Karimnagar Politics : అంతర్మథనంలో 'బీఆర్ఎస్' నేతలు..! 'కండువా' మార్చేస్తారా..?-many brs leaders in karimnagar are likely to leave the party ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar Politics : అంతర్మథనంలో 'బీఆర్ఎస్' నేతలు..! 'కండువా' మార్చేస్తారా..?

Karimnagar Politics : అంతర్మథనంలో 'బీఆర్ఎస్' నేతలు..! 'కండువా' మార్చేస్తారా..?

HT Telugu Desk HT Telugu
Jun 08, 2024 06:25 AM IST

Karimnagar Politics : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. వరసు ఓటములతో బీఆర్ఎస్ డీలా పడిపోవటంతో… ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు కాంగ్రెస్, బీజేపీ వైపు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో భారీగా చేరికలు ఉండే అవకాశం కనిపిస్తోంది.

బిఆర్ఎస్ లో అంత్మరథనం...
బిఆర్ఎస్ లో అంత్మరథనం...

Karimnagar Politics : ఉద్యమాల జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా, టిఆర్ఎస్ పురుడు పోసుకున్న పోరాటాల పురిటి గడ్డ ఇప్పుడు ఆ పార్టీకి జవసత్వాలు లేని పరిస్థితి తీసుకొచ్చింది. పార్టీ ఆవిర్భావం నుంచి 2019 ఎన్నికల వరకు తిరుగులేని పార్టీగా ప్రజల మద్దతు పొందిన బిఆర్ఎస్, ఇప్పుడు లోకసభ ఎన్నికల ఫలితాలతో చతికిలబడింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో తిరుగులేని మెజార్టీతో ఎంపీలు పదవులను కైవసం చేసుకున్న టిఆర్ఎస్ తాజా ఎంపీ ఎన్నికల ఫలితాలతో బీఆర్ఎస్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతోంది. రెండు చోట్ల మూడో స్థానానికే పరిమితం అయింది.

2014లో కరీంనగర్, పెద్దపల్లి రెండు లోక్ సభ స్థానాలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్... 2019లో కరీంనగర్ ను కోల్పోయి రెండోస్థానంలో నిలిచింది. తీరా 2024కు వచ్చేసరికి మూడో స్థానానికి పడిపోయింది. తెలంగాణ ఉద్యమానికి.. బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట... ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేనున్నానంటూ అండగా నిలిచిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా... పంచాయతీ నుంచి లోక్ సభ వరకు ఏ ఎన్నిక జరిగినా భారీ మెజారిటీని కట్టబెట్టి అక్కున చేర్చుకున్న కరీంనగర్ ఇప్పుడు ఆ పార్టీకి మోహం చాటేసింది.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించిన ప్రాంతం .. లోక్ సభ ఎన్నికల వరకు వచ్చే సరికి కరీంనగర్ లో బీజేపీకి పెద్దపీట వేయడంతో ఇప్పుడు గులాబీ శ్రేణులు ఒక్కసారిగా అయోమయంలో పడ్డాయి. కీలకమైన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ముఖ్య నేతలే చతికిలపడి చేతులెత్తేసిన తరుణంలో తమకు దిక్కేవరంటూ బిత్తరపోయిన శ్రేణులు రాజకీయ భవిష్యత్ కోసం పక్కచూపులు చూస్తున్నాయి.

గత ఎన్నికల్లో కనీసం రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ ఈసారి మూడో స్థానానికే పరిమితం కావడంతో రానున్న రోజుల్లో పరిస్థితి ఏమిటన్న దానిపై గులాబీ శ్రేణుల్లో చర్చ మొదలై అయోమయం నెలకొంది.

బీఆర్ఎస్ ప్రభావం తగ్గిందా....?

2001 నుంచి ఉమ్మడి జిల్లాపై ఆధిక్యతను ప్రదర్శిస్తూ వస్తున్న బీఆర్ఎస్ తొలిసారిగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. 2014లో బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ఒక్కసారిగా రాజకీయసమీకరణాలు మారిపోయాయి. కాంగ్రెస్ హయాంలో చక్రం తిప్పిన మహామహానేతలు సైతం గులాబీ పార్టీ వైపు పరుగులు తీశారు. సర్పంచు నుంచి లోక్ సభ సభ్యుడి వరకు బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ల నుంచి భారీగా వలసలు జరగడంతో ఎక్కడ చూసినా గులాబీ నేతలదే పైచేయిగా మారింది.

వరుసగా రెండోసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం.. ఎమ్మెల్యేల ఫిరాయింపుతో ప్రతిపక్ష స్థానం కూడా కాంగ్రెస్ పార్టీ కోల్పోవడం... బీజేపీకి సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో బీఆర్ఎస్ కు తిరుగులేకుండాపోయింది. ఉమ్మడి జిల్లాలో కూడా 2014, 2018 ఎన్నికల్లో 12 చొప్పున అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకొని తిరుగులేని అధిక్యతను సాధించింది.

ఒక్క కరీంనగర్ లోక్ సభ స్థానం మినహా ఉమ్మడి జిల్లాలోని పంచాయతీ, జడ్చి, మున్సిపల్, అసెంబ్లీ స్థానాలన్నీ గులాబీ ఖాతాలోనే ఉన్నాయి. అలాంటి పార్టీ ఆరు మాసాల క్రితం చతికిలపడినా లోక్ సభ ఎన్ని కల్లోనైనా సత్తా చాటుతుందని అందరూ అంచనా వేశారు. తీరా ఫలితాలు తలక్రిందులు చేస్తూ రావడం గులాబీ శ్రేణులను నైరాశ్యం లోకి నెట్టింది.

బిఆర్ఎస్ కు సవాల్ గా మారిన బిజేపి…

కరీంనగర్ లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలకు బీఆర్ఎస్ పార్టీ ఆరు చోట్ల మూడో స్థానంలో నిలవడంతో ఆ పార్టీ అంతర్మథనంలో పడింది. లోక్ సభ ఎన్నికల్లో హోరాహోరీ ప్రచారం నిర్వహించి గెలుపు ధీమాతో కనిపించిన బీఆర్ఎస్ కు ఈ ఫలితాలు భారీ షాక్ నిచ్చాయి. కౌంటింగ్ తర్వాత ఫలితాలు భిన్నంగా రావడంతో నేతలు సమాలోచనలు చేస్తున్నారు.

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తిరుగులేని నేతగా చెలామణి అవుతున్నా కేటీఆర్ ఇలాకా సిరిసిల్లలో కూడా బీజేపీకే మెజారిటీ దక్కడం సంచలనంగా మారింది. ఏ మాత్రం పట్టు లేని ప్రాంతంలోనూ బీజేపీ మెజారిటీని సాధించడం సర్వతా చర్చనీయాంశంగా మారింది. కారణాలేవైనా బీజేపీ విజయం బీఆర్ఎస్ వర్గాలకు మింగుడుపడటం లేదని నిర్వివాదాంశం.

ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ లోక్ సభ పరిధిలో మూడు స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకున్నది. దీంతో బీజేపీ కంటే తామే మెరుగ్గా ఉన్నామని అంచనా వేసిన బీఆర్ఎస్ ప్రచారాన్ని ముందునుంచే మొదలుపెట్టింది. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఏడాది ముందే ఇటు కేసీఆర్ అటు కేటీఆర్ ప్రకటించినా ఏ మాత్రం గట్టి పోటీనివ్వలేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని పార్టీ అధినేత కేసీఆర్ కరీంనగర్ నుంచే శ్రీకారం చుట్టి తన అభిమానాన్ని చాటుకునే ప్రయత్నం చేసినా ప్రజలు ఆదరించ లేదు. కరీంనగర్, సిరిసిల్ల, హుజురాబాద్ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర ద్వారా ప్రజలను కలుసుకొని బీజేపీని ఓడించాలంటూ కేసీఆర్ పిలుపునిచ్చినా ప్రజలు మాత్రం బీజేపీకి బ్రహ్మరథం పట్టారు. ఒక్క సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలువగా.. మిగిలిన ఆరు చోట్ల మూడువ స్థానానికే పరిమితమైంది. ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాన్ని కూడా దక్కించుకోలేకపోయిన బీజేపీ ఏకంగా అరు నియోజకవర్గాల్లో స్పష్టమైన ఆధిక్య తను సాధించడం ద్వారా బీజేపీ ప్రత్యర్థి పార్టీలకు సరికొత్త సవాలు విసిరినట్టేనని భావిస్తున్నారు.

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇప్పటికే 14 మంది కార్పొరేటర్లు ఇటు కాంగ్రెస్ .. అటు బీజేపీలో చేరిపోయారు. బీఆర్ఎస్ పని అయిపోయిందనే గట్టి నమ్మకంతోనే వారంతా ముందే పార్టీని వీడి తమ పరిస్థితిని చక్కబెట్టుకునే ప్రయత్నం చేశారు. పార్టీ మారినా వారి డివిజన్లలో ఎక్కడా కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రాకపోవడం గమనార్హం.

గ్రామీణ ప్రాంతాలకు చెందిన జడ్పిటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్, బీజేపీలోకి మారిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రానున్న బీజేపీ బలమైన ప్రత్యర్థిగా మారడం ఖాయమని భావిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండటం.. రాష్ట్రంలో 8 లోక్ సభ స్థానాలను దక్కించుకోవడం ద్వారా రానున్న రోజుల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోరు కొనసాగే అవకాశం లేకపోలేదన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి.

గతంలో బీజేపీలో చేరడానికి ఆసక్తి చూపని వారు ఇప్పుడు కాషాయం కండువాను కప్పుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఈ పరిణామాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీని మరింత ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టుతున్నాయి. పార్టీ అధికారంలో ఉండటంతో అన్ని పార్టీల నుంచి బీఆర్ఎస్ లో చేరిన వారందరూ ఇప్పుడు ఇటు కాంగ్రెస్ .. అటు బీజేపీ లోకి చేరడానికి ఉత్సాహం చూపుతుండటంతో మరో రెండు, మూడు నెలల్లో బీఆర్ఎస్ పరిస్థితి మరింత దయనీయంగా మారే అవకాశం లేకపోలేదని పలువురు భావిస్తున్నారు.

రిపోర్టింగ్ - HT తెలుగు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ కె.వి.రెడ్డి.

టీ20 వరల్డ్ కప్ 2024