Mahabubabad : కంప్లైంట్ ఇచ్చేందుకు వెళ్తే కానిస్టేబుల్ బూతుపురాణం, పుట్టినరోజు నాడే తిట్టాడని యువకుడు ఆత్మహత్యాయత్నం-mahabubabad youth suicide attempt after constable scolded on birthday ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mahabubabad : కంప్లైంట్ ఇచ్చేందుకు వెళ్తే కానిస్టేబుల్ బూతుపురాణం, పుట్టినరోజు నాడే తిట్టాడని యువకుడు ఆత్మహత్యాయత్నం

Mahabubabad : కంప్లైంట్ ఇచ్చేందుకు వెళ్తే కానిస్టేబుల్ బూతుపురాణం, పుట్టినరోజు నాడే తిట్టాడని యువకుడు ఆత్మహత్యాయత్నం

HT Telugu Desk HT Telugu
Updated Jul 10, 2024 10:37 PM IST

Mahabubabad News : కంప్లైంట్ ఇచ్చేందుకు స్టేషన్ కు వెళ్లిన ఓ యువకుడ్ని ఆత్మహత్యాయత్నం వరకూ తెచ్చాడో కానిస్టేబుల్. అన్నా అని పిలిచినందుకు బూతు పురాణంతో యువకుడ్ని తీవ్రంగా తిట్టాడు. పుట్టిన రోజే కానిస్టేబుల్ తిట్టాడని ఆ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు.

కంప్లైంట్ ఇచ్చేందుకు వెళ్తే కానిస్టేబుల్ బూతుపురాణం
కంప్లైంట్ ఇచ్చేందుకు వెళ్తే కానిస్టేబుల్ బూతుపురాణం

Mahabubabad News : స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన యువకుడు ఓ కానిస్టేబుల్​ కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కానిస్టేబుల్​ తనను పుట్టినరోజు నాడే అసభ్య పదజాలంతో దూషించాడని ఆరోపిస్తూ నిద్ర మాత్రలు మింగి సూసైడ్​ అటెంప్ట్ చేశాడు. దీంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన మహబూబాద్​ జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి చోటుచేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలోని చేపల మార్కెట్​ బజార్​ కు చెందిన బత్తిని ఉదయ్​ కుమార్​ గతంలో ఓ వ్యక్తికి దాదాపు 12 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. కానీ అప్పు తీసుకున్న వ్యక్తి తిరిగి చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఉదయ్ కుమార్​ పలుమార్లు ఆయనను నిలదీశాడు. అయినా ఫలితం లేకపోవడంతో ఆరు నెలల నుంచి పోలీస్​ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాడు.

అన్నా.. అన్నందుకు బూతులందుకున్న కానిస్టేబుల్​

పెద్ద మొత్తంలో అప్పు తీసుకున్న వ్యక్తి తనకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుండటంతో ఉదయ్​ కుమార్​ మరోసారి ఆయనపై ఫిర్యాదు చేసేందుకు మంగళవారం రాత్రి మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలోని టౌన్​పోలీస్ స్టేషన్​ కు వెళ్లాడు. అదే సమయంలో అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్​ రుద్రయ్య స్టేషన్​ కు వచ్చిన ఉదయ్​ కుమార్​ ను గమనించాడు. విషయం ఏంటో తనకు చెప్పాల్సిందిగా అడిగాదు. దీంతో తనకు ఓ వ్యక్తి రూ.12 లక్షల వరకు బాకీ ఉన్నాడని, ఆయనపై ఫిర్యాదు చేసేందుకు వచ్చానని కానిస్టేబుల్​ రుద్రయ్యను అన్నా అంటూ సంబోధిస్తూ తెలిపాడు. అన్నా అని పిలవడం ఇష్టం లేని రుద్రయ్య వెంటనే బూతు పురాణం అందుకున్నాడు. ఇష్టమొచ్చినట్టు తిట్టడమే కాకుండా అసభ్య పదజాలంతో తీవ్రంగా దూషించాడు. ఉదయ్​ కుమార్​ ఎంత సర్ది చెప్పే ప్రయత్నం చేసినా పట్టించుకోలేదు.

బర్త్​ డే రోజే తిట్టాడని మనస్తాపం

సమస్య మీద ఫిర్యాదు చేసేందుకు వస్తే కానిస్టేబుల్ నానా బూతులు తిట్టినందుకు ఉదయ్​ కుమార్​ తీవ్ర మనస్తాపం చెందాడు. అంతేగాకుండా మంగళవారం ఉదయ్​ కుమార్​ పుట్టిన రోజు కాగా, బర్త్​ డే రోజే కానిస్టేబుల్​ తిట్టడంతో మనోవేదనకు గురయ్యాడు. దీంతో అక్కడి నుంచి ఇంటికి వెళ్లిన ఉదయ్​ కుమార్​ ఇంట్లో ఉన్న నిద్ర మాత్రలు మింగి సూసైడ్​ అటెంప్ట్​ చేశాడు. ఉక్కిరి బిక్కిరవుతున్న ఆయనను గమనించిన కుటుంబ సభ్యులు నిలదీయడంతో తాను నిద్ర మాత్రలు మింగిన విషయం చెప్పాడు. దీంతో వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ​ అడ్మిట్​ చేసి ట్రీట్మెంట్​ అందిస్తున్నారు. ఈ సందర్భంగా బాధితుడు ఉదయ్ కుమార్​ మాట్లాడుతూ తరచూ తమను స్టేషన్​ కు పిలిచి పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అకారణంగా కానిస్టేబుల్​ రుద్రయ తనను అసభ్య పదజాలంతో దూషించడం వల్లే ఆత్మహత్యా ప్రయత్నం చేసినట్లు తెలిపారు. ఉన్నతాధికారులు విచారణ జరిపించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ఇదిలాఉంటే ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యకు స్టేషన్​ సిబ్బంది వ్యవహార శైలే కారణమని తేలగా, ఇప్పుడు ఈ ఘటనతో మహబూబాబాద్​ జిల్లాలో కలకలం మొదలైంది. కాగా పోలీస్​ ఉన్నతాధికారులు తగిన చర్యలు చేపట్టి, సిబ్బంది పని తీరులో మార్పు తీసుకు రావాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Whats_app_banner

సంబంధిత కథనం