TG Maoist Letter : ఎవరూ ఇటు రావొద్దు.. కర్రిగుట్టపై బాంబులు అమర్చాం.. మావోయిస్టుల ప్రకటన!-maoists claim planted bombs in the forests of venkatapuram in mulugu district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Maoist Letter : ఎవరూ ఇటు రావొద్దు.. కర్రిగుట్టపై బాంబులు అమర్చాం.. మావోయిస్టుల ప్రకటన!

TG Maoist Letter : ఎవరూ ఇటు రావొద్దు.. కర్రిగుట్టపై బాంబులు అమర్చాం.. మావోయిస్టుల ప్రకటన!

HT Telugu Desk HT Telugu

TG Maoist Letter : మావోయిస్టు నేతలు సంచలన లేఖ విడుదల చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం సమీపంలోని కర్రిగుట్టపై బాంబులు అమర్చామని, వేట పేరుతో కర్రిగుట్టపైకి ప్రజలు ఎవరూ రావొద్దని స్పష్టం చేశారు. ఆపరేషన్ కగార్ నుంచి రక్షణ కోసమే కర్రిగుట్టపై బాంబులు అమర్చినట్లు లేఖలో పేర్కొన్నారు.

మావోయిస్టుల లేఖ

సీపీఐ మావోయిస్టు పార్టీ వెంకటాపురం–వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరుతో ఓ లేఖ విడుదల అయ్యింది. షికారు పేరుతో కర్రిగుట్ట పైకి వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవద్దని అందులో మావోయిస్టులు స్పష్టం చేశారు. మావోయిస్టులు విడుదల చేసిన ఈ లేఖ సంచలనంగా మారింది. స్థానికుల్లో తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది.

పోలీసుల మాటలు నమ్మొద్దు..

పోలీసులు డబ్బులు ఇస్తూ.. మాయ మాటలు చెప్పి నమ్మిస్తారని, అమాయకులను ఇన్ ఫార్మర్‌గా మార్చుకుంటారని సీపీఐ మావోయిస్టు పార్టీ వెంకటాపురం – వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత లేఖలో పేర్కొన్నారు. పోలీసుల మాటలు నమ్మి ఎవరూ ఇన్ ఫార్మర్లుగా మారవద్దని సూచించారు. ఇన్ ఫార్మర్లుగా మారి కుటుంబాలను కష్టాలపాలు చేయకండని హితవు పలికారు. మాయ మాటలు చెప్పే పోలీసుల మాటలు నమ్మి.. వారి వలలో పడి కర్రిగుట్టపైకి ఎవరూ రావద్దని విజ్ఞప్తి చేశారు.

కగార్ నుంచి రక్షణ కోసమే..

బహుళ జాతి కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను అమలు చేయడానికి, బ్రాహ్మణీయ హిందూ పాసిస్టు బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో ప్రజలు, ప్రజా సంఘాలు, మావోయిస్టు పార్టీపై దాడులు కొనసాగిస్తోందని శాంత లేఖలో పేర్కొన్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కూడా మావోయిస్టు పార్టీపై దాడులు కొనసాగిస్తోందని ఆరోపించారు. ఆపరేషన్ కగార్ పేరుతో చేస్తున్న దాడులలో అనేక మంది మావోయిస్టు పార్టీ నేతలు, పీఎల్జీఏ నాయకులతో పాటు సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. బూటకపు ఎన్ కౌంటర్లలో అమరులు అవుతున్న వారిలో ఎక్కువ మంది ఆదివాసీ ప్రజలే ఉంటున్నారని.. ఈ ఆపరేషన్ కగార్ దాడుల నుంచి రక్షణ పొందడానికే కర్రిగుట్టపై బాంబులు అమర్చినట్లు స్పష్టం చేశారు.

అక్రమార్కులకు వత్తాసు..

సామ్రాజ్యవాదులు, దళారీ, నిరంకుశ, పెట్టుబడిదారులు, భూస్వాముల ప్రయోజనాలను నెర వేర్చడానికి రైతుల పట్టా భూములు, ఫారెస్ట్ భూములను అక్రమార్కులకు అప్పజెప్పుతున్నారని శాంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ భూముల కోసం ప్రజలు, ప్రజా సంఘాలు పోరాడుతుంటే, అక్రమార్కులకు వత్తాసు పలుకుతూ పోలీసులు లాఠీ ఛార్జీలు చేసి, అరెస్టులు చేస్తూ జైళ్లలో వేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని, ప్రజల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించలేదని గడిచిన సంవత్సరంలోనే తేలిపోయిందని స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేస్తూనే ఏడో గ్యాంరటీగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారని విమర్శించారు. ప్రజా పాలన అని చెప్పి ప్రజలు సమస్యలపై అనేక దరఖాస్తులు తీసుకున్న ప్రభుత్వం.. అందులో ఒక్కటి కూడా పరిష్కరించలేదన్నారు.

గుట్టపైకి రావొద్దు..

కొంతమంది ఆదివాసీ, ఆదివాసేతర ప్రజలకు పోలీసులు మాయ మాటలు చెప్పి నమ్మిస్తున్నారని, డబ్బులు ఇచ్చి ఆశ కల్పిస్తూ ఇన్ ఫార్మర్ గా మార్చుకుంటున్నారని శాంత పేర్కొన్నారు. షికారు పేరుతో కర్రిగుట్టపైకి పంపిస్తున్నారని, దీంతో మావోయిస్టుల రక్షణ కోసం అమర్చిన బాంబుల బారిన పడి కొంతమంది గాయాల పాలవుతుంటే.. ఇంకొంతమంది చనిపోతున్నారన్నారు. ఇకపై ప్రజలు ఎవరూ షికారు పేరుతో కర్రిగుట్టపైకి రావొద్దని సూచించారు.

(రిపోర్టింగ్: హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

సంబంధిత కథనం