Choutuppal Murder: స్కూల్‌ నుంచి ఆలస్యంగా వచ్చాడని కొడుకుని కొట్టి చంపేశాడు.. చౌటుప్పల్‌లో ఘోరం-man beats son to death for coming home late from school horrific incident in choutuppal ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Choutuppal Murder: స్కూల్‌ నుంచి ఆలస్యంగా వచ్చాడని కొడుకుని కొట్టి చంపేశాడు.. చౌటుప్పల్‌లో ఘోరం

Choutuppal Murder: స్కూల్‌ నుంచి ఆలస్యంగా వచ్చాడని కొడుకుని కొట్టి చంపేశాడు.. చౌటుప్పల్‌లో ఘోరం

Bolleddu Sarath Chandra HT Telugu
Published Feb 10, 2025 07:36 AM IST

Choutuppal Murder: మద్యం మత్తులో విచక్షణ మరిచిన వ్యక్తి స్కూల్‌ నుంచి ఆలస్యంగా ఇంటికి వచ్చాడని కొడుకుని కొట్టి చంపేశాడు. పోలీస్ కేసు అవుతుందనే భయంతో హడావుడి అంత్యక్రియలు పూర్తి చేసేందుకు ప్రయత్నించాడు. పోలీసులకు సమాచారం అందడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

అనూహ్యంగా ప్రాణాలు పోగొట్టుకున్న స్కూల్ విద్యార్థులు
అనూహ్యంగా ప్రాణాలు పోగొట్టుకున్న స్కూల్ విద్యార్థులు

Choutuppal Murder: యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. స్కూల్ నుంచి ఆలస్యంగా వచ్చినందుకు కొడుకుని విచక్షణ రహితంగా కొట్టడంతో బాలుడు ప్రాణాలు విడిచాడు. స్కూల్‌లో ఫేర్‌వెల్‌ పార్టీ జరిగిందని చెబుతున్నా వినకుండా కొట్టడంతో అపస్మారక స్థితికి చేరుకుని ప్రాణాలు విడిచాడు. ఈ విషాద ఘటన యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో జరిగింది.

స్కూల్‌ నుంచి ఇంటికి ఆలస్యంగా వచ్చినందుకు మద్యం మత్తులో ఉన్న తండ్రి విచక్షణా రహితంగా కొడుకుని చితకబాదాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. హడావుడిగా అంత్యక్రియలు చేసేందుకు సిద్ధమవగా ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది.

చౌటుప్పల్ మండలం ఆరేగూడేనికి చెందిన కట్ట సైదులు లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. సైదులుకు భార్య నాగమణి, ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరి మూడో కుమారుడు భానుప్రసాద్(14) చౌటుప్పల్‌లోని ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. పిల్లల చదువుల కోసం ఆరేగూడెం నుంచి వచ్చి చౌటుప్పల్ నివాసం ఉంటున్నారు.

బాలుడు చదువకుంటున్న పాఠశాలలో శనివారం రాత్రి సీనియర్లకు ఫేర్‌వెల్‌ నిర్వహిం చారు. రాత్రి ఎనిమిది గంటల తర్వాత భానుప్రసాద్‌ ఇంటికి వచ్చాడు. అప్పటికే తండ్రి సైదులు ఫూటుగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. కొడుకు ఆలస్యంగా రావడంతో ఆగ్రహంతో అసలు విషయం తెలుసుకోకుండా విచక్షణరహితంగా కొట్టాడు.

ఎందుకు ఆలస్యంగా వచ్చావంటూ కుమారుడిని ఛాతీపై పిడిగుద్దులు గుద్దడం, కాలితో తన్నడంతో భానుప్రసాద్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. బాలుడిని వెంటనే చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే బాలుడు మృతి చెందాడు. పోస్టుమార్టం వద్దని వైద్యులకు తదేహాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. అర్ధరాత్రి ఆరెగూడెంకు తరలించారు.

బాలుడు మరణించిన విషయం పోలీసులకు తెలిస్తే సైదులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని బంధువులు, స్థానికులు భావించారు. మృతదేహాన్ని దహనం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం పది గంటలకు శ్మశానవాటికకు తరలించారు. అప్పటికే పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే స్మశాన వాటికకు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు.

బాలుడి తల్లి నాగమణి నుంచి ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేశారు. భానుప్రసాద్ చదువుకుంటూనే తల్లిదండ్రులకు వ్యవసాయ పనులకు సాయం అందించేవాడు. నిందితుడు సైదులును పోలీసులు అదుపులో తీసుకున్నారు.

పదో తరగతి విద్యార్థిని బలవన్మరణం

పదో తరగతి పరీక్షలు సమీపిస్తుండడంతో సెల్‌ఫోన్‌ చూడొద్దని మందలించడంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుమురం భీం జిల్లా కౌటాల మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. మండల కేంద్రానికి చెందిన బాలిక ప్రైవేటు పాఠశాలలో పదో తర గతి చదువుతోంది.

కాగజ్‌ నగర్‌‌లో శనివారం ఉదయం నవోదయ ప్రవేశ పరీక్షకు హాజరై మధ్యాహ్నం ఇంటికి వచ్చింది. మధ్యాహ్నం నుంచి పాఠశాలకు వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత స్టడీ మెటీరియల్ పీడీఎఫ్ కోసం ఫోను ఇవ్వాలని తల్లిని అడగడంతో పీడీఎఫ్‌ వద్దని జిరాక్స్ తీసుకొస్తానని చెప్పింది.

బాలికకు ఫోన్‌ ఇవ్వకుండా తల్లి జిరాక్స్ కోసం బయటకు వెళ్లారు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఉరేసుకుంది. ఇంటికి వచ్చిన తల్లి వెంటనే భర్తకు ఫోన్ చేసి విషయం తెలియజేసింది. దంపతులిద్దరూ వెంటనే బాలికను సిర్పూర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయిందని వైద్యులు ధృవీకరించారు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

Whats_app_banner