పరిశీలించనున్నారు. ఇప్పటికే పేలుడులో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయాన్ని అందించాల్సిందిగా జిల్లా కలెక్టర్ ను మంత్రి ఆదేశించారు. వెంటనే పేలుడు జరిగిన ఫ్యాక్టరీ స్థలంలో సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్ ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్లలో పాల్గొన్నారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.
‘సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగి 10 మంది చనిపోయినట్టు వస్తోన్న వార్తలు కలచి వేశాయి. రియాక్టర్ పేలుడు ఘటనలో గాయపడిన కార్మికులకు ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందించాలి. ప్రమాదంలో మృతి చెందిన కార్మిక కుటుంబాలను ఆదుకోవాలి.’ అని ఎమ్మెల్సీ కవిత ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
‘సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగి కార్మికులు అందులో చిక్కుకోవడం అత్యంత విషాదకరం. కార్మికులు, సిబ్బందిని కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు వెంటనే చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.’ అని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే హరీష్ రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.