SC Classification in TG : రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా.. మాదిగ ఉపకులాలకు మేలు చేస్తాం : రేవంత్-manda krishna madiga congratulates cm revanth reddy on sc classification ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sc Classification In Tg : రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా.. మాదిగ ఉపకులాలకు మేలు చేస్తాం : రేవంత్

SC Classification in TG : రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా.. మాదిగ ఉపకులాలకు మేలు చేస్తాం : రేవంత్

Basani Shiva Kumar HT Telugu
Published Feb 11, 2025 03:43 PM IST

SC Classification in TG : మందకృష్ణ మాదిగ.. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై ముఖ్యమంత్రితో చర్చించారు. సీఎం కమిట్‌మెంట్‌ను అభినందించారు. రాజకీయ ప్రయాజనాలకు అతీతంగా.. మాదిగ ఉపకులాలకు మేలు చేస్తామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

రేవంత్ రెడ్డితో మంద కృష్ణ మాదిగ
రేవంత్ రెడ్డితో మంద కృష్ణ మాదిగ (CMO)

సీఎం రేవంత్ రెడ్డితో మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిట్‌మెంట్‌ను అభినందించారు మందకృష్ణ మాదిగ. వర్గీకరణ ప్రక్రియను చేపట్టిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఒక సోదరుడిగా అండగా ఉంటానన్నారు. ఉపకులాల వర్గీకరణలో పలు సమస్యలను ముఖ్యమంత్రికి వివరించారు.

మంచి చేయాలనే లక్ష్యంతో..

రాజకీయ ప్రయాజనాలకు అతీతంగా, మాదిగ, మాదిగ ఉపకులాలకు మేలు చేయాలనే మంచి లక్ష్యంతో ప్రభుత్వం ఉందని.. సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో చర్చించి, కేబినెట్ సబ్ కమిటీ వేసి, న్యాయ కమిషన్ వేసి, నివేదికలను వేగంగా తీసుకుని, కేబినెట్‌లో చర్చించి, అసెంబ్లీలోనే నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి వివరించారు.

చిక్కులు లేకుండా..

అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రక్రియను చేపట్టిన కారణంగా.. ఎలాంటి న్యాయ పరమైన చిక్కులు లేకుండా చేశామని వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. వర్గీకరణకు తీర్మానం చేయాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కొట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. సమస్యలు, అభ్యంతరాలను కేబినెట్ సబ్ కమిటీతో పాటు కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

పొన్నం కీలక వ్యాఖ్యలు..

కరీంనగర్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన దేశానికే మార్గదర్శకం. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఎప్పుడో స్పష్టం చేశారు ఎవరి లెక్క ఏంటో తేలాలని. బీఆర్ఎస్, బీజేపీలకు కుల గణనపై మాట్లాడే నైతిక అర్హత లేదు. బీజేపీ కులగణనను వ్యతిరేకిస్తు అపిడపిట్ ధాఖలు చేసింది. మొన్నటి సర్వేలో పాల్గొనని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు ఫామ్‌లు పంపుతున్నాం' అని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

వివరాలు ఇవ్వండి..

'మీ వివరాలు ఇప్పుడైనా ఇవ్వండి. అప్పుడే మీకు మాట్లాడే అవకాశం ఉంటుంది. సర్వేలో పాల్గొనని వారికి మాట్లాడే అర్హత హక్కు లేదు. బీజేపీకి చేతనైతే దేశవ్యాప్త సర్వే చేయడానికి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అనుమతి తీసుకోండి. నిర్ణయం నుంచి నివేదిక దాకా.. నివేదిక నుంచి నిధుల దాకా ఎలా అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేసేలా కృషి చేస్తుంది. మేధావులు, అన్ని కులాల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తాం' అని పొన్నం వ్యాఖ్యానించారు.

తప్పుదారి పట్టించొద్దు..

'ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీల్లో ముస్లీం, మైనారిటీ అనేది ఇప్పుడు కొత్తతి కాదు. అర్బన్ నక్సల్స్ పేరుతో ఒక సెక్షన్ కిందకు నెట్టవద్దు. ఎర్ర చొక్కా వెసుకున్న వాళ్లంతా నక్సల్స్ అనడం సరైన పద్దతి కాదు. ప్రగతిశీల భావాలు కలిగిన తాను.. ఎర్ర చొక్కా వేసుకున్నా. అంతమాత్రాన నేను నక్సలైట్‌ను అవుతానా?' అని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.

Basani Shiva Kumar

eMail
Whats_app_banner