Hyderabad : అబిడ్స్ లో అగ్ని ప్రమాదం.. కారులో నిద్రిస్తున్న వ్యక్తి సజీవ దహనం
Fire Accident In Abids Car Garage: హైదరాబాద్ అబిడ్స్ లోని ఓ కార్ల షెడ్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఈ ప్రమాదంలో 7 కార్లు దగ్ధం కాగా.. కారులో నిద్రిస్తున్న ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు.
Fire Accident In Abids Car Garage: హైదరాబాద్ లో వరుసగా అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సికింద్రాబాద్ ఘటన మరకముందే... తాజాగా అబిడ్స్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అబిడ్స్ బొగ్గుల కుంటలోని కామినేని ఆస్పత్రిని పక్కనే ఉన్న కారు గ్యారేజీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం 7కు పైగా కార్లు దగ్ధమయ్యాయి. అయితే ఓ వ్యక్తి కూడా సజీవ దహనమయ్యాడు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది.. సహాయక చర్యలు చేపట్టింది.
కారులో నిద్ర...
దగ్ధమైన కార్లలోని ఓ కారులో సెక్యూరిటీ గార్డు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యాడు. అతడిని సంతోష్ గా గుర్తించారు. ఉదయం ఒక పని చేసుకుంటే... రాత్రి వేళలో సెక్యూరిటీ గార్డుగా సంతోష్ పని చేస్తున్నట్లు తెలిసివచ్చింది. రోజు మాదిరిగానే శుక్రవారం ఉదయం ఇంట్లోంచి పనికి వెళ్లిన సంతోష్... రాత్రి సెక్యూరిటీ విధులకు వెళ్లాడు. అర్ధరాత్రి తర్వాత... కార్ల షెడ్ లోని ఓ కారులో నిద్రపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో మంటల్లో చిక్కుకొని సజీవ దహనమైనట్లు పోలీసులు భావిస్తున్నారు.
సెక్యూరిటీ గార్డు సంతోష్ కు తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. కుటుంబ పెద్ద దిక్కు చనిపోవటంతో తమ పరిస్థితేంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Fire Accident: ఇదే నెల 16వ తేదీన సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్న కాల్ సెంటర్‌లో పని చేస్తున్న వారు మంటలు చెలరేగిన వెంటనే తప్పించుకునే మార్గం లేకపోవడంతో ఓ గదిలో దాక్కున్నారు. మంటల తీవ్రతతో పాటు పొగకు ఉక్కిరిబిక్కిరైన వారు అపస్మారక స్థితికి చేరుకున్నారు. మంటల్ని అదుపు చేసిన తర్వాత ఫైర్, రెస్క్యూ సిబ్బంది భవనాన్ని తనిఖీ చేస్తుండగా ఓ గదిలో ఆరుగురు స్పృహ కోల్పోయి ఉండటన్ని గుర్తించారు. వారికి సిపిఆర్ చేసి ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.
ఎనిమిది అంతస్తుల్లో ఉన్న స్వప్నలోక్ కాంప్లెక్స్ ఏడో అంతస్తులో మొదట మంటలు వెలువడ్డాయి. అవి క్రమంగా నాలుగో అంతస్తు వరకు విస్తరించాయి. ఐదో అంతస్తులో పేలుడు జరగడంతో మంటలు భారీగా ఎగిసి పడ్డాయి. స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో వస్త్ర దుకాణాలతో పాటు కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్లు, కాల్ సెంటర్లు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు ఉన్నాయి. దీంతో నిత్యం రద్దీగా ఉంటుంది. మంటలు చెలరేగిన వెంటనే కాంప్లెక్స్‌లో పనిచేసే వారు, షాపింగ్ కోసం వచ్చిన వారు వెంటనే కిందకు దిగిపోయారు. ఈ క్రమంలో ఐదో అంతస్తులో పేలుళ్లతో కొందరు కిందకు రాలేకపోయారు. ఫలితంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
వరుస అగ్నిప్రమాదాలపై హైదరాబాద్ నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాల జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.