ఎల్ఆర్ఎస్ (ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ) దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం మరో అప్డేట్ ఇచ్చింది. మే 3వ తేదీతో గడువు ముగిసిన నేపథ్యంలో…. మరోసారి గడువు పొడిగించింది. మే 31వ తేదీ వరకు దరఖాస్తుదారులు ఫీజులు చెల్లించి… 25 శాతం రాయితీని పొందవచ్చని తెలిపింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులను జారీ చేసింది.
ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో మే 31వ తేదీలోపు ఫీజు చెల్లించిన వారికి మాత్రమే 25 శాతం రాయితీ అవకాశం ఉంటుంది. ఈ గడువు ముగిసిన తర్వాత అలాంటి అవకాశం ఉండదు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం గడువు పొడిగించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర పురపాలక శాఖ జారీ చేసిన జీవో 28 ప్రకారం… ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు, ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లిస్తే 25 శాతం రాయితీ పొందవచ్చు.
ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా అనధికార లే అవుట్లను క్రమబద్ధీకరిస్తున్నారు. ఇప్పటికే పరిశీలించిన దరఖాస్తులను క్లియర్ చేశారు. అర్హత ఉన్న వారికి ప్రోసిడింగ్స్ కాపీలను కూడా అందజేస్తున్నారు .ఎల్ 1, ఎల్2, ఎల్ 3 దశల్లో పరిశీలన పూర్తి అయిన వాటికి మాత్రమే ప్రోసిడింగ్ కాపీలను ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని దరఖాస్తులకు పరిష్కారం చూపారు. త్వరలోనే మిగతా ఫీజులు చెల్లించిన దరఖాస్తులను పరిష్కరించనున్నారు. సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు వస్తుండగా… వాటిని కూడా అధిగమిస్తూ ముందుకెళ్లే పనిలో ప్రభుత్వం ఉంది.
నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను తీసుకువచ్చింది. ఇందుకోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఈ స్కీమ్ లో భాగంగా…అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించారు. 25 లక్షలకుపైగా అప్లికేషన్లు వచ్చాయి. గతేడాది నాటికి పది లక్షలోపు దరఖాస్తులు మాత్రమే పరిష్కరించారు. స్కీమ్ లో వేగం పెంచేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో 25 శాతం రాయితీతో కూడిన ఓటీఎస్ ను ప్రభుత్వం ప్రకటించింది.
వాస్తవానికి ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపు గడువు మార్చి చివరి నాటికే ముగియగా… ఏప్రిల్ 30 వరకు పొడిగించింది. ఈ సమయం కూడా ముగియటంతో మళ్లీ మే 3వ వరకు ఛాన్స్ ఇచ్చింది. అయితే ప్రభుత్వం అంచనా వేసిన స్థాయిలో స్పందన లేకపోవటంతో… మరోసారి దరఖాస్తుదారులకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఫలితంగా ఈనెలాఖరు వరకు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు రాయితీతో కూడిన ఫీజు చెల్లించి… క్రమబద్ధీకరించుకునే అవకాశం ఉంది.
ఎల్ఆర్ఎస్ చెల్లించుకోవటం ద్వారా దరఖాస్తుదారుడికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. కొనుగోలు చేసిన స్థలంలో ఇల్లు కట్టుకోవాలంటే కచ్చితంగా ఎల్‌ఆర్‌ఎస్ చేసుకోవాల్సిందే. తద్వారా సులభంగా ఇంటి అనుమతులు అందుతాయి. లే ఔట్ నిబంధనలు పాటించని ప్లాట్లలో ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వరు. దీంతో మౌలిక వసతులు కూడా అందవు. కాబట్టి ఎల్ఆర్ఎస్ పూర్తి చేసుకోవటం ద్వారా ఈ ప్రయోజనాలు పొందవచ్చు.
ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లిస్తే 25 శాతం వరకు రాయితీ పొందే వీలు ఉంటుంది. గడువు దాటితే ఈ అవకాశం ఉండదు. ఫ్లాట్ పై ఏమైనా రుణాలు తీసుకోవటం లేదా ఇతర విషయాల్లో ఎల్ఆర్ఎస్ ధ్రువపత్రాలు కీలకంగా మారుతాయి. 2020 నాటికి కొనుగోలు చేసిన ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు మాత్రమే ప్రభుత్వం 25శాతం రాయితీ వర్తింపజేస్తోంది. మిగతా వాటికి ఈ నిర్ణయం వర్తించదు.
సంబంధిత కథనం