Ponguleti On LRS : అక్రమ లేఅవుట్ల రెగ్యులరైజేషన్ స్కీమ్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎల్ఆర్ఎస్ ఆశించిన స్పందన ఉందన్నారు. అయితే ఇప్పటికైతే ఎల్ఆర్ఎస్ గడువు పెంచే ఆలోచన లేదన్నారు. అక్రమ లేఅవుట్ల రిజిస్ట్రేషన్ చేసిన సబ్‌రిజిస్ట్రార్లు సస్పెండ్ అవుతున్నారన్నారు. ప్రజలెవ్వరూ ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఎల్‌ఆర్‌ఎస్ అమలు చేస్తున్నామన్నారు. భూముల రిజిస్ట్రేషన్‌కు సర్వే మ్యాప్ తప్పనిసరి అని మంత్రి పొంగులేటి తెలిపారు. భూమికి మ్యాప్ లేని వాళ్లకు కూడా సర్వే చేయించి నిర్థారిస్తామన్నారు. భూభారతి అమల్లోకి వచ్చాక రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెరుగుతాయన్న మంత్రి... దాదాపు వెయ్యి మంది సర్వేయర్లను కొత్తగా నియమిస్తామని పేర్కొన్నారు.
"ప్రతి మండలానికి ఒక సర్వేయర్ డిప్యూటీ సర్వేయర్ లు ఉండేలా ప్లాన్ చేస్తున్నాం. భూమి సర్వే కావాలంటే అమ్మకం, కొనుగోలుదారు రిక్వెస్ట్ మేరకే జరుగుతుంది. అది చట్టంలో ఉంది. ప్రభుత్వం ప్రత్యేకంగా భూ సర్వే ఏమీ చేయదు. పొజిషన్ లో ఉన్న భూమి, రికార్డులకు చాలా తేడా ఉంది. 10,956 వీఆర్ఓ పోస్టులకు మంజూరు ఇచ్చాం. ఆల్రెడీ ఉన్న వీఆర్వో, వీఆర్ఏ లకు ఇంటర్ విద్యార్హతగా పెట్టాం. ఎల్ఆర్ఎస్ పొడిగించాలన్న ఆలోచన ఇప్పటివరకు లేదు. ఎల్ఆర్ఎస్ పేమెంట్ అయ్యాక సింగల్ కేసు కూడా మిస్ అవ్వదు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎల్ఆర్ఎస్ క్రమబద్దీకరణ కు ధ్రువీకరణ పత్రం ఇస్తుంది. గతంలో లేఔట్ లో 10శాతం రిజిస్ట్రేషన్ అయ్యితే మిగిలినవి ఎల్ఆర్ఎస్ అవుతాయి"- మంత్రి పొంగులేటి
"భూభారతి అమలులోకి తెచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెరుగుతాయి. ఎల్ఆర్ఎస్ స్కీమ్ మార్చి 31 వరకు గడువు ఉంది. ఆ లోగా చేసిన వారికి 25 శాతం డిస్కౌంట్ ఇస్తున్నాం. ఎల్ఆర్ఎస్ ఇప్పుడు కాకుండా ఇళ్లు కట్టేటప్పుడు పర్మిషన్ కావాలన్నప్పుడు 100 శాతం ఎల్ఆర్ఎస్ కట్టాల్సి ఉంటుంది. త్వరలో భూ వ్యాల్యు పెంచబోతున్నాం. భూసర్వే కోసం ప్రతీ మండలానికి సర్వేయర్, డిప్యూటీ సర్వేయర్ ను నియమిస్తాం. అలాగే లైసెన్డ్ సర్వేయర్ లకు అవకాశం ఇస్తాం" - మంత్రి పొంగులేటి
"నాకు, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మధ్య ఎలాంటి సమస్య లేదు. నాకు ఏ ఎమ్మెల్యేతో సమస్య లేదు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చెబుతున్న అభిమన్యు రెడ్డి అనే వ్యక్తి ఎవరో నాకు తెల్వదు. సాదాబైనామల విషయంలో కొత్త దరఖాస్తు లను స్వీకరించం. పాత దరఖాస్తులలో 13 లక్షల దరఖాస్తులను గత ప్రభుత్వం రిజక్ట్ చేసింది. రిజెక్ట్ చేసిన వారికి అపిలేట్ అథారిటీలో అప్పిల్ చేసుకోవచ్చు. కేంద్రం ప్రధానమంత్రి అవాస్ యోజన కింద అర్బన్ ఏరియాలో 1 లక్ష 13 వేల ఇళ్లను మంజూరు చేసింది. అర్బన్ ఏరియాలో కట్టే ఇళ్లకు కేంద్రం 1.50 లక్షలు మాత్రమే ఇస్తుంది. మిగతాది రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. రూరల్ ఏరియాకు సంబంధించి కేంద్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు" - మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
సంబంధిత కథనం