Adilabad : ఆమెకు ఇంటా.. బయటా అన్యాయమే.. అవసరం కోసం వస్తే.. అత్యాచారానికి పాల్పడ్డారు
Adilabad : ఏదో ఒక పూట, రోజుకొక చోట కామాంధుల చేతుల్లో మహిళలు బలైపోతున్నారు. అవసరం కోసం వస్తే.. అవకాశంగా తీసుకొని అత్యాచారానికి పాల్పడుతున్నారు. తాజాగా సాయం కోసం వచ్చిన ఓ వివాహితపై ఆదిలాబాద్‌లో అత్యాచారం జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇంట్లో భర్తతో గొడవపడి వచ్చిన ఓ వివాహితపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. కానిస్టేబుల్ రాథోడ్ అనిల్ శుక్రవారం రాత్రి స్థానిక బస్టాండ్ సమీపంలో విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఓ ఆటో డ్రైవర్ అతని వద్దకు వచ్చాడు. తన ఆటోలో ఓ మహిళ స్పృహ తప్పి పడిపోయిందని చెప్పాడు.
కోలుకున్నాక..
స్పందించిన అనిల్ వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె కాస్త కోలుకొని స్పృహలోకి వచ్చిన అనంతరం వివరాలను సేకరించారు. స్థానికంగా ఉంటూ కూలీ షనులు చేసుకొని జీవించే ఆమె.. తన భర్తతో గొడవపడి శుక్రవారం ఇంటినుంచి వచ్చేసింది. బస్టాండ్ సమీపంలో ఆమెకు యోగేశ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అవసరం నిమిత్తం తనకు డబ్బులు కావాలని అతడిని అడిగింది.
మరో వ్యక్తికి ఫోన్ చేసి..
దీంతో అతడు కల్యాణ్ అనే మరో వ్యక్తికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. అతడు వచ్చి వివాహితకు సాయం చేస్తానని నమ్మించాడు. తనతోపాటు స్థానికంగా ఉన్న ఓ లాడ్జిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
సీతక్క ఆరా..!
అత్యాచార ఘటనపై మంత్రి సీతక్క స్పందించారు. జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని ఆదేశించారు.
(రిపోర్టింగ్: వేణుగోపాల్ కామోజీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి, హిందూస్తాన్ టైమ్స్ తెలుగు)