BJP Nalgonda : టికెట్ల కోసం దరఖాస్తుల వెల్లువ - ఈ అసెంబ్లీ స్థానాల కోసం అత్యధికంగా పోటీ-many leaders applied for bjp tickets in combined nalgonda district ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Many Leaders Applied For Bjp Tickets In Combined Nalgonda District

BJP Nalgonda : టికెట్ల కోసం దరఖాస్తుల వెల్లువ - ఈ అసెంబ్లీ స్థానాల కోసం అత్యధికంగా పోటీ

HT Telugu Desk HT Telugu
Sep 14, 2023 03:07 PM IST

Telangana Assembly Elections 2023: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అసెంబ్లీ స్థానాల నుంచి బీజేపీ తరపున పోటీ చేసేందుకు ఆ పార్టీ నేతలు భారీగానే దరఖాస్తులు చేసుకున్నారు. 12 నియోజవవర్గాలకు గాను మొత్తం 123 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పార్టీ వర్గాల మేరకు తెలుస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు

Telangana Assembly Elections 2023: అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదన్న సామెతను బాగా గుర్తు పెట్టుకున్నారేమో కానీ.. నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి పెద్ద సంఖ్యలోనే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ వర్గాల ద్వారా అందిన ప్రాథమిక సమాచారం మేరకు మొత్తంగా 123 మంది కలమనాథులు టికెట్ల కోసం దరఖాస్తులు సమర్పించారు. బహుషా ఈ సంఖ్య మరికొంత పెరిగే వీలుందని అంటున్నారు. అత్యధికంగా కోదాడలో 24 మంది దరఖాస్తు చేసుకుంటే.. అతి తక్కువగా నల్గొండ, నాగార్జున సాగర్ లలో నలుగురు చొప్పున టికెట్లు కావాలని దరఖాస్తు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

వాస్తవానికి బీజేపీకి సరైన అభ్యర్థులే లేరు.. పోటీ చేయడానికి అర్హులను ఎలా వెదికి పెట్టుకోవాలని బీజేపీ నాయకత్వం ఆలోచిస్తున్న క్రమంలోనే ఇంతగా దరఖాస్తులు వచ్చిపడడంతో నాయకులే నివ్వెరపోతున్నారు. నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇవ్వడానికి జన బలంతో పాటు అర్థ బలం ఉన్నవారి కోసం ఇతర పార్టీల నుంచి సీనియర్లు ఎవరైనా పార్టీ కండువాలు కప్పుకుంటారా అని ఎదురు చూస్తున్నారు. కానీ నాయకుల అంచనాలను తారు మారు చేస్తూ పెద్ద సంఖ్యలోనే దరఖాస్తు చేసుకున్నా.. వీరిలో అత్యధికులు కనీసం నియోజకవర్గంలో ప్రజలకు ఏ మాత్రం ముఖ పరిచయం లేని వారేనని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. నకిరేకల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్న 23 మందిలో అత్యధికులు ఇతర జిల్లాలకు చెందిన వారు కూడా ఉన్నారని సమాచారం. ఈ నెల 10వ తేదీ నాటికే దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియడంతో వీటిని పరిశీలించే పనిలో పార్టీ రాష్ట్ర నాయకత్వం ఉందని చెబుతున్నారు.

బలమైన అభ్యర్థులు అంతంత మాత్రమే…

వాస్తవానికి జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా గట్టి పోటీ ఇవ్వగలిగే స్థాయిలో బీజేపీకి బలం లేదు. ఒక వేళ మునుగోడు నుంచి మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తేనే రేసులో ఉండే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గం నుంచి కూడా ఏకంగా 9 మంది దరఖాస్తు చేసుకోవడం విశేషం. నల్గొండ నియోజకవర్గం నుంచి నలుగురు దరఖాస్తు చేసుకోగా.. అంతో ఇంతో పేరు పరిచయం ఉన్న నాయకుడు మాదగోని శ్రీనివాస్ గౌడ్ మాత్రమే. 2014 లో టీడీపీతో పొత్తులో భాగంగా నల్గొండలోచేసిన బీజేపీ మూడో స్థానంలోకి వెళ్లింది. 2018 లో మూడు వేల ఓట్లు కూడా దాటలేదు. నాగార్జున సాగర్ లో నలుగురు దరఖాస్తు చేసుకోగా.. 2018 లో పోటీ చేసిన కంకణాల నివేదితా రెడ్డి, 2021 ఉప ఎన్నికల్లో పోటీ చేసిన డాక్టర్ రవినాయక్ డిపాజిట్లు కూడా తెచ్చుకోలేక పోయారు. ఈ ఎన్నికల్లో టికెట్ కోసమూ దరఖాస్తు చేశారు. సూర్యాపేటలో పార్టీ సీనియర్ నేత సంకినేని వెంకటేశ్వర రావు ఉన్నా ఇక్కడి నుంచి 8 మంది దరఖాస్తు చేశారు. 2018 ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ మూడో స్థానంలో నిలిచింది. దేవరకొండలో ఆరుగురు దరఖాస్తు చేసినా.. ఒక్కరూ పేరున్న నాయకుడు లేరు. మిర్యాలగూడలో 10 మంది, కోదాడలో 24 మంది దరఖాస్తు దారులున్నా.. ఒక్క మిర్యాలగూడలో మాత్రం చింతా సాంబమూర్తి ఒక్కరే పేరున్న వారు. హుజూర్ నగర్ నుంచి 8 మంది దరఖాస్తుదారులు ఉండగా, సూర్యాపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొబ్బ భాగ్యా రెడ్డి, 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి మూడో స్థానంలో నిలబడిన డాక్టర్ గట్టు శ్రీకాంత్ రెడ్డి పేర్లే నియోజకవర్గానికి పరిచయం ఉంది.

ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైన తుంగతుర్తి నుంచి 8 మంది దరఖాస్తు చేయగా, గత ఎన్నికల్లో పోటీ చేసిన డాక్టర్ కడియం రామ చంద్రయ్య, అంతకు ముందు టీడీపీ నుంచి తుంగతుర్తి నుంచే పోటీచేసిన పాల్వాయి రజినీ కుమారి మాత్రమే చెప్పుకోదగిన వారు. నకిరేకల్ నుంచి 23 మంది దరఖాస్తు చేస్తే పోతెపాక సాంబయ్య మాత్రమే పరిచయాలు ఉన్నవారు. భువనగిరి టికెట్ కోసం ఏడుగురు దరఖాస్తు పెట్టుకుంటే గూడూరు నారాయణ రెడ్డి పేరును మాత్రమే నియోజకవర్గ ప్రజలు గుర్తుపట్టగలుగుతారు. ఆలేరులో 12 మంది టికెట్ కోసం పోటీ పడుతున్నా.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గా పోటీ చేసిన సుదగాని హరిశంకర్ గౌడ్ మాత్రమే ఓటర్లు గుర్తుపట్టదగిన నాయకుడు. ఇలా మొత్తంగా 12 స్థానాల నుంచి 123 మంది దరఖాస్తులు పెట్టుకుంటే పట్టుమని పది మంది మాత్రమే చెప్పుకోదగిన నాయకులు కావడం గమనార్హం.

(రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్లగొండ )

WhatsApp channel