Manda Krishna : కాంగ్రెస్ ఓడితే రేవంత్ రెడ్డి ఆ పార్టీలోనే ఉంటాడా..? - మందకృష్ణ
Manda Krishna Madiga Comments: రేవంత్ రెడ్డిపై సీరియస్ కామెంట్స్ చేశారు మందకృష్ణ మాదిగ. రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేస్తామంటే నమ్మడానికి తాము ఏమన్నా చెవిలో పూలు పెట్టుకున్నామా అంటూ ప్రశ్నించారు.
Manda Krishna Madiga On Revanth Reddy: రేవంత్ రెడ్డి కంటే పిట్టల దొర నయమన్నారు మందకృష్ణ మాదిగ. మంగళవారం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి పరోక్షంగా... మందకృష్ణను ఉద్దేశిస్తూ పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన మందకృష్ణ ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ జరగాల్సింది పార్లమెంట్లో అయితే రేవంత్ రెడ్డి అక్కడ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేస్తామంటే నమ్మడానికి తాము ఏమన్నా చెవిలో పూలు పెట్టుకున్నామా అంటూ కామెంట్స్ చేశారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉండడన్న మందకృష్ణ.. బీజేపీ లేదా బీఆర్ఎస్ పార్టీలో చేరతాడని అన్నారు. రేవంత్ ఒంటి మీద కండువా ఇప్పటికి మూడు సార్లు మారిందని విమర్శించారు. అంతకు ముందు బీజేపీ అనుబంధ సంస్థలో కూడా పని చేశాడని గుర్తు చేశారు. ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియని రేవంత్ రెడ్డి మాటలకు ఏం విలువ ఉంటుందని ఘాటుగా మాట్లాడారు. వర్గీకరణ విషయంలో ఇలాంటి వ్యక్తిని తాము ఎలా నమ్మాలి అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కంటే పిట్టల దొర నయమని ఎద్దేవా చేశారు.
"ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తో లేఖ రాయమని అడిగాం. దానిపై సమాధానం లేదు. మేం గాంధీ భవన్ కు వెళ్లినప్పుడు ఈ అంశంపై మాట్లాడటానికి కూడా ఆయనకు ఇష్టం లేదు. రేవంత్ మాటలు పిట్టల దొర మాదిరిగా ఉంటాయి. ఓ రకంగా పిట్టల దొరనే నయమని మేం నమ్ముతున్నారు. రెండు నిమిషాలు మాట్లాడే ఓపిక లేదు కానీ, మా చిత్తశుద్ధిని ప్రశ్నిస్తారా..? రేవంత్ రెడ్డికి కులతత్వమే ఉంది. కిషన్ రెడ్డి మాత్రమే కాదు నాకు అన్ని పార్టీలలో శ్రేయోభిలాషులు ఉన్నారు. ఎంతో మంది రెడ్డిలను చూశాను ... కానీ రేవంత్ రెడ్డి మాదిరి వ్యక్తులను చూడలేదు" అంటూ ఫైర్ అయ్యారు మందకృష్ణ మాదిగ.
ఎస్సీ వర్గీకరణ అంశంపై స్పందించిన రేవంత్ రెడ్డి... మంగళవారం కొన్ని వ్యాఖ్యలు చేశారు.ఎస్సీ వర్గీకరణ ఎవరి పేటెంట్ కాదన్నారు. ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్‌కు స్పష్టమైన విధానం ఉందని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరి బెదిరింపులకు భయపడేది లేదన్నారు. బెదిరించే వారు ఎవరికి మద్దతు ఇచ్చారో వారినే అడిగితే మంచిదంటూ పరోక్ష కామెంట్స్ చేశారు. ఒకరికి మద్దతు ఇచ్చి.. మరొకరిని డిమాండ్ చేయడం సరికాదన్నారు. మాట ఇచ్చిన వాళ్ళని ప్రశ్నించి చిత్తశుద్ది నిరూపించుకోవాలంటూ మందకృష్ణకు కౌంటర్ ఇచ్చారు. దీనిపై స్పందిస్తూ మాట్లాడిన మందకృష్ణ...రేవంత్ రెడ్డి టార్గెట్ గా పలు కామెంట్స్ చేశారు.