LRS Telangana : అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణ(LRS) అప్లికేషన్లను పరిష్కరించేందుకు హెచ్ఎండీఏ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జోనల్ కార్యాలయాల్లో దరఖాస్తుదారుల కోసం సహాయ కేంద్రాలను ఏర్పాటుచేసింది. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులపై సందేహాల నివృత్తి చేసేందుకు హెచ్‌ఎండీఏ వద్ద కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఎల్ఆర్ఎస్ పై సందేహాలుంటే టోల్ ఫ్రీ నెంబర్ 1800 599 8838కి కాల్ చేయవచ్చని సూచించారు. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ లో అర్హత ఉన్న దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించారు. మార్చి 31లోపు క్రమబద్ధీకరణ రుసుము చెల్లించే వారికి 25శాతం రాయితీ ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇప్పటికే ప్రకటించారు.
ప్లాట్ యజమానుల సౌకర్యం కోసం LRS 2020 వెబ్‌సైట్ https://lrs.telangana.gov.in/ ను ప్రారంభించారు. లాగిన్ అవ్వాల్సిన అవసరం లేకుండానే ప్రజలు తమ అప్లికేషన్ ను యాక్సెస్ చేయడానికి ఈ వెబ్‌సైట్ వివిధ రకాల సేవలు అందించారు.
లేఅవుట్ల రెగ్యులరైజేషన్ ఛార్జీలు, ప్రో-రేటా ఓపెన్ స్పేస్ ఛార్జీలపై 25% తగ్గింపు పొందేందుకు అర్హత కలిగిన ప్లాట్ యజమానులు మార్చి 31,2025 లోపు దరఖాస్తు రుసుము చెల్లించాలి. చెల్లింపులు పూర్తైన అప్లికేషన్లను 10 రోజుల్లోపు ప్రాసెస్ చేస్తామని హెచ్ఎండీఏ ప్రకటించింది.
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల అనధికార లేఅవుట్లలో నమోదు చేయని ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకునేందుకు అనుమతిస్తూ నిబంధనలను సవరించింది. ఆగస్టు 26, 2020కి ముందు కనీసం 10% ప్లాట్లను రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా విక్రయించిన వారికి ఇది సవరణ వర్తిస్తుంది. యజమానులు LRS 2020 కింద దరఖాస్తు చేసుకున్నారా? లేదా? అనే దానితో సంబంధం లేకుండా దీనిని వర్తింపజేస్తున్నారు. ఎల్ఆర్ఎస్ 2020 దరఖాస్తులు తిరస్కరణకు గురైన వారికి హెచ్ఎండీఏకు చెల్లించిన మొత్తంలో 90% తిరిగి చెల్లిస్తారు. ప్రాసెసింగ్ ఛార్జీల కోసం 10% తగ్గిస్తారు.
చెరువులు/లేక్ ల నుంచి 200 మీటర్ల లోపు ఉన్న ప్లాట్ల దరఖాస్తులను రెవెన్యూ, నీటిపారుదల శాఖ ప్రాసెస్ చేస్తుంది. సరస్సులు లేదా నీటి వనరులతో సహా నిషేధిత ప్రాంతాలలో లేని ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ రుసుమును మార్చి 31 లోపు చెల్లిస్తే దరఖాస్తుదారులు 25% రాయితీని పొందేందుకు వీలుకల్పించారు.
భవన నిర్మాణ అనుమతి సమయంలో దరఖాస్తుదారులు ప్రో-రేటా ఓపెన్ స్పేస్ ఛార్జీల చెల్లింపు ఎంచుకోవచ్చు. ఈ సందర్భాల్లో రాయితీని పొందలేరు.
సంబంధిత కథనం