తెలంగాణలో వృద్ధుల కోసం విలాసవంతమైన వృద్ధాశ్రమం రూపొందుతోంది. ఇది సౌకర్యవంతమైన జీవనశైలిని కోరుకునేవారికి అనువైనదిగా ఉంటుంది. నిర్మల్ జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో బైంసా సమీపంలోని చాతా గ్రామంలో అర్చనా ఎల్డర్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. 30 ఎకరాల విస్తీర్ణంలో అత్యున్నత ప్రమాణాలతో నిర్మితమవుతోంది. ఈ ఆశ్రమం హెలిప్యాడ్ సౌకర్యంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సంస్థ సీఈఓ బద్దం భోజరెడ్డి ఈ వివరాలను వెల్లడించారు.
'వృద్ధులకు దూర ప్రయాణాలు కష్టం. అత్యవసర వైద్య అవసరాల కోసం లేదా విదేశాల్లో ఉన్న పిల్లలు తమ తల్లిదండ్రులను త్వరగా కలవడానికి వీలుగా మూడు ఎకరాల్లో హెలిప్యాడ్ నిర్మిస్తున్నాం. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో 40 నిమిషాల్లో ఇక్కడికి చేరుకోవచ్చు.' అని భోజరెడ్డి తెలిపారు.
ఈ ఆశ్రమంలో 108 గదులు నిర్మిస్తున్నారు. వీటిని గంగా, యమున, గోదావరి అనే మూడు క్లస్టర్‌లుగా విభజించారు. ప్రతి గదిలో ఇద్దరు సౌకర్యంగా ఉండవచ్చు. అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి. అన్నీ గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉంటాయి. నెలవారీగా ఇక్కడ చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో చేరే సమయంలో రూ.5 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. రూ.1 లక్ష నాన్-రిఫండబుల్, మిగిలిన రూ.4 లక్షలు తిరిగి చెల్లిస్తారు. ఈ ఆశ్రమం అక్టోబర్ 2, 2025న ప్రారంభం కానుంది.
వైద్య సేవల కోసం అలోపతి, ఆయుర్వేదం, హోమియోపతి క్లినిక్‌లు, ఐసీయూ సదుపాయంతో అంబులెన్స్, ప్రతి నివాసికి బీపీ, షుగర్, ఈసీజీ, జీపీఎస్‌తో కూడిన రింగ్ డివైస్ అందుబాటులో ఉంటాయి. ప్రతి గదికి కేర్‌టేకర్, నర్సులు కూడా ఉంటారని భోజరెడ్డి చెప్పారు. నాణ్యమైన భోజనం, బ్యాటరీ కార్లతోపాటుగా మరెన్నో సౌకర్యాలు ఉంటాయి. బుకింగ్‌లు త్వరలో ప్రారంభమవుతాయన్నారు.