Hyderabad Rains : హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం-low lying areas are waterlogged due to heavy rain in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Rains : హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

Hyderabad Rains : హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

Hyderabad Rains : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. దీని కారణంగా అటు ఏపీలో.. ఇటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది.

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం (@HYDTP)

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా.. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉప్పల్‌, రామంతాపూర్‌, బోడుప్పల్‌లో వర్షం కురుస్తోంది. మేడిపల్లి, తార్నాక,సికింద్రాబాద్, అబిడ్స్‌, ఛార్మినార్‌, ఖైరతాబాద్‌, ట్యాంక్‌బండ్‌ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

హైదరాబాద్‌లో వాతావరణం మేఘావృతమై ఉంది. సోమవారం కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కూకట్‌పల్లి, హైదర్‌ నగర్‌, ప్రగతినగర్‌, ఆల్విన్‌ కాలనీ, పటాన్‌ చెరు, తాండూరు, బహదూర్‌పల్లి, సూరారం, గుండ్ల పోచంపల్లి ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంలోని కొన్ని చోట్ల ట్రాఫిక్‌ జామ్ అయ్యింది.

తెలంగాణలో రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని.. వాతావరణ శాఖ ప్రకటించింది. మంగళవారం ఆదిలాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌, ఖమ్మం, నిజామాబాద్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, ములుగు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది.

తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మంగళ, బుధవారాల్లో ఉమ్మడి నిజామాబాద్‌, నల్గొండ, ఖమ్మం, వరంగల్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడింది. తీవ్ర అల్పపీడనంగా కేంద్రీకృతం అయ్యింది. పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతున్న తీవ్ర అల్పపీడనం.. 2 రోజుల్లో వాయుగుండంగా బలపడనుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దక్షిణ కోస్తా, తమిళనాడు, పుదుచ్చేరి వైపు పయనిస్తోంది. ఈనెల 17 వరకు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.

మంగళ, బుధ వారాల్లో కోస్తా, రాయలసీమలో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏపీలో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. పలుచోట్ల అతి తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరప్రాంతంలో గంటకు 55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు.