Qatar | హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువకుడు మొఖానికి అద్దుకునే టాల్కమ్ పౌడర్ ను తీసుకెళ్తుండగా డ్రగ్స్ అని భావించిన పోలీసులు అతణ్ని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. రెండు నెలల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ యువకుడిని విడుదల చేయాలంటూ ఇపుడు అతడి తల్లిదండ్రులు, బంధువులు అధికారులకు విజ్ఞప్తి చేసుకుంటున్నారు.,వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని ఉప్పుగూడకు చెందిన మహ్మద్ నవాజ్ అనే యువకుడు ఎంబీయే పూర్తి చేసి ఉద్యోగం కోసం కొన్ని నెలల కిందట దుబాయ్ వెళ్లాడు. అయితే ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా అతడికి దుబాయిలో ఏ ఉద్యోగం లభించలేదు. దీంతో అతడు పక్కనే ఉండే మరో దేశం ఖతార్ వెళ్లి అక్కడ తన అదృష్టాన్ని పరిక్షించుకోవాలని నిర్ణయించుకున్నాడు.,ఈ క్రమంలో గత డిసెంబర్ 11న అతడు ఖతార్ బయలుదేరాడు. అయితే గల్ఫ్ దేశాలలో ఉండే తీవ్రమైన ఎండ, వేడి వాతావరణాన్ని తట్టుకునేందుకు అతడు ఒక టిష్యూ పేపర్‌లో కొద్దిగా పాండ్స్ టాల్కమ్ పౌడర్ ను తన ల్యాప్‌టాప్ బ్యాగ్‌లో వేసుకున్నాడు. ఈ క్రమంలో ఖతార్ విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు అనుమానంగా నవాజ్ బ్యాగ్‌ను చెక్ చేశారు. టిష్యూ పేపర్‌లో ఉన్న టాల్కమ్ పౌడర్ ను మాదక ద్రవ్యాలుగా భావించిన అధికారులు వెంటనే అతణ్ని పోలీసులకు అప్పగించారు. అప్పట్నించీ ఆ యువకుడు ఖతార్ జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నాడు. పౌడర్ నమూనాను పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపగా టాల్కమ్ పౌడర్ అని తేలింది. అయినప్పటికీ ఆ యువకుడు విడుదల కాలేదు. దీంతో నవాజ్ తల్లిదండ్రులు, ఖతార్ లోని వారు బంధువులు అతడు నిర్ధోషి అని విడిచిపెట్టాలని అధికారులను వేడుకుంటున్నారు.,గల్ఫ్ దేశాల్లో నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. ఆ దేశాలలో ప్రయాణించేటపుడు ఎలాంటి పౌడర్ కానీ, పిండి కానీ, చక్కెర, కాఫీ, కారం లాంటి పొడులను కూడా వెంట తీసుకెళ్లడాన్ని అనుమతించరు.