LRS Application Status : ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ నెంబర్ మరిచిపోయారా..? సింపుల్ గా ఇలా వివరాలు తెలుసుకోవచ్చు..!
Layout Regularization Scheme: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. మూడు నెలల్లోనే దరఖాస్తులను పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో సర్కార్ ఉంది. అయితే ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ నెంబర్ తో పాటు స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇక్కడ చూడండి…
ఎల్ఆర్ఎస్ (లే అవుట్ల క్రమబద్ధీకరణ) దరఖాస్తులను పరిష్కరించటంపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. మూడు నెలల్లోనే ఈ దరఖాస్తులను క్లియర్ చేయాలనే ఉద్దేశ్యంతో సర్కార్ ఉంది. ఇదే విషయంపై అధికారులకు ఆదేశాలు కూడా అందాయి.
సాధ్యమైనంత త్వరగా దరఖాస్తులను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 75 శాతం దరఖాస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు లేనట్లు తేలటంతో… ఇటీవలే దరఖాస్తుదారులకు మరో అవకాశం కూడా కల్పించింది. కావాల్సిన పత్రాలను ఆన్ లైన్ లోనే సమర్పించేలా.. సవరణకు ఛాన్స్ ఇచ్చింది. వెబ్ సైట్ లో సిటిజన్ లాగిన్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.
2020లో ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను తీసుకొచ్చారు. ఇందుకోసం గ్రామాలు, పట్టణాల్లో భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఈ స్కీమ్ లో భాగంగా…అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించారు. ఈ ప్రక్రియపై తీవ్రస్థాయిలో విమర్శలు రాగా… గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. ఆ తర్వాత ఎల్ఆర్ఎస్ విషయంలో పెద్దగా ముందుకు వెళ్లలేదు. అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ…ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై ఫోకస్ పెట్టింది. సాధ్యమైనంత త్వరగా వీటిని పరిష్కరించాలని యోచిస్తోంది.
ఎల్ఆర్ఎస్ నెంబర్ ఇలా తెలుసుకోండి..!
2020 ఏడాదిలో చాలా మంది తమ ప్లాట్లకు సంబంధించి ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారు. రూ. 1000 ఫీజును కూడా చెల్లించారు. ప్రస్తుతం ఈ దరఖాస్తులను పరిష్కరించే దిశగా అడుగులు పడుతున్న క్రమంలో… చాలా మందికి ఎల్ఆర్ఎస్ నెంబర్ తెలియటం లేదు. ఇందుకు సంబంధించిన పత్రాలు కూడా దొరకటం లేదని చెబుతున్నారు. అయితే ఎల్ఆర్ఎస్ నెంబర్ ను సింపుల్ గా తెలుసుకునే అవకాశం ఉంది. ఇందుకు కేవలం దరఖాస్తు చేసుకున్న సమయంలో ఫోన్ నెంబర్ ఉంటే సరిపోతుంది.
- ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లు https://lrs.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- ఇక్కడ ఆఫీసియల్ లాగిన్, సిటిజన్ లాగిన్ కనిపిస్తుంది.
- సిటిజన్ లాగిన్ పై నొక్కాలి.
- ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ను నమోదు చేయాలి. మీకు ఓటీపీ వస్తుంది.ఆ నెంబరును ఎంట్రీ చేయాలి.
- వెరిఫైయిడ్ ఓటీపీపై క్లిక్ చేస్తే మీకు హోం పేజీ ఓపెన్ అవుతుంది.
- ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అనే ఆప్షన్ పై కనిపిస్తుంది.
- దీనిపై నొక్కితే ఇక్కడ మీ అప్లికేషన్ నెంబర్ కనిపిస్తుంది. మీ వివరాలు కూడా డిస్ ప్లే అవుతాయి.
- మీ దరఖాస్తు యొక్క స్థితి(స్టేటస్) కూడా తెలుస్తుంది.
- పేమెంట్ చేసిన వివరాలను కూడా ప్రింట్ తీసుకునే అవకాశం ఉంటుంది.
అప్ లోడ్ చేసేందుకు మరోసారి ఛాన్స్…!
దరఖాస్తు చేసుకున్న సమయంలో చాలా మంది ధ్రువపత్రాల వివరాలను ఇవ్వలేదు. దీంతో చాలా అప్లికేషన్లపై సందిగ్ఘత నెలకొంది. దీంతో సంబంధిత పత్రాలను అప్ లోడ్ చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.
సిటిజిన్ లాగిన్ లోకి వెళ్లి… సేల్ డీడ్, ఈసీ, మార్కెట్ విలువ ధ్రువీకరణ పత్రం, లేఅవుట్ కాపీ వంటి డాక్యుమెంట్లను దరఖాస్తులను అప్ లోడ్ చేసుకోవచ్చు. మరోవైపు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల్లో ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకునేందుకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగరాభివృద్ధి సంస్థలు, జిల్లా కలెక్టరేట్లలో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు సర్కార్ పేర్కొంది.
దరఖాస్తుదారులు https://lrs.telangana.gov.in/layouts/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ ను పూర్తి చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ అప్లికేషన్స్ అప్ లోడ్ ఆప్షన్ పై నొక్కి…. మీ ప్లాట్ కు సంబంధించిన పత్రాలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. సేల్ డీడ్, ఈసీ, మార్కెట్ విలువ నిర్ధారిత పత్రం, లేఅవుట్ కాపీ తదితర పత్రాలను అప్ లోడ్ చేసుకోవచ్చు. ఈ డాక్యుమెంట్స్ 5 ఎంబీలోపే ఉండాలి. ధ్రువపత్రాలను అప్ లోడ్ చేయటం ద్వారా ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సర్కార్ భావిస్తోంది.