Jagtiyal Crime : జగిత్యాల జిల్లాలో దారుణం, ముగ్గురు భార్యలు గల భర్తపై పెట్రోల్ దాడి-ఆస్తి వివాదాలే కారణం!
Jagtiyal Crime : జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ముగ్గురు మహిళలను వివాహం చేసుకున్నాడు. ఆస్తి తగాదాల కారణంగా మొదటి భార్య కుమారులు తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. ఈ ఘటనలో తండ్రి మృతి చెందాడు.
Jagtiyal Crime : జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అక్కాచెల్లెళ్లు ఇద్దరినీ పెళ్లి చేసుకున్న వ్యక్తి ముచ్చటగా మరో మహిళను మూడో పెళ్లి చేసుకున్నాడు. మూడు ముళ్ల బంధం, ముగ్గురు యారండ్ల మధ్య ఆస్తి తగాదాకు దారి తీసి చివరకు ఇంటి యజమాని ప్రాణాలు తీసింది. విషాదకర ఘటన జగిత్యాల జిల్లా పోలాసలో చోటుచేసుకుంది.
జగిత్యాల రూరల్ మండలం పోలాస గ్రామానికి చెందిన పడాల కమలాకర్ పై మొదటి భార్య, పిల్లలు పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్ర గాయాల పాలైన కమలాకర్ జగిత్యాల ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. కమలాకర్ కు ముగ్గురు భార్యలు ఉన్నారు. ఆస్తి విషయంలో గొడవ జరగడంతో మొదటి భార్య జమున ఆమె పిల్లలు కమలాకర్ పై దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అక్కాచెల్లెళ్ళను పెళ్లి చేసుకున్న కమలాకర్
కమలాకర్ ముందుగా జమున అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. కొంత కాలానికి జమున చెల్లెలు లలితను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కొడుకులు ఓ బిడ్డ ఉన్నారు. ఇద్దరు కొడుకులైన పడాల చిరంజీవి, పడాల రంజిత్, కూతురు శిరీషకు వివాహం కూడా చేశాడు. అంతా సవ్యంగా సాగుతున్న సంసారంలో కమలాకర్ మరో మహిళతో సన్నిహితంగా మెలిగాడు. బీదర్ కు చెందిన మహిళను మూడో వివాహం చేసుకోని పొలాసలో కాపురం పెట్టాడు. కోడళ్లు, అల్లుడు వచ్చాక ఇదేం పద్దతని మొదటి భార్య పిల్లలు నిలదీశారు. దీంతో మద్యం మత్తులో కమలాకర్ వారితో గొడవ పడ్డాడు. ఆస్తి విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది.
ఇద్దరు భార్యలు ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్లు, బిడ్డ అల్లుడు ఉండగా మరో మహిళను పెళ్లి చేసుకున్న కమలాకర్ పై ఆగ్రహంతో మొదటి భార్య అమె కొడుకులు దాడి చేశారు. ఆగ్రహ వేషాలతో పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్ర గాయాల పాలైన కమలాకర్ ను స్థానికులు జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
ప్రాణం తీసిన క్షణికావేశం
ముగ్గురు భార్యలు, డజన్ మంది కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాల్సిన కుటుంబంలో ఆస్తి వివాదం క్షణికావేశం కుటుంబ పెద్ద ప్రాణాలు తీయడం సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది. మొదటి భార్య పిల్లలు పరారీలో ఉండగా రెండో భార్య మూడో భార్య అంతిమ సంస్కారం నిర్వహించారు. మూడు పెళ్లిళ్ల వల్లనే ఆస్తి వివాదం తలెత్తిందని స్థానికులు తెలిపారు.
లొంగిపోయిన మొదటి భార్య పిల్లలు
విషాదకర ఘటన జగిత్యాల జిల్లాలో కలకలం సృష్టించింది. కమలాకర్ పై దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించిన మొదటి భార్య జమున కొడుకులు చిరంజీవి రంజిత్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు పోలీసులకు లొంగిపోయారు. పోలీసులు మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కేసు విచారణ చేపట్టామని ఘటనకు బాద్యులు ఎవరైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు ప్రకటించారు.
రిపోర్టింగ్ : కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం