KCR Temple : తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పై విపరీతంగా అభిమానం పెంచుకున్న ఉద్యమకారుడు గుండా రవీందర్ 2016లో మంచిర్యాల జిల్లా దండేపల్లిలో తన నివాసం ఎదుట రూ.2 లక్షలు ఖర్చు చేసి కేసీఆర్ గుడి నిర్మించారు. కేసీఆరే తన దేవుడు అని కేసీఆర్ విగ్రహానికి పూజలు సైతం నిర్వహించారు.
అయితే మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, తనను పట్టించుకోవడం లేదని, కేసీఆర్ గుడి కట్టి తాను రెండు లక్షలు నష్టపోయానని ఇప్పుడు ఆ గుడిని అమ్మకానికి పెట్టాడు రవీందర్. అంతే కాకుండా కేసీఆర్ గుడి ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఇతర నేతలను ఆహ్వానించినప్పటికీ వారు రాకపోవడంతో తనకు చిన్నతనంగా అనిపించిందని గుండా రవీందర్ వెల్లడించాడు.
తెలంగాణ ఉద్యమ సమయంలో తనకు కేసీఆర్ కు సానిహిత్యం ఉండేదని, సీఎంను పలు మార్లు కలిసే ప్రయత్నం చేయగా తనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని వాపోయారు రవీందర్. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యమకారులకు గౌరవం ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. కేసీఆర్ గుడి అమ్మకానికి సంబంధించి రవీందర్ ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.
ఆసక్తి గల వారు కేసీఆర్ గుడి, విగ్రహాన్ని కొనుగోలు చేసి తనను ఆర్థికంగా ఆదుకోవాలని ఫ్లెక్సీపై రాశారు. కాగా ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన గుండా రవీందర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అప్పటి టీఆర్ఎస్ పార్టీకి పని చేశానని, ఇప్పుడు తనను ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల వేళ కేసీఆర్ గుడి, విగ్రహం అమ్మకం అంశం వైరల్ గా మారింది.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్