శ్రీవారి దర్శనం కోసం మహబూబ్‌నగర్‌ భక్తుల న్యాయపోరాటం… వినియోగదారుల కమిషన్‌ తీర్పుతో దిగొచ్చిన టీటీడీ-mahabubnagar devotees legal battle for srivari darshan ttd backs down with consumer commission verdict ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  శ్రీవారి దర్శనం కోసం మహబూబ్‌నగర్‌ భక్తుల న్యాయపోరాటం… వినియోగదారుల కమిషన్‌ తీర్పుతో దిగొచ్చిన టీటీడీ

శ్రీవారి దర్శనం కోసం మహబూబ్‌నగర్‌ భక్తుల న్యాయపోరాటం… వినియోగదారుల కమిషన్‌ తీర్పుతో దిగొచ్చిన టీటీడీ

Sarath Chandra.B HT Telugu

కోవిడ్‌ కారణంగా శ్రీవారి సేవల్లో పాల్గొన లేకపోయిన భక్తులకు వినియోగదారుల కమిషన్‌ తీర్పుతో న్యాయం జరిగింది. మేల్‌చాట్‌ వస్త్ర సేవకు బదులు బ్రేక్‌ దర్శనంలో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తామన్న టీటీడీపై భక్తులు న్యాయపోరాటం చేశారు. చివరకు కమిషన్‌ హెచ్చరికతో తప్పు దిద్దుకున్నారు.

శ్రీవారి దర్శనం కోసం మహబూబ్‌నగర్‌ భక్తుల న్యాయపోరాటం

తిరుమల శ్రీవారి సన్నిధిలో నిర్వహించే తిరుప్పావడ, మేల్‌ఛాట్‌ వస్త్ర సేవల్లో పాల్గొనడానికి తీవ్రమైన పోటీ ఉంటుంది. ఈ క్రమంలో 2021లో సేవల్లో పాల్గొనేందుకు 2008లో ఓ భక్తుడు దరఖాస్తు చేసుకున్నాడు. టీటీడీ లక్కీ డ్రాలో అతనికి అవకాశం దక్కింది.

కోవిడ్‌ కారణంగా తిరుమలలో సేవల్ని రద్దు చేయడంతో ఆ భక్తుడికి మేల్‌ఛాట్ వస్త్ర సేవల్లో పాల్గొనే అవకాశం దక్కలేదు. కోవిడ్ ఆంక్షల కారణంగా ఆర్జిత సేవల్ని రద్దు చేయడంతో ఆ తర్వాతి కాలంలో తిరుప్పావడం, మేల్‌ఛాట్‌ సేవల్లో పాల్గొనేందుకు అనుమతించలేమని టీటీడీ తేల్చేసింది.

టీటీడీ తీరుపై మహబూబ్‌నగర్‌కు చెందిన భక్తుడు విని యోగదారుల కమిషన్‌ను ఆశ్రయించి విజయం సాధిం చారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌కు చెందిన వ్యాపారవేత్త శెట్టి చంద్రశేఖర్ దంపతులతో పాటు, వారి కుమా రుడు, కోడలు తిరుమల శ్రీవారికి ప్రతి గురువారం నిర్వహించే తిరుప్పావడ, శుక్రవారం నిర్వహించే మేల్ చాట్ వస్త్ర సేవల్లో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకున్నారు.

2008 నవంబరు 26న రూ.21,250తో టీటీడీ పేరిట డీడీ తీసి లేఖతో సహా తిరుమల పేష్కార్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. స్లాట్‌ బుకింగ్‌ ప్రకారం 2021 సెప్టెంబరు 10న సేవల్లో పాల్గొనేందుకు వారికి సేవల్ని కేటాయించారు. 2021లో వారికి కేటాయించిన స్లాట్ బుకింగ్ కోవిడ్ కారణంగా రద్దు చేశామని, దాని స్థానంలో వారికి బ్రేక్ దర్శనానికి అవకాశం కల్పిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు.

తిరుప్పావడ, మేల్‌చాట్‌ వస్త్ర సేవల కోసం దాదాపు 12ఏళ్లు ఎదురు చూశామని టీటీడీ ప్రతిపాదన సహేతుకంగా లేదంటూ చంద్రశేఖర్ మహబూబ్‌ నగర్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. భక్తుల దరఖాస్తు మేరకు శ్రీవారి సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని, అలా కాకుంటే రెండు జంటలకు రూ.10 లక్షల చొప్పున చెల్లించాలని కమిషన్ న్యాయమూర్తి ఎం. అనూరాధ 2024 మే 8న తీర్పునిచ్చారు.

జిల్లా కమిషన్‌ తీర్పును టీటీడీ సవాల్ చేసింది. రాష్ట్ర వినియోగ దారుల కమిషన్‌ను ఆశ్రయించడంతో వివాదాన్ని జిల్లా కమిషన్‌లోనే తేల్చుకోవాలని సూచించింది. మే 15న జరిగిన విచారణలో గతంలో ఇచ్చిన తీర్పునకు కట్టుబడి ఉంటారో, తీర్పులో 50% డిపాజిట్ చేస్తారో తేల్చుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారు. కమిషన్‌ ఆదేశాలతో చంద్రశేఖర్‌‌ దంపతులతో పాటు అతని కొడుకు, కోడలికి ఆగస్టు 14, 15 తేదీల్లో శ్రీవారి సేవల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తూ టికెట్లను పంపారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం