TG Rythu Runa Mafi : రుణమాఫీ పూర్తయినట్టేనా..! ఆ రైతుల పరిస్థితేంటి..?-many farmers in telangana are waiting for loan waiver key details read here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Rythu Runa Mafi : రుణమాఫీ పూర్తయినట్టేనా..! ఆ రైతుల పరిస్థితేంటి..?

TG Rythu Runa Mafi : రుణమాఫీ పూర్తయినట్టేనా..! ఆ రైతుల పరిస్థితేంటి..?

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 07, 2024 10:33 AM IST

TG Rythu Runa Mafi Scheme : తెలంగాణ రుణమాఫీ స్కీమ్ అమలు చేసిన సంగతి తెలిసిందే. 4 విడతల్లో రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేశారు. అయితే ఇంకా చాలా మంది రైతుల రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న రైతులు ఇందులో ఉన్నారు.

రుణమాఫీ స్కీమ్
రుణమాఫీ స్కీమ్

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ స్కీమ్ ను పట్టాలెక్కించిన సంగతి తెలిసింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కార్… రూ. 2 లక్షలలోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని చెప్పింది. అందుకు తగ్గట్టుగానే అర్హులను గుర్తించి… వారి ఖాతాల్లో డబ్బులను జమ చేసింది. ఇప్పటి వరకు నాలుగు విడతల్లో డబ్బులను విడుదల చేశారు.

yearly horoscope entry point

ఇటీవలే చేసిన నాల్గొ విడతపై చాలా మంది రైతులు ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఇందులో రూ. 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులు ఉన్నారు. ఇప్పటికే వీరందరికీ కుటుంబ నిర్ధారణ కూడా పూర్తి అయింది. రూ. 2 లక్షల కంటే ఎక్కువగా ఉన్న డబ్బులను కూడా బ్యాంకులకు చెల్లించారు. అయినప్పటికీ వీరి రుణమాఫీ డబ్బులు జమ కాలేదు. ఇలా అన్ని జిల్లాల్లోనూ సమస్యలు తెరపైకి వస్తున్నాయి. 

మరోవైపు రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలన్నీ 100 శాతం పూర్తి చేశామని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నూటికి నూరు శాతం రుణమాఫీ పూర్తి అయిందని చెప్పుకొచ్చారు. సీఎం ప్రకటన నేపథ్యంలో…. చాలా మంది రైతులు గందరగోళానికి గురవుతున్నారు. అర్హులుగా ఉన్నప్పటికీ… తమకు ఇంకా రుణమాఫీ కాలేదని వాపోతున్నారు. 

వివరాలను సవరించుకున్నా…!

నిజానికి రూ. 2 లక్షల కంటే ఎక్కువగా రుణం ఉన్న రైతులకు కుటుంబ నిర్ధారణ చేసింది వ్యవసాయం శాఖ. వివరాల్లో తప్పులు దొర్లటంతో వాటిని కూడా పరిష్కారం చేసేలా స్వయంగా రైతుల వద్దకే అధికారులు వెళ్లారు. వివరాల నమోదు తర్వాత సెల్ఫీలు కూడా తీసుకొని మొబైల్ యాప్ లో నమోదు చేశారు. క్షేత్రస్థాయిలో ఇదంతా జరిగినప్పటికీ తాజాగా విడుదలైన జాబితాల్లో చాలా మంది రైతుల పేర్లు కనిపించలేదు. ఇదే విషయాన్ని పలువురు రైతులు చెబుతూ వాపోతున్నారు. ఏఈవోలను సంప్రదిస్తూ.. గోడు వెల్లబోసుకుంటున్నారు.

నల్గొండ జిల్లా మర్రిగూడ మండల పరిధిలో ఉన్న బ్యాంకులో ఓ రైతు రూ. 2 లక్షల రూపాయల రుణం తీసుకున్నాడు. ప్రభుత్వం నిర్ణయించన కటాఫ్ తేదీలోపే లోన్ పొందాడు. ఈ రూ. 2 లక్షలకు ఇంట్రెస్ట్ రూ. 12 వేలకు పైగా కాగా… మొత్తం రూ. 2 లక్షల 12 వేలు పెండింగ్ లో ఉంది. రూ. 2 లక్షలు కాకుండా.. పైన ఉన్న 12 వేల రూపాయలను ఇప్పటికే సదరు రైతు బ్యాంకులో చెల్లించారు. కుటుంబ నిర్ధారణ కూడా చేయించుకున్నారు. అగ్రికల్చర్ అధికారులు వివరాలను కూడా సేకరించారు. రూ. 2 లక్షల రూపాయలు మాఫీ అవుతాయని భావించారు.

ఇటీవలే పాలమూరు సభ వేదికగా నాల్గో విడత రుణమాఫీ నిధులను విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన జాబితాలను బ్యాంకుల వారీగా విడుదల చేశారు. ఇందులో సదరు రైతు పేరు మాత్రం లేదు. ఇదే విషయాన్ని వ్యవసాయశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ… స్పందన లేదని వాపోయాడు. ఇలా అన్ని జిల్లాల్లోనూ సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. రుణమాఫీ కానీ రైతులు… ఏఈవో కార్యాలయాలను సంప్రదిస్తున్నారు.  అయితే అర్హులు ఇంకా ఏవరైనా ఉన్నా.. వారికి మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినప్పటికీ… అధికారికంగా ఎలాంటి ఆదేశాలు మాత్రం రాలేదు. 

రుణమాఫీ లెక్కలు:

పూర్తిస్థాయి రుణమాఫీ కోసం రూ. 30 వేల కోట్లు అవసరమవుతుందని సర్కార్ భావించింది. సీఎంతో పాటు పలువురు మంత్రులు కూడా ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పారు.   అయితే ఈ ఏడాది ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లో రూ. 26,000 కోట్లు కేటాయించారు. 

రైతు రుణమాఫీ పథకంలో భాగంగా జులై 18న తొలి విడతగా లక్ష రూపాయల లోపు రుణాలున్న రైతుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. కొద్దిరోజులు కిందట ప్రధాని మోదీకి లేఖ రాసిన సీఎం రేవంత్ రెడ్డి.. రుణమాఫీ లెక్కలను కూడా ప్రస్తావించారు. మొదటి విడతలో 11,34412 రైతుల ఖాతాల్లోకి రూ. 6,034,97 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు. ఇక రెండో విడతలో 640823 మంది రైతుల ఖాతాల్లోకి రూ. 6,190,01 కోట్లు జమ చేసినట్లు తెలిపారు.  మూడో విడత కింద  446832 రైతుల ఖాతాల్లోకి రూ. 5,544,24 జమ చేసినట్లు ప్రస్తావించారు.

పాలమూరు వేదికగా జరిగిన సభలో నాల్గో విడత రుణమాఫీ నిధులను విడుదల చేశారు. ఈ విడతలో 3,13897 రైతుల ఖాతాల్లోకి రూ. 2747 కోట్లను విడుదల చేశారు. మొత్తంగా అన్ని విడతలు చూస్తే… రూ. 20,343 కోట్లకుపైగా నిధులను జమ చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. 

 

 

 

 

Whats_app_banner