Mla Durgam Chinnaiah : రైతులు ఆత్మహత్యలు చేసుకుని చావాలి, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వివాదాస్పద వ్యాఖ్యలు-mancherial brs mla durgam chinnaiah controversial comments on farmers suicides ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mla Durgam Chinnaiah : రైతులు ఆత్మహత్యలు చేసుకుని చావాలి, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వివాదాస్పద వ్యాఖ్యలు

Mla Durgam Chinnaiah : రైతులు ఆత్మహత్యలు చేసుకుని చావాలి, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వివాదాస్పద వ్యాఖ్యలు

Mla Durgam Chinnaiah : రైతుల ఆత్మహత్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుని చావాలంటూ వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

Mla Durgam Chinnaiah : బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బట్వాన్ పల్లిలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశానికి అన్నం పెట్టే రైతన్నలు ఆకలితో చావొద్దు, ఆత్మహత్యలు చేసుకుని చావాలని అని వ్యాఖ్యానించారు. ఈ వీడియోలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఈ నెల 21న బట్వాన్ పల్లిలో నూతన గ్రామపంచాయతీ భవనం, మురికి కాల్వ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ... రైతుల ఆత్మహత్యలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుని చావాలంటూ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అనగానే అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. అయితే ఎమ్మెల్యే పొరపాటున ఇలా మాట్లాడారని బీఆర్ఎస్ కార్యకర్తలు అంటున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని సీఎం కేసీఆర్ పలు సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారని చెప్పడం ఎమ్మెల్యే ఉద్దేశమని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి. అయితే ఎమ్మెల్యే వీడియో నెట్టింట వైరల్ కావడంతో ప్రతిపక్షాలు దుర్గం చిన్నయ్యపై మండిపడుతున్నాయి.

లైంగిక ఆరోపణలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఆరిజిన్ డెయిరీ సీఈవో బోడపాటి శేజల్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. శేజల్ పలుమార్లు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేపై దిల్లీ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దుర్గం చిన్నయ్యకు మళ్లీ సీటు కేటాయించడంపై శేజల్ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారంటూ మండిపడ్డారు. ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న ఎమ్మెల్యే...తాజాగా రైతుల ఆత్మహత్యలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అంగన్ వాడీలపై నోరుపారేసుకున్న ఎమ్మెల్యే

ఇటీవల అంగన్వాడీలు ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా బెల్లంపల్లిలో సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లగా ఆయన మహిళపై నోరు పారేసుకున్నారు. గత ఆదివారం అంగన్‌‌వాడీలు బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు వెళ్లి దుర్గం చిన్నయ్యకు వినతి పత్రం అందించారు. అదే సమయంలో సీపీఎం, సీఐటీయూ నేతలు అంగన్వాడీలతో పాటు అక్కడికి వెళ్లారు. వారిని చూసిన ఎమ్మెల్యే... 'ఎందుకొచ్చారు? వెళ్లిపోండి' అని కసురుకున్నారు. ఈ మూడు ముక్కల ఎర్రజెండాల వారితో ఏమవుతుందని నోరుపారేసుకున్నారు. బీఆర్ఎస్ నేత ఒకరు సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి కాలర్ పట్టి లాగి నానా హంగామా చేశారు. దీంతో అంగన్వాడీలతో పాటు సీపీఎం నేతలు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు.