ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. ప్రియుడి మృతి.. యువతి పరిస్థితి విషమం-love turns tragic boyfriend dies after suicide attempt ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. ప్రియుడి మృతి.. యువతి పరిస్థితి విషమం

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. ప్రియుడి మృతి.. యువతి పరిస్థితి విషమం

HT Telugu Desk HT Telugu
Jun 25, 2024 09:36 AM IST

ప్రేమించుకున్నారు.. పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే అమ్మాయి పేరెంట్స్ ప్రేమ పెళ్ళికి అంగీకరించకపోవడంతో కరీంనగర్‌లో ఇద్దరు కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ప్రియుడు ప్రాణాలు కోల్పోగా ప్రియురాలు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. ప్రియుడి మృతి
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. ప్రియుడి మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెంకు చెందిన పెంటం చందు (24) అదే గ్రామానికి చెందిన వ్యక్తి వద్ద ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. డిగ్రీ చదివే ట్రాక్టర్ ఓనర్ కూతురు, చందు ప్రేమలో పడ్డారు. అయితే వారి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. ప్రేమ పెళ్ళికి పెద్దలు నిరాకరించడంతో కరీంనగర్ లో డిగ్రీ చదువుతున్న సదరు యువతి, చందును కరీంనగర్ కు పిలిపించుకుని ఇద్దరు కలిసి పురుగు మందు తాగారు. 

అపస్మా రకస్థితిలో ఉన్న వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చందు మృతిచెందాడు. యువతి పరిస్థితి విషమంగా ఉంది. చందు పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోవడంతో నానమ్మ ఎల్లవ్వ కూలి పనులు చేసి పెంచింది. వృద్ధాప్యంలో ఆసరాగా నిలుస్తాడనుకున్న మనువడి మృతితో ఎల్లవ్వ అనాథగా మారి బోరున విలపించారు.

ఇంటర్ ఫెయిల్ విద్యార్థిని ఆత్మహత్య

ఇంటర్ ఫలితాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇద్దరు విద్యార్ధుల ప్రాణాలను బలిగొన్నాయి. ఇంటర్ సెకండియర్‌లో ఫెయిల్ కావడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన తోకల సాక్షి అలియాస్ ఉరఫ్ సోని (17) ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తంగళ్ళపల్లికి చెందిన తోకల రవి- లక్ష్మి దంపతులకు కొడుకు సిద్ధార్థ, కూతురు సాక్షి సంతానం. రవి బీడీ కంపెనీ నడిపిస్తుండగా లక్ష్మి ప్రైవేటు టీచర్ గా పనిచేస్తున్నారు. కూతురు సోని మండేపల్లి మోడల్ స్కూల్లో ఇంటర్మీడియెట్ చదివింది. సెకండియర్ గణితంలో ఫెయిల్ కావడంతో ఇటీవల సప్లిమెంటరీ పరీక్ష రాసింది. అయితే సోమవారం వెలువడిన ఫలితాల్లోను ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం గండ్రపల్లి కి చెందిన శ్యామల వైష్ణవి(17) ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఇటీవల వెలువడిన ఇంటర్ ఫలితాల్లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయింది. దీంతో మనస్తాపానికి గురై ఈనెల 2న పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి హనుమకొండలోని ప్రైవేటు ఆసుపత్రికి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు.

నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సంతోష్ నగర్ కు చెందిన నర్సింగ్ విద్యార్థిని బానోత్ అక్షయ (19) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాలేజీకి పంపించడం లేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సింగరేణిలో ప్రైవేట్ ఓల్వో డ్రైవర్ గా పనిచేస్తున్న బానోత్ రాజేశం- అమృతలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. 

చిన్నకుమార్తె అక్షయ కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలో సెకండియర్ చదువుతోంది. పరీక్షలు ముగిశాక మూడు నెలల క్రితం వేసవి సెలవుల కోసం ఇంటికి వచ్చిన అమ్మాయి సెలవులు ముగిశాయయని, కాలేజీకి వెళ్తానని తన తండ్రికి చెప్పింది. తనకు వేతనం ఇంకా రాలేదని, వచ్చిన తర్వాత కాలేజీ ఫీజు చెల్లించి పంపిస్తానని తండ్రి చెప్పాడు. 

తనను కాలేజీకి పంపించడం లేదనే మనస్తాపంతో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్నవిషయానికే అలిగిన తమ కుమార్తె చనిపోతుందని తాము ఉహించలేదని తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు

- HT Telugu ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ కె.వి.రెడ్డి.

WhatsApp channel