Light Beers : తెలంగాణలో లైట్ బీర్లు దొరకడంలేదు, ఎక్సైజ్ అధికారులకు యువకుడు ఫిర్యాదు
Light Beers : తెలంగాణలో లైట్ బీర్ల దొరకడంలేదని ఓ యువకుడు ఎక్సైజ్ అధికారులుకు ఫిర్యాదు చేశాడు. ఎండల తీవ్రత దృష్ట్యా గొంతు తడుపుకునేందుకు కూల్ లైట్ బీర్లు దొరకడంలేదని వాపోయాడు.
Light Beers : భానుడి భగభగలు...చల్లని పాలనీయాలపై ప్రభావం చూపుతుంది. ఎండతాపాన్ని తట్టుకోలేక చల్లని బీర్ల(Cool Beers)తో సేదతీరుదామంటే వాటి కొరత ఏర్పడిందని కొందరు అంటున్నారు. ఇక్కడ అక్కడ అని కాదు తెలంగాణలో ఎక్కడా కింగ్ ఫిషర్ లైట్ బీర్లు(King Fisher Light Beers) దొరకడం లేదట. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు వైన్ షాపుల్లో కూల్ లైట్ బీర్లు లేవని బోర్డులే దర్శనం ఇస్తున్నాయి. ఇతర కంపెనీల బీర్లు దొరుకుతున్నా, కింగ్ ఫిషర్ లైట్ బీర్లు దొరకకపోవడంతో మందుబాబులు ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. మంచిర్యాల జిల్లాలో ఏకంగా తాగుబోతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తరుణ్ జిల్లా ఎక్సైజ్ అధికారులకు బీర్ల కొరతపై ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.

మంచిర్యాలలో మందుబాబు ఫిర్యాదు
"నా పేరు కొట్రంగి తరుణ్.. నేను తాగుబోతుల సంక్షేమ సంఘం(Drinkers Welfare Society) మంచిర్యాల జిల్లా అధ్యక్షుడను. గత 18 రోజులలో రాష్ట్రానికి 670 కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకురావడం చాలా ఆనందకరంగా ఉన్నది. కానీ కొద్ది రోజులుగా మంచిర్యాల జిల్లాలో కింగ్ ఫిషర్ లైట్ బీర్లు జిల్లాలోని ఏ వైన్ షాప్ (Wine Shop)లో గానీ, బార్లలో గానీ లభ్యం కావడం లేదు. ఎండ తీవ్రత ఎక్కువ అవుతున్న కొద్దీ ప్రజలకు ముఖ్యంగా యువకులకు పెద్దలకు దాహం తీర్చుకునేందుకు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని మా దృష్టికి రావడం జరిగినది. ఈ జిల్లాలోనే కాదు కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, భూపాలపల్లి, ఆసిఫాబాద్ వంటి జిల్లాల్లో కూడా కింగ్ ఫిషర్ లైట్ బీర్లు(Light Beers) లభ్యం కావడం లేదు. ఈ లైట్ బీర్లను తాగడం ద్వారా మత్తు తక్కువ సమయం ఉంటుంది. ఆ తర్వాత మా పనులను మేము చేసుకోగలుగుతాము. స్ట్రాంగ్ బీర్లు(Strong Beers) తాగడం ద్వారా కడుపులో మంట, తీవ్రమైన తలనొప్పి, వాంతులు వంటివి వస్తున్నాయి. మాకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండడానికి మాకు కావాల్సిన చల్లటి కింగ్ ఫిషర్ బీర్లను జిల్లాలోని అన్ని వైన్ షాపులలో బార్లలో అందుబాటులో ఉండే విధంగా చేయగలరని కింగ్ ఫిషర్ లైట్ బీర్లు తాగే ప్రతి ఒక్కరి తరపున మిమ్మల్ని కోరుతున్నాము. మాకు సహకరించినట్లయితే మన రాష్ట్ర ఆదాయాన్ని మరింత రెట్టింపు చేయుటకై మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాము."
"ఈ సందర్భంగా కొన్ని వైన్ షాపులు(Wine Shops) సిండికేట్ అయి కింగ్ ఫిషర్ లైట్ బీర్లలో మార్జిన్ అనేది తక్కువ వస్తుందని వాటిని తెప్పించడం లేదని సమాచారం అందుకని మాకు కొత్త కొత్త రకం బీర్లను(Beers) అలవాటు చేస్తున్నారు. గతిలేక మేము వాటిని తాగడం అవుతుంది. దాని ద్వారా మా ఆరోగ్యాలు పాడయ్యే అవకాశం ఉంది, రాష్ట్ర ఆదాయం కోసం మా ఆరోగ్యాలు సైతం లెక్కచేయని మాపై దయచేసి ఇట్టి విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకొని మేము కోరిన విధంగా జిల్లాలో స్టాక్ ఉండేలాగా సహకరించగలరని "తాగుబోతుల సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కొట్రంగి తరుణ్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కు ఫిర్యాదు చేశాడు.
వైరల్ గా మారిన ఫిర్యాదు
ఎన్నికల వేళ తాగుబోతులకు తాగినంత మందు (Liquor)దొరుకుతుండగా, చల్లని లైట్ బీర్ల కొరత మందుబాబులను ఇబ్బంది పెడుతుందని తాగుబోతుల సంక్షేమ సంఘం మంచిర్యాలజిల్లా అధ్యక్షుడి ఫిర్యాదు సంచలనంగా మారి సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతుంది. తాగుబోతులకు ఎంత కష్టం వచ్చిందని జనం చర్చించుకునే పరిస్థితి ఏర్పడింది. తాగుబోతుల సంఘం అధ్యక్షుని ఫిర్యాదుతో ఎక్సైజ్ అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతారో చూడాలని జనం ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
HT TELUGU CORRESPONDENT K.V.REDDY, KARIMNAGAR