మావోయిస్ట్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గడ్చిరోలి జిల్లాలో మంగళవారం నాడు మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను లొంగిపోయారు. 60 మంది మావోయిస్టులతో కలిసి ఆయుధాలు విడిచిపెట్టారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఆయన కొనసాగిన విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా మల్లోజుల పార్టీని వీడుతారని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆయన పేరిట లేఖలు కూడా బయటకు వచ్చాయి.
గత వారం మల్లోజుల పార్టీకి రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆయుధాలను వదులుకుని ప్రధాన స్రవంతిలో కలవాలని, తమను తాము రక్షించుకోవాలని, అర్థరహిత త్యాగాలు చేయవద్దని కార్యకర్తలకు ఆయన ఒక లేఖలో పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఇకపై సాయుధ పోరాటాన్ని కొనసాగించలేనని సోను తన సహచరులకు లేఖలో చెప్పారు.
మావోయిస్టులు అనుసరించిన మార్గం పూర్తిగా తప్పు అని అంగీకరిస్తున్నట్టుగా ఇటీవల లేఖలో పేర్కొన్నారు. ఇన్ని రోజులు పార్టీ తప్పులకు, ఉద్యమం ఓడిపోకుండా కాపాడలేకపోయినందుకు బాధ్యత వహిస్తూ.. పొలిట్ బ్యూరో సభ్యుడిగా క్షమాపణలు కోరుతున్నానని తెలిపారు. పదే పదే నాయకత్వ తప్పిదాలతో మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బలు తగిలాయని కూడా ఆయన అన్నారు.
ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని భావించవచ్చని సోను అన్నారు. కానీ పరిస్థితులు అనివార్యంగా చేశాయన్నారు. వందల మంది మావోయిస్టులు కోల్పోతున్న పరిస్థితుల్లో పార్టీ అతివాద విధానాల నుంచి మిగిలిన వారినైనా కాపాడుకోవాలన్నారు. 28 ఏళ్లు కేంద్ర కమిటీ, 18 ఏళ్లు పొలిట్ బ్యూరో సభ్యుడిగా పార్టీలో అనేక లోపాలను గమనించినట్టుగా వెల్లడించారు. లేఖలో అనేక విషయాలను వెల్లడించారు మల్లోజుల.
ఈ లేఖను మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఆయుధాలను సరెండర్ చేయాలని తెలిపింది. తాజాగా ఆయన లొంగిపోవడంతో పార్టీకి పెద్ద నష్టం అని చెప్పవచ్చు. మల్లోజుల ఆయుధాలు వదిలేసినట్టుగా అధికారిక వర్గాలు ధృవీకరించాయి.