Lesbian love: యువతుల ప్రేమే.. ప్రాణాలు తీసింది..?-love and live in relationship finally young woman who murdered her friend ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Love And Live In Relationship Finally Young Woman Who Murdered Her Friend

Lesbian love: యువతుల ప్రేమే.. ప్రాణాలు తీసింది..?

HT Telugu Desk HT Telugu
Mar 17, 2023 07:47 AM IST

Lesbian love: ఇద్దరు యువతుల మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. చివరికి ఇద్దరు కలిసి ఒకే చోట సహజీవనం చేశారు. వారిలో ఒక యువతి మరో వ్యక్తికి దగ్గరవుతుందనే అనుమానంతో, స్నేహితురాలు ఆమెను హత్య చేసింది.

మంచిర్యాలలో స్నేహితురాలిని హత్య చేసిన మహేశ్వరి, హతురాలు అంజలి
మంచిర్యాలలో స్నేహితురాలిని హత్య చేసిన మహేశ్వరి, హతురాలు అంజలి

Lesbian love: యువతుల మధ్య ఏర్పడిన స్నేహం కలిసి సహ జీవనం చేసే వరకు వరకు వెళ్లింది.తర్వాత ఒకరు దూరమవుతున్నారనే అక్కసుతో మరొకరు హత్యకు పాల్పడ్డారు.ఓ యువతిలో ఏర్పడిన అసూయచివరకు హత్యకు దారితీసింది.తనను దూరం పెట్టి మరొకరితో సన్నిహితంగా ఉంటోందనూ కోపంతో ఒక యువతి తన స్నేహితురాలిని హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం మామిడిగట్టుకు చెందిన సల్లూరి అంజలి, నెన్నెల మండలం మన్నెగూడంలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లి వస్తుండేది.ఈ క్రమంలో మన్నెగూడెం గ్రామానికి చెందిన పెరుగు మహేశ్వరి అలియాస్‌ మహేష్‌తో అంజలికి పరిచయం ఏర్పడింది.రెండేళ్ల క్రితం మంచిర్యాలలో అద్దెకు గది తీసుకుని మహేశ్వరి,ఆమె చెల్లి పరమేశ్వరి,సోదరుడు విఘ్నేష్‌తో పాటు అంజలి కలిసి ఉంటున్నారు.

అంజలి స్థానికంగా ఉన్న కళ్లద్దాల దుకాణంలో పనిచేస్తోంది.మహేశ్వరి ఓ పెట్రోల్‌ బంకులో పనిచేసి ఇటీవల మానేసింది.మన్నెగూడ గ్రామంలో వీఆర్‌ఏగా పనిచేస్తున్న మొండికి ఉన్న అయిదుగురు ఆడపిల్లల్లో మహేశ్వరి నాలుగో కుమార్తె.గత పదేళ్లుగా ఆమె వస్త్రధారణ,ప్రవర్తన అబ్బాయిలా మారుతోందని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే మహేశ్వరి,అంజలి సహజీవనం చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.

మహేశ్వరికి దూరంగా ఉంటున్న అంజలి....

మంచిర్యాలలో కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న శ్రీనివాస్‌తో ఇటీవల మహేశ్వరికి పరిచయమైంది.తర్వాత ఆమె చెల్లెలు,సోదరుడు విఘ్నేష్,అంజలితో కూడా శ్రీనివాస్‌తో పరిచయం ఏర్పడింది.ఈ పరిచయంతో రెండు నెలల నుంచి అంజలి శ్రీనివాస్‌తో సన్నిహితంగా ఉంటోంది. అప్పట్నుంచి మహేశ్వరికి దూరంగా ఉంటోంది.

బుధవారం విధులు ముగించుకున్న అంజలి రాత్రి 8.15 గంటలకు గదికి వెళ్లింది. రాత్రి 10 గంటలకు మామిడిగట్టుకు వెళ్దామని మహేశ్వరి ద్విచక్ర వాహనంపై అంజలిని వెంటబెట్టుకుని వెళ్లింది.రాత్రి 11.30 గంటలకు శ్రీనివాస్‌కు మహేశ్వరి ఫోన్‌ చేసి అంజలి ఆత్మహత్య చేసుకుందని, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పింది. దీంతో శ్రీనివాస్ మహేశ్వరి సోదరి పరమేశ్వరితో కలిసి కారులో గుడిపల్లి గ్రామ శివారులో సంఘటన స్థలానికి చేరుకున్నారు.

అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న అంజలిని, స్వల్పంగా గాయపడిన మహేశ్వరిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఆస్పత్రికి తరలించే సమయానికే అంజలి మృతి చెందింది.అంజలి మెడపై లోతైన గాయం ఉండడంతో మహేశ్వరి ఆమెను హత్య చేసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. మహేశ్వరి పొట్ట,మెడపై చిన్నపాటి కత్తిగాట్లు ఉండడంతో, ఆత్మహత్యాయత్నం పేరిట ఆమె నమ్మించేందుకు ప్రయత్నించిందని భావిస్తున్నారు. అంజలి మృతికి కారకులను అరెస్టు చేయాలంటూ ఆమె కుటుంబసభ్యులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి వద్దఆందోళనకు దిగారు.ఈ ఘటనపై రామకృష్ణాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.మహేశ్వరి,శ్రీనివాస్‌లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

IPL_Entry_Point