Actor Mohanbabu : మంచు కుటుంబ వివాదం, హైకోర్టులో మోహన్ బాబుకు బిగ్ రిలీఫ్-manchu family issue big relief to actor mohan babu in tg high court exempted for police inquiry ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Actor Mohanbabu : మంచు కుటుంబ వివాదం, హైకోర్టులో మోహన్ బాబుకు బిగ్ రిలీఫ్

Actor Mohanbabu : మంచు కుటుంబ వివాదం, హైకోర్టులో మోహన్ బాబుకు బిగ్ రిలీఫ్

Bandaru Satyaprasad HT Telugu
Dec 11, 2024 04:17 PM IST

Actor Mohanbabu : మంచు ఫ్యామిలీ వ్యవహారం, మీడియాపై దాడి కేసుల్లో సినీ నటుడు మంచు మోహన్ బాబుకు కాస్త ఊరట లభించింది. పోలీసుల విచారణ నుంచి మోహన్ బాబుకు హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.

మంచు కుటుంబ వివాదం, మోహన్ బాబుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
మంచు కుటుంబ వివాదం, మోహన్ బాబుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్

Actor Mohanbabu : సినీ నటుడు మోహన్‌ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. పోలీసుల ఎదుట విచారణ నుంచి మినహాయింపు ఇస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మంచు కుటుంబ వ్యవహారం, మీడియాపై మోహన్ బాబు దాడి వ్యవహారంపై విచారణకు హాజరుకావాలని రాచకొండ సీపీ నోటీసులు జారీ చేశారు. మీడియాపై దాడికి సంబంధించి మోహన్ బాబుపై కేసు సైతం నమోదైంది. అయితే పోలీసుల నోటీసులపై మోహన్‌ బాబు హైకోర్టును ఆశ్రయించారు. తనకు విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

మోహన్ బాబు పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ విజయ్ సేన్‌ రెడ్డి ధర్మాసనం... పోలీసుల విచారణ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది. మంచు ఫ్యామిలీ వివాదంలో మోహన్‌బాబుకు కోర్టులో ఉపశమనం లభించింది. మంగళవారం రాత్రి మీడియాపై అనంతరం మోహన్ బాబు అనూహ్యంగా ఆసుపత్రిలో చేరారు. హైదరాబాద్ కాంటినెంటల్ ఆసుపత్రిలో మోహన్ బాబుకు చికిత్స జరుగుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో హైకోర్టు పోలీసుల ముందు హాజరు నుంచి తాత్కాలికంగా మినహాయింపు ఇచ్చింది.

మోహన్ బాబు హెల్త్ బులెటిన్

మంచు కుటుంబ వివాదం రచ్చకెక్కిన విషయం తెలిసిందే. మంచు మనోజ్, మోహన్ బాబు పరస్పరం కేసులు పెట్టుకున్నారు. ఇక జల్ పల్లిలోని మంచు మోహన్ బాబు ఇంటి వద్ద నిన్న రాత్రి హైడ్రామా నిడిచింది. మంచు మనోజ్ ను ఇంట్లోకి రానివ్వకపోవడం, గేట్లు తోసుకుంటూ ఆయన ఇంట్లోకి వెళ్లడం, ఆ తర్వాత చిరిగిన చొక్కాతో బయటకు రావడం, మీడియాపై మోహన్ బాబు దాడి, ఇద్దరు మీడియా ప్రతినిధులకు తీవ్రగాయాలు అవ్వడం... ఇదంతా చకచకా జరిగిపోయింది. మీడియాపై దాడి క్రమంలో మోహన్ బాబు పై 118 బీఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదైంది. మీడియాపై దాడి అనంతరం రాత్రికి రాత్రే మోహన్ బాబు ఆస్పత్రిలో చేరారు.

అనారోగ్య సమస్యలతో మోహన్ బాబు మంగళవారం రాత్రి హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయన విపరీతమైన ఒళ్లు నొప్పులు, స్పృహ కోల్పోయిన స్థితిలో ఆస్పత్రిలో చేరారని వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలో చేరే సమయానికి ఆయనకు ఎడమ కంటి కింద గాయమైందన్నారు. రక్తపోటు కూడా పెరిగిందని, ప్రస్తుతం నిపుణుల పర్యవేక్షణలో వైద్య పరీక్షలు జరుగుతున్నాయని వైద్యులు తెలిపారు.

మంచు విష్ణు స్పందన

కుటుంబ వివాదంపై మంచు విష్ణు స్పందించారు. ప్రతి ఇంట్లోనూ సమస్యలు ఉంటాయన్నారు. కుటుంబ సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని చెప్పుకొచ్చారు. ఇంటి గేట్లు బద్దలు కొట్టి లోపలికి రావడం వల్లే మోహన్ బాబుకు కోపం వచ్చిందన్నారు. దయచేసి తన తండ్రి మోహన్ బాబుపై దుష్ప్రచారాలు చేయవద్దని కోరారు.

“మా నాన్న దండం పెడుతూ ముందుకూ వచ్చారు. మీడియా నే మా నాన్నని రెచ్చగొట్టింది. ఒక తండ్రిగా అయన రియాక్ట్ అయిన విధానం చాలా తక్కువే అని నేను అనుకుంటున్నా. మా విషయంలో కొంత మంది మీడియా లిమిట్స్ క్రాస్ చేశారు. మీడియా వ్యక్తులకు కూడా తండ్రి, అన్నదమ్ములు ఉంటారు.. ఎవరి కుటుంబం పర్ఫెక్ట్‌గా ఉండదు. ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయి మోహన్ బాబు మీడియాకు రెస్పెక్ట్ ఇస్తారు. మూడు తరాలుగా మోహన్ బాబు గురించి అందరికి తెలుసు” అని మంచు విష్ణు కామెంట్స్ చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం