Maoists Letter : సరిహద్దులో జరిగిన ఎన్ కౌంటర్ బూటకం, రేవంత్ సర్కార్ బాధ్యత వహించాలి - మావోయిస్టుల లేఖ-maoists released letter on pujari kanker forest encounter incident ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Maoists Letter : సరిహద్దులో జరిగిన ఎన్ కౌంటర్ బూటకం, రేవంత్ సర్కార్ బాధ్యత వహించాలి - మావోయిస్టుల లేఖ

Maoists Letter : సరిహద్దులో జరిగిన ఎన్ కౌంటర్ బూటకం, రేవంత్ సర్కార్ బాధ్యత వహించాలి - మావోయిస్టుల లేఖ

HT Telugu Desk HT Telugu
Apr 07, 2024 07:23 AM IST

Maoists Letter On Pujari Kanker Encounter: ఛత్తీస్ గడ్ తెలంగాణ సరిహద్దులో జరిగిన జరిగిన ఎన్ కౌంటర్ కు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతల వహించాలంటూ మావోయిస్టుల పేరిట ఓ లేఖ విడుదలైంది. ఈ ఎన్ కౌంటర్ బూటకమని పేర్కొన్నారు.

మావో.ిస్టుల పేరిట విడుదలైన లేఖ
మావో.ిస్టుల పేరిట విడుదలైన లేఖ

Pujari Kanker Forest Encounter: ఛత్తీస్ గడ్ తెలంగాణ సరిహద్దులో జరిగిన ఎన్ కౌంటర్ కు( Maoists killed in encounter) తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని మావోయిస్టులు హెచ్చరించారు. ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో కామ్రేడ్స్ పై ములుగు జిల్లా ఎస్పీ పథకం ప్రకారం ఎన్ కౌంటర్ కు పాల్పడ్డాడని ఆరోపించారు. తప్పకుండా ఆ ఎన్ కౌంటర్ కు నెత్తుటి బాకీ తీర్చుకుంటామని మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం అల్లూరిసీతరామరాజు డివిజన్ కమిటీ ఆజాద్ పేరిట విడుదలైన లేఖలో హెచ్చరించారు.

మావోల లేఖ పూర్తి సారాంశం…

“ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాజ్యం స్వభావం మారడం లేదు. ప్రజల కోసం పోరాడుతున్న మావోయిస్టులపై తెలంగాణ, చత్తీస్ఘడ్ - మహారాష్ట్ర పోలీసులు రాజ్యహింసకు తెగబడుతున్నారు. కార్పోరేట్ కంపనీల అడుగులకు మడుగులొత్తేలా వారు పనిచేస్తున్నారు. ఈ హింసలో పార్టీలకు ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. బీజేపీ, కాంగ్రేస్, బీఆర్ఎస్ అన్ని పార్టీలదీ ఒకటే వ్యూహం, ఒకటే దారి. మావోయిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఎన్నికల్లో ఒకరిపై ఒకరు విమర్షలు, ప్రతి విమర్శలు చేసుకున్నా పాలించే విధానంలో ఎలాంటి మార్పు లేదు. ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న విలువైన ఖనిజాలు, వనరులను పెద్ద పెద్ద కంపనీలకు, సామ్రాజ్యవాద తొత్తులకు గుండుగుత్తగా తాకట్టు పెట్టే క్రమంలో అక్కడ ఉన్న ఆదివాసీ ఉద్యమాలను రాక్షసంగా అనగదొక్కుతున్నారు. దండకారణ్యం అంతా పోలీసు క్యాంపులతో నింపేస్తున్నారు. ఓ పక్క డ్రోన్లు, హెలీకాప్టర్లతో ఆకాశ మార్గంగుండా దాడులు చేస్తున్నారు. ఇటీవల కాలంలో మహారాష్ట్ర సరిహద్దులో ముగ్గురు కామ్రేడ్స్ పై విషప్రైయోగం చేసి పట్టుకొని అతి కిరాతకంగా హింసించి ఎన్ కౌంటర్ కథలల్లారు. ఈ రోజు బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ పూజారికాంకేర్ తెలంగాణ గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ, కోబ్రా పోలీసులకి మావోయిస్టులకు మధ్య జరిగిన భయంకర యుద్ధంలో మా కామ్రేడ్స్ ముగ్గురు అమరులయ్యారు” అని లేఖలో పేర్కొన్నారు.

“తెలంగాణ ఎస్ జెడ్సీ సభ్యులు కామ్రేడ్ సాగర్ తో పాటు కామ్రేడ్ మణిరాం ( ఏసీఎం) మరో కామ్రేడ్ ముగ్గురూ అమరులయ్యారు. వారికి మావోయిస్టు పార్టీ ఎర్రెర్ర విప్లవ జ్యోహార్లు అర్పిస్తుంది. వారి పోరాట పఠిమను కొనియాడుతూ వారికి లాల్ సలాంలు తెలుపుతుంది. వారి ఎన్ కౌంటర్ కు కారకులైన ములుగు ఎస్పీ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా పరిపాలించిన కేసీఆర్ మావోయిస్టు ఎజెండానే తన జెండాఅని అధికారం చేపట్టాక మావోయిస్టు నిర్మూలించడానికి ఒక నియంతగా వ్యవహరించాడు. అదే తరహాలో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రజాస్వామ్యాన్ని, ప్రజల హక్కులను పరిరక్షిస్తానని ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతానని చెప్పి మావోయిస్టు పార్టీపై తన పోలీసు బలగాలతో దాడులు చేపిస్తూ పాలించే వాళ్ళంతా ఒకే గూటి పక్షులని రాజ్యహింసలో ఒకరిని మించిన వారు ఇంకొకరు అన్నట్లు కార్పోరేట్ ఏజెంట్లే నని రుజువు చేసుకున్నాడు. ఈ ఎన్కౌంటర్లకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డిదే పూర్తి బాధ్యత అవుతుందని హెచ్చరిస్తున్నాం. ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో మా కామ్రేడ్స్ పై ములుగు జిల్లా ఎస్పీ పధకం రచించి ఈ ఎన్ కౌంటర్ కు పాల్పడ్డాడు. తప్పకుండా ఈ ఎన్ కౌటర్ కు నెత్తుటి బాకీ తీర్చుకుంటాం” అని అజాద్ ప్రకటనలో హెచ్చరించారు

రిపోర్టింగ్ - K.V.REDDY Karimnagar, HT Telugu Correspondent

Whats_app_banner