Mahabubabad News : అమెరికాలో ఉన్న రైతుకు ఆరు బస్తాల విత్తనాలు-వ్యవసాయ అధికారుల అక్రమ దందా!-mahabubabad four agriculture officials suspended seeds selling at high to ap ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mahabubabad News : అమెరికాలో ఉన్న రైతుకు ఆరు బస్తాల విత్తనాలు-వ్యవసాయ అధికారుల అక్రమ దందా!

Mahabubabad News : అమెరికాలో ఉన్న రైతుకు ఆరు బస్తాల విత్తనాలు-వ్యవసాయ అధికారుల అక్రమ దందా!

HT Telugu Desk HT Telugu
Jun 08, 2024 06:19 PM IST

Mahabubabad News : వ్యవసాయ అధికారులే అక్రమ దందాకు తెరలేపారు. రైతులకు పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేసినట్లు రికార్డుల్లో రాసి ఏపీలో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఈ ఘటనలో నలుగురు వ్యవసాయ అధికారులపై వేటు పడింది.

అమెరికాలో ఉన్న రైతుకు ఆరు బస్తాల విత్తనాలు-వ్యవసాయ అధికారుల అక్రమ దందా!
అమెరికాలో ఉన్న రైతుకు ఆరు బస్తాల విత్తనాలు-వ్యవసాయ అధికారుల అక్రమ దందా!

Mahabubabad News : మహబూబాబాద్ జిల్లాలో వ్యవసాయ అధికారులే పచ్చిరొట్ట విత్తనాలతో దందాకు తెరలేపారు. జిల్లా రైతులకు చేరాల్సిన విత్తనాలను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. దీంతో స్థానిక రైతులకు విత్తనాలు అందక ఇబ్బందులు ఎదురవుతుండగా, సదరు అక్రమ దందాపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో విచారణ జరిపించిన పెద్దాఫీసర్లు మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన వ్యవసాయ అధికారులపై వేటు వేశారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమ దందాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో మండల వ్యవసాయ అధికారిగా కె.సోమ కుమార్ యాదవ్ పని చేస్తున్నాడు. ఆయన కింద తొర్రూరు క్లస్టర్ గ్రేడ్ 2 వ్యవసాయ విస్తరణ అధికారిగా ఎం.జమున, అమ్మాపురం క్లస్టర్ ఏఈవోగా అజ్మీరా దీపిక, హరిపిరాల ఏఈవోగా సీహెచ్.అరవింద్ పనిచేస్తున్నాడు. ఇంతవవరకు బాగానే ఉండగా, రైతులకు అందించేందుకు మండలానికి వచ్చిన జీలుగ తదితర పచ్చిరొట్ట విత్తనాలతో దందాకు తెరలేపారు. విత్తనాలను ఎక్కువ ధరతో ఏపీకి తరలించడం స్టార్ట్ చేశారు.

రైతుల పేరున రికార్డులు

రైతులకు రావాల్సిన విత్తనాలను అక్రమంగా తరలించడంతో పాటు రైతులకు పంపిణీ చేసినట్టుగా రికార్డులు సృష్టించడం మొదలుపెట్టారు. ఇలా తొర్రూరు మండలం జమస్తాన్పురం గ్రామానికి చెందిన ఓ రైతు అమెరికాలో స్థిరపడగా, ఆయన పేరున ఆరు బస్తాల జీలుగ విత్తనాలు పంపిణీ చేసినట్లు రికార్డులు తయారు చేశారు. వాస్తవానికి ఆయన పట్టాదారు పాస్ బుక్ కూడా బ్యాంక్ లాకర్ లో ఉండగా, ఆయన పేరున విత్తనాలు పంపిణీ కావడం గమనార్హం. అంతేగాకుండా గుర్తూరు గ్రామానికి చెందిన మరో రైతు పేరున 2 బస్తాలు, ఖానాపురం రైతుకు మూడు బ్యాగులు ఇచ్చినట్లు రాసుకున్నారు. వాస్తవానికి వారెవరికీ విత్తనాలు అవసరం లేకున్నా, విత్తనాలు పంపిణీ చేసినట్టు రికార్డుల్లో రాశారు. అంతేగాకుండా గ్రానైట్ క్వారీలు, మామిడి తోటలు ఉన్న స్థలాలలకు కూడా రైతుల విత్తనాలు ఇచ్చినట్టు రికార్డులు సృష్టించారు.

విచారణ జరిపి.. నలుగురి సస్పెండ్

వ్యవసాయ అధికారులు జీలుగ విత్తనాలు ఇతర ప్రాంతాలకు తరలిస్తుండటంతో ఇక్కడి అసలైన రైతులకు విత్తనాలు అందని పరిస్థితి నెలకొంది. దీంతోనే రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే కొంతమంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా విషయం కాస్త బయటపడింది. విషయం రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి కూడా వెళ్లింది. ఈ మేరకు విచారణ జరిపించాల్సిందిగా వ్యవసాయ శాఖ కమిషనర్ డా.గోపి జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేయగా, మరిపెడ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. ఈ మేరకు తొర్రూరు మండలంలో జీలుగ విత్తనాల పంపిణీలు అవకతవకలు జరిగినట్లు తేల్చారు. అంతేగాకుండా తొర్రూరు మండల వ్యవసాయాధికారి కె.సోమకుమార్ యాదవ్ తన పోర్టల్ లాగిన్ ఐడీని నిబంధనలకు విరుద్ధంగా ముగ్గురు ఏఈవోలకు ఇవ్వడంతో పాటు విత్తనాలను దుర్వినియోగం చేసినట్టు నిర్ధారించారు. విత్తనాలను బ్లాక్ మార్కెట్ తరలించినట్లు తేల్చారు. దాని ప్రకారమే ఉన్నతాధికారులకు నివేదిక కూడా సమర్పించారు. దీంతో తొర్రూరు ఏవో తో పాటు ముగ్గురు ఏఈవోలను సస్పెండ్ చేస్తూ వ్యవసాయ కమిషనర్ బి.గోపి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వ్యవసాయ శాఖలోని అధికారుల్లో కలవరం మొదలైంది.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Whats_app_banner

సంబంధిత కథనం