TG Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. హరీష్ రావు పేషీలో పనిచేసిన వ్యక్తి అరెస్టు
TG Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో హరీష్ రావు పేషీలో పనిచేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు వంశీకృష్ణ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.
తన ఫోన్ ట్యాప్ చేశారంటూ.. సిద్ధిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ గతేడాది డిసెంబర్ 3న పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. 66 ఐటీ చట్టం – సమాచార సాంకేతిక నేరాల చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు తాజాగా.. ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలను డీసీపీ విజయ్‌కుమార్ వెల్లడించారు.
చక్రధర్ ఫిర్యాదుతో..
మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ పోలీసు అధికారి రాధాకిషన్‌రావు తన ఫోన్ ట్యాప్ చేశారంటూ.. చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు కీలక సమాచారం సేకరించారు. ఆధారాలు లభించడంతో అరెస్టులు ప్రారంభించారు. హరీష్ రావు మంత్రిగా ఉన్న సమయంలో ఆయన పేషీలో పనిచేసిన టి.వంశీకృష్ణ, అతడికి సహకరించిన టి.సంతోష్‌కుమార్, బి.పరశురాములును అరెస్టు చేశారు.
2023 జూన్ నుంచి..
వీరికి న్యాయస్థానం ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది. దీంతో వారిని జైలుకు తరలించారు. 'సిద్దిపేటకు చెందిన వంశీకృష్ణ కొంతకాలం నల్గొండ జిల్లా ఆరోగ్యశ్రీ మేనేజర్‌గా పని చేశాడు. అక్కడ అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించిన అధికారులు.. అతడిని విధుల నుంచి తొలగించారు. 2023 జూన్‌లో హరీష్ రావు పేషీలో ఉద్యోగిగా చేరి డిసెంబరు వరకూ పనిచేశాడు' అని డీసీపీ విజయ్ కుమార్ వివరించారు.
చనిపోయిన వ్యక్తి పేరుపై..
'హరీష్ పేషీలో పనిచేసే సమయంలోనే సిద్దిపేటలోని భవానీ కమ్యూనికేషన్స్ నిర్వాహకుడు సంతోష్‌కుమార్, కారు డ్రైవర్ పరశురాములు సాయంతో.. మరణించిన రైతు గుర్తింపు కార్డును ద్వారా సిమ్ కార్డు తీసుకున్నాడు. ఆ మొబైల్ నంబర్‌ను ఉపయోగించి ఎన్నో అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డాడు. చక్రధర్ గౌడ్‌కు కూడా అదే నంబర్ నుంచి వాట్సప్ కాల్ చేసి బెదిరించాడు. డబ్బులు డిమాండ్ చేశాడు' అని డీసీపీ వెల్లడించారు.
వంశీకృష్ణ ఆగడాలు..
'చక్రధర్ గౌడ్ తన ఫిర్యాదులో చెప్పిన వాట్సప్ నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వంశీకృష్ణ ముఠా చేసిన ఆగడాలను గుర్తించారు. ఈ మొబైల్ నంబర్ ఉపయోగించి నకిలీ బిల్లుల ద్వారా ఆరోగ్యశ్రీ నిధులను పక్కదారి పట్టించి ఉండొచ్చని అనుమానిస్తున్నాం. దీనికి సంబంధించి ఆధారాలు సేకరిస్తున్నాం' అని డీసీపీ విజయ్ కుమార్ స్పష్టం చేశారు.