Family Suicide Attempt : స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు, దివాళా తీసి కుటుంబం సూసైడ్ అంటెప్ట్
Family Suicide Attempt : స్టాక్ మార్కెట్ లో నష్టాలు, అప్పులు తెచ్చిన చోట ఒత్తిళ్లతో మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. బాధితులను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
Family Suicide Attempt : స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు ఓ కుటుంబాన్ని నిండా ముంచాయి. ఆశించిన లాభాలు రాకపోవడం, అప్పులు తెచ్చిన చోట ఒత్తిళ్లు ఎక్కువవడంతో కుటుంబమంతా కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పురుగుల మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేయగా.. గమనించిన స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కాసిపేట గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకోగా.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం మంచిర్యాల జిల్లాలో కలకలం రేపింది. బాధితులంతా ఇప్పుడు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
బాధిత కుటుంబ సభ్యులు ప్రాథమికంగా తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కాసీపేట గ్రామానికి చెందిన సముద్రాల మొండయ్య కిరాణా షాప్ నడిపిస్తుండేవాడు. ఆయనకు భార్య శ్రీదేవి, కొడుకు శివ ప్రసాద్, కూతురు చైతన్య ఉన్నారు. కాగా కొద్దిరోజులుగా శివ ప్రసాద్ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టాడు. ఇందుకు తెలిసిన వారి దగ్గర పెద్ద మొత్తంలోనే అప్పులు చేశాడు. కానీ లాభాలు ఆశించినంతగా లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు. స్నేహితులు, సన్నిహితుల నుంచి తీసుకున్న అప్పులు, వడ్డీలు చెల్లించేందుకు వివిధ లోన్ యాప్ ల నుంచి కూడా వీలైనంత అప్పులు చేశారు. అయినా సమస్య తీరకపోవడం, అప్పులు ఇచ్చిన వ్యక్తుల నుంచి ఒత్తిళ్లు ఎక్కువవడంతో ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు.
స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు, లోన్ యాప్ ల అప్పులతో తీవ్రంగా నష్టపోయిన కుటుంబం సూసైడ్ చేసుకునేందుకు నిర్ణయించుకుంది. ఈ మేరకు మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మొండయ్య (60), సముద్రాల శ్రీదేవి(50) కూతురు చైతన్య (30) కుమారుడు శివ ప్రసాద్(26) అంతా కలిసి గడ్డి మందు తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. అనంతరం సముద్రాల మొండయ్య గడ్డి మందు తాగిన విషయాన్ని తన బావమరిది రమేష్ కు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో వాళ్లు హుటాహుటిన మొండయ్య ఇంటికి చేరుకోగా.. వాళ్లంతా గడ్డి మందు తాగి కనిపించారు. అనంతరం వారిని 108 వాహనంలో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వెంటనే మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ వారి పరిస్థితి మెరుగు పడకపోవడంతో నలుగురినీ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
శివ ప్రసాద్ పరిస్థితి విషమం
ఒకే కుటుంబంలో నలుగురు గడ్డి మందు తాగగా.. వారిని ఎంజీఎం ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కాగా అందులో శివ ప్రసాద్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మొండయ్య, శ్రీదేవి, చైతన్య ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగానే ఉండగా.. మరికొన్ని గంటలు గడిస్తేగానీ వారి ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాగా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు, లోన్ యాప్ లలో అప్పులతో కుటుంబం మొత్తం ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం మంచిర్యాల జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
సంబంధిత కథనం