TG Earthquake : తెలంగాణలో మళ్లీ భూప్రకంపనలు, రిక్టర్ స్కేల్ పై 3.0 తీవ్రత నమోదు
TG Earthquake : తెలంగాణలో మళ్లీ భూ ప్రకంపనలు వచ్చాయి. మహబూబ్ నగర్ జిల్లాలో భూమి కంపించింది. పలు ప్రాంతాల్లో 3.0 తీవ్రతతో భూమి కంపించింది. ములుగు జిల్లా కేంద్రంగా ఇటీవల భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.
తెలంగాణలో మళ్లీ భూ ప్రకంపనలు వచ్చాయి. మహబూబ్ నగర్ జిల్లాలో మరోసారి భూమి కంపించింది. పలు ప్రాంతాల్లో 3.0 తీవ్రతతో భూమి కంపించింది. కౌకుంట్ల మండలం దాసరిపల్లి సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తులు గుర్తించారు. శనివారం మధ్యాహ్నం కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భూమి కంపించిన విషయం తెలిసిందే.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు ప్రజలను భయపెడుతున్నాయి. ఈ నెల 4న తెలంగాణలోని ములుగు జిల్లా కేంద్రంగా వచ్చిన భూకంపం...హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైందని పరిశోధకులు తెలిపారు. తాజాగా శనివారం తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.0గా నమోదైనట్లు పరిశోధకులు వెల్లడించారు. భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
మేడారానికి సమీపంలో
ఈ నెల 4న ములుగు జిల్లాలోని మేడారానికి ఉత్తర దిశలో భూకంప కేంద్రం రికార్డు అయ్యిందని శాస్త్రవేత్తలు తెలిపారు. భూమి లోపల దాదాపు 40 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం నమోదైనట్లు చెప్పారు. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3 నమోదైంది. దీని ప్రభావంతో హైదరాబాద్, వరంగల్, హనుమకొండ, ఖమ్మం, భద్రాద్రి, ఏపీలోని పలు జిల్లాల్లో భూమి కంపించింది. దాదాపు 55 ఏళ్ల తర్వాత ఇంత తీవ్రస్థాయిలో భూమి కంపించినట్లు పరిశోధకులు తెలిపారు. భూమి పొరల మధ్య తేడాల కారణాల వల్ల భూప్రకంపనులు వస్తాయన్నారు. గోదావరి బెల్ట్‌లో భూమి పొరల మధ్య తేడాలున్నాయని, అందుకే పలుమార్లు ప్రకంపనలు సంభవిస్తుంటాయని పేర్కొన్నారు.
ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం కేంద్రానికి చుట్టూ 232 కిలోమీటర్ల పరిధిలో...ప్రకంపనలు వచ్చినట్లు పేర్కొన్నారు. తెలంగాణతో పాటు ఏపీ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలలో భూమి కంపించినట్లు తెలిపారు. 2018లో చివరిసారిగా తెలంగాణలో భూప్రకంపనలు వచ్చాయి. 5.0 తీవ్రత కంటే అధికంగా దక్షిణ భారతదేశంలో భూమి కంపించడం 55 ఏళ్ల తరువాత అదే మొదటిసారి అని శాస్త్రవేత్తలు అంటున్నారు.
తెలంగాణ జోన్-2 లో
భూకంప తీవ్రతను బట్టి దేశాన్ని జోన్2, జోన్-3, జోన్-4, జోన్-5 ఇలా నాలుగు జోన్లుగా విభజించారు. జోన్-5 అత్యంత భూకంప క్రియాశీల ప్రాంతం కాగా, జోన్-2 అతి తక్కువ భూకంప తీవ్రత కలిగిన ప్రాంతం. తెలంగాణ అతి తక్కువ భూకంప స్థాయి కలిగిన జోన్-2లో ఉంది. గోదావరి బెల్డ్ ఫాల్ట్ జోన్ ఉంది. ఫాల్ట్ జోన్ అంటే భూ అంతర్భాగంలో రెండు బ్లాకులు ఒకదానితో ఒకటి అకస్మాత్తుగా జారిపడే ప్రదేశం. భూఅంతర్భాగంలో సర్దుబాటుల కారణంగా విడుదలయ్యే శక్తి భూప్రకంపనలకు దారితీస్తుంటాయి. గోదావరి బెల్డ్ లో వచ్చే భూప్రకంపనలపై పరిశోధనలు జరుగుతున్నాయి.
సంబంధిత కథనం