హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం - 17 మంది మృతి...!-major fire breaks out at gulzar house in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం - 17 మంది మృతి...!

హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం - 17 మంది మృతి...!

హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుల్జార్ హౌస్ లో జరిగిన ప్రమాదంలో… 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి సంబంధించి అధికారికంగా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ గుల్జార్‌ హౌస్‌ పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ భవనంలో మంటలు చెలరేగటంతో….ఈ ఘటనలో 16 మంది మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

17 మంది మృతి…!

ప్రాథమిక వివరాల ప్రకారం…ఆదివారం ఉదయం ఓ భవనంలో ప్రమాదం సంభవించింది. ఈక్రమంలోనే భవనంలో ఉన్న ఏసీ కంప్రెషర్ పేలటంతో తీవ్రత పెరిగింది. ఈ ఘోర ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. గాయపడిన వారిని దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించారు.

ఈ అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. మొదట ఎనిమిది మంది చనిపోగా… ఆ తర్వాత 11కు చేరింది. ఆ కాసేపటికే 17కు చేరిపోయింది. గాయపడిన వారికి వేర్వురు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం.

మృతుల వివరాలు:

  • రాజేంద్రకుమార్‌ (67)
  • అభిషేక్‌ మోదీ (30)
  • సుమిత్ర (65)
  • హర్షాలీ గుప్తా (7)
  • రజని అగర్వాల్‌
  • అన్య మోదీ
  • పంకజ్‌ మోదీ
  • వర్ష మోదీ
  • మున్నీబాయి (72)
  • ఇద్దిక్కి మోదీ
  • రిషభ్‌
  • ప్రథమ్‌ అగర్వాల్‌
  • ప్రాంశు అగర్వాల్‌
  • ఆరుషి జైన్‌ (17)
  • షీతల్‌ జైన్‌ (37)
  • ఇరాజ్‌ (2)

కారణాలేంటి…?

షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే దట్టమైన పొగలు సంభవించాయి. అప్రమత్తమైన స్థానికులు…. పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అగ్నిప్రమాద సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఎస్డీఆర్‌ఎఫ్‌, పోలీసు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలో ఉన్న కొందర్నీ బయటకు తీసుకురాగలిగారు.

సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

పాతబస్తీ మీర్ చౌక్ ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పలువురు మరణించడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ఓ ప్రకటన ద్వారా తెలిపారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనపై బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా - కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ…. “ఒక కుటుంబానికి చెందిన ముత్యాల దుకాణంలో మంటలు చెలరేగాయి. వారి ఇల్లు దుకాణం పైన ఉన్న అంతస్తులో ఉంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో చాలా మంది మరణించారు. కొందరు గాయపడ్డారు. కానీ హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం కాబట్టి… పోలీసు, మున్సిపల్, అగ్నిమాపక మరియు విద్యుత్ విభాగాలను బలోపేతం చేయాలి. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా, క్షతగాత్రులకు రూ.50 వేల ఆర్ధిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు” అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.

అన్ని రకాల చర్యలు చేపట్టాం - మంత్రి పొన్నం ప్రభాకర్

“ఉదయం పూట 6:16 గంటలకు ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం రాగానే వెనువెంటనే నిమిషాల్లో ఫైర్ సిబ్బంది వచ్చి అగ్ని ప్రమాద నివారణ చర్యలు చేపట్టి మంటలు ఆర్పేశారు. అందులో నివసిస్తున్న 17 మందికి తీవ్ర ఇబ్బందులు కలిగాయి. వారందరినీ హాస్పిటల్ కి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం వారందరికీ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. అగ్ని ప్రమాదంలో మెజారిటీ గా మరణించారనీ సమాచారం ఉంది. ప్రభుత్వం తరుపున అని రకాల చర్యలు చేపట్టాం” అని మంత్రి పొన్నం చెప్పారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.