Sangareddy Crime: టీనేజీ బాలికతో వివాహితుడి వ్యవహారం,యువకుడిని చంపి, శవాన్ని కాల్చేసిన బాలిక తండ్రి
Sangareddy Crime: సంగారెడ్డిలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన జరిగింది. టీనేజీ బాలికతో వివాహితుడి ప్రేమ వ్యవహారం హత్యకు దారి తీసింది. తన కుమార్తెతో సాన్నిహిత్యం పెంచుకోడాన్ని తట్టుకోలేక పోయిన బాలిక తండ్రి, యువకుడిని నరికి చంపి శవాన్నీ కాల్చేయడం కలకలం రేపింది.

Sangareddy Crime: పెళ్ళై ఇద్దరు పిల్లలున్న యువకుడు మైనర్ బాలికపై కన్నేశాడు. ఆమెతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఇది తెలుసుకున్న బాలిక తండ్రి అతడిని ముక్కలు ముక్కలుగా నరికి శవాన్ని కాల్చివేయడం కలకలం రేపింది.
పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్న ఒక యువకుడు, స్కూలుకు వెళ్లే మైనర్ బాలికను ప్రేమ పేరుతో తప్పు దోవ పట్టిస్తున్నాడని కక్ష పెంచుకున్న బాలిక తండ్రి, ఆ యువకుడిని ముక్కలు ముక్కలుగా నరికాడు. ఈ సంఘటన, సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ ప్రాంతంలో సంచలనం సృష్టించింది.
వివరాల్లోకి వెళితే జిల్లాలోని నిజాంపేట్ మండలంలో ఉన్న రామచంద్ర తండా కు చెందిన దశరథ్ (26) కు పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాను సంగారెడ్డి పట్టణంలో ఉంటూ, గణపతి షుగర్ కంపెనీ లో లారీ డ్రైవర్ గ పనిచేస్తూ గత కొంత కాలంగా జీవనం సాగిస్తున్నాడు.
కసితో రగిలిపోయిన తండ్రి .…
కొంత కాలంగా మృతుడు దశరథ్ తన గ్రామానికి దగ్గరలోని మెగ్యా నాయక్ తండాలో నివసిస్తున్న మైనర్ బాలికపై కన్ను వేసి, తనను ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపినట్టు తెలుస్తుంది. జిల్లాలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ బాలిక, దశరథ్ మాయమాటలు నమ్మి, తరచుగా అతడిని కలుస్తున్నట్టు తెలుచుకున్న ఆ బాలిక తండ్రి గోపాల్ కసితో రగిలిపోయాడు. తన కూతురు జీవితాన్ని నాశనం చేస్తున్న, దశరథ్ ను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు.
నాలుగు రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లి .…
నాలుగు రోజుల క్రితం, సంగారెడ్డి లో తన కిరాయి ఇంటి నుండి బయటకి వెళ్లిన దశరథ్ ఇంటికి తిరిగి రాకపోవటంతో, దశరథ్ భార్య సంగారెడ్డి పోలీసు స్టేషన్ లో మిస్సింగ్ కేసు పెట్టింది. ఒకవైపు పోలీసులు, కేసు విచారణ చేస్తుండగా, గోపాల్ శనివారం సాయంత్రం నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్ కు వచ్చి దశరథ్ ను తానే చంపానని అంగీకరిస్తూ పోలీసుల ముందు లొంగిపోయాడు.
హత్య తర్వాత, తానే శవాన్ని కాల్చేశానని పోలీసులకు చెప్పటంతో అప్పటికే మిస్సింగ్ కేసు నమోదు కావడంటో చిక్కుముడి వీడింది. శనివారం నుండి గ్రామంలో శవాన్ని చూపిస్తానని పోలీసులకు చుక్కలు చూపించిన గోపాల్, చివరకి శవాన్ని నిజాం పేట మండలంలోని ఈద్గా తండా వద్ద చూపించాడు.
శవాన్ని ముక్కలుగా చేయటంతో పాటు, పెట్రోల్ పోసి నిప్పంటించినట్టు పోలీసులు రూడీ చేసుకున్నారు. శవ అవశేషాలను నారాయణఖేడ్ ఆసుపత్రికి తరలించిన, నారాయణఖేడ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు పిల్లల తల్లియైన దశరథ్ భార్య, ప్రస్తుతం ఐదు నెలల గర్భిణీ అని తెలుస్తోంది. దశరథ్ కుటుంబసభ్యులు, తమకు న్యాయం చేయాలనీ, హైదరాబాద్- నారాయణఖేడ్ రోడ్ పైన ధర్నా చేసారు. దశరథ్ కు ఏ పాపం తెలియదని, గోపాల్ ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
సంబంధిత కథనం