Khammam Crime News : ఖమ్మం జిల్లాలో దారుణం.. ఆస్తి కోసం తల్లితో పాటు ఇద్దరు కుమార్తెల హత్య-man killed his own mother and two children for property in khammam ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Khammam Crime News : ఖమ్మం జిల్లాలో దారుణం.. ఆస్తి కోసం తల్లితో పాటు ఇద్దరు కుమార్తెల హత్య

Khammam Crime News : ఖమ్మం జిల్లాలో దారుణం.. ఆస్తి కోసం తల్లితో పాటు ఇద్దరు కుమార్తెల హత్య

HT Telugu Desk HT Telugu
May 18, 2024 01:02 PM IST

Khammam Crime News: ఖమ్మం జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ఆస్తి కోసం కన్న తల్లిని కుమారుడు హత్య చేశాడు. అంతేకాదు ఈ ఘటనలో తన ఇద్దరు కుమార్తెల ప్రాణాలను కూడా తీశాడు.

ఆస్తి కోసం కన్న తల్లి హత్య
ఆస్తి కోసం కన్న తల్లి హత్య (photo source unshplash.com)

Mother Killed by Son in Khammam : ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం కన్న తల్లిని, కని పెంచిన ఇద్దరు చిన్నారులను అత్యంత దారుణంగా హతమార్చాడో కిరాతకుడు. 

తల్లాడ మండలం గోపాలపేట గ్రామానికి చెందిన పిట్టల వేంకటేశ్వర్లుకి తల్లి పిచ్చమ్మతో పాటు భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. కాగా జల్సాలకు అలవాటు పడిన వెంకటేశ్వర్లు రెండు సంవత్సరాల కిందట మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని కట్టుకున్న భార్యను హత్య చేశాడు. ఆ సమయంలో కొంతకాలం జైలు జీవితం గడిపిన అతను బెయిల్ పై ఇంటికి వచ్చాడు.

ఆ తర్వాత కూడా అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ కుటుంబానికి దూరంగా ఖమ్మం నగరంలో ఆమెతో కలిసి సహ జీవనం చేస్తున్నాడు. దీంతో వెంకటేశ్వర్లు తల్లి పిచ్చమ్మ ఇద్దరు మనుమరాళ్ళని సాకుతూ గోపాలపేటలోనే నివాసం ఉంటోంది.

పిల్లల పేరిట ఆస్తి….!

తన కొడుకు నేర ప్రవృత్తి గురించి తెలిసిన పిచ్చమ్మ ఇద్దరు మనవరాళ్ల భవిష్యత్తు గురించి ఆలోచనలో పడింది. దీంతో తన పేరిట ఉన్న స్థిరాస్తిని ఆ ఇద్దరు పిల్లల పేరిట పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి సైతం తీసుకొచ్చింది. వారు కూడా ఇందుకు అంగీకరించడంతో పిల్లల పేరిట ఆస్తిని బదలాయించేందుకు నిశ్చయించారు. 

 ఈ విషయం తెలుసుకున్న వెంకటేశ్వర్లు ఆవేశంతో ఊగిపోయాడు. తన తల్లి దగ్గరికి తరచూ వచ్చి ఆస్తిని పిల్లల పేరిట రాయడానికి వీల్లేదంటూ ఘర్షణ పడేవాడు. అలా చేస్తే హతమారుస్తానంటూ ఒకటి రెండు సార్లు హెచ్చరికలు కూడా చేశాడు. అయినా తన మనవరాళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.

ఇంటికి వస్తానని చెప్పి మరీ..

ఆస్తి వ్యవహారంలో తరచూ గొడవ పడుతున్న వెంకటేశ్వర్లు శుక్రవారం రాత్రి ఇంటికి వస్తానని హెచ్చరించాడు. దీంతో ఖంగారు పడిన తల్లి పిచ్చమ్మ ఇంటి చుట్టుపక్కల వారికి సమాచారం అందించింది. దీంతో వారంతా అప్రమత్తమై రాత్రి పొద్దుపోయే వరకూ వారికి కాపలాగా ఉన్నారు. అయితే వ్యూహం మార్చిన అతను రాత్రి వేళ ఇంటికి వెళ్లకుండా తెల్లవారుజామున ఇంటికి వెళ్ళాడు. 

తల్లిని నిద్రలేపి ఆస్తి విషయంలో తీవ్రంగా గొడవ పడ్డాడు. ఈ సమయంలో చుట్టుపక్కల వారు గాఢ నిద్రలో ఉండటంతో ఎవరూ లేవలేదు. తల్లితో వాగ్వాదానికి దిగి తీవ్ర ఆవేశానికి లోనైన వెంకటేశ్వర్లు పిచ్చమ్మను గొంతు నులిమి చంపేశాడు. ఈ గలాటా సమయంలో నిద్రలేచిన ఇద్దరు బిడ్డలు నీరజ(10), ఝాన్సీ(6) భయాందోళనకు గురై జరిగిన విషయాన్ని ఇంటి పక్కన వారికి చెప్పేందుకు ప్రయత్నించారు. తెల్లవారు జాము కావడంతో గాఢ నిద్రలో ఉన్న వారెవరూ నిద్ర లేవలేదు. దీంతో ఆ చిన్నారులపై కూడా విరుచుకుపడిన అతను కిరాతకుడిగా మారాడు.

తొలుత చిన్న కూతురు ఝాన్సీని నేలకేసి కొట్టి అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత పెద్ద కుమార్తెని సైతం గొంతు నులిమి అత్యంత పాశవికంగా హతమార్చాడు. అనంతరం చుట్టుపక్కల ప్రజలు నిద్ర లేచేలోపే అక్కడి నుంచి పరారయ్యాడు. 

తల్లిని, ఇద్దరు చిన్నారులను అత్యంత ఘోరంగా పొట్టన పెట్టుకున్న ఈ కిరాతక ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. హంతకుడి కోసం పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి.

Whats_app_banner