Singareni Jobs: ఇకపై వారంతా సింగరేణి ఉద్యోగాల్లో స్థానికులే…నాలుగు మండలాల నిరుద్యోగులకు తీపి కబురు
Singareni Jobs: కరీంనగర్ నుండి సిద్దిపేట జిల్లాలో కలిసిన నాలుగు మండల నిరుద్యోగులకు తీపి కబురు అందింది. సిద్ధిపేట యువతను ఇకపై సింగరేణిలో స్థానికులుగా పరిగణిస్తారు.
Singareni Jobs: సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ , అక్కన్నపేట్ , కొహెడ , బెజ్జంకి మండల వాసులను సింగరేణి ఉద్యోగాలకు స్థానికులుగా పరిగణించేందుకు సింగరేణి సిద్ధమైంది. ఈ మేరకు నిబంధనలను సడలించాలని సింగరేణి అధికారులను మంత్రి భట్టి విక్రమార్క Bhatti Vikramarka ఆదేశించారు. మంత్రి పొన్నం Ponnam Prabhakar చొరవతో నిరుద్యోగుల స్థానికత అంశంపై మరో మంత్రి భట్టి విక్రమార్క స్పష్టత ఇచ్చారు. ఉమ్మడి జిల్లాల స్థానికత ఇకపై వర్తింప చేయనున్నారు.
ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ పరిధిలో అదిలాబాద్, కరీంనగర్ , వరంగల్ , ఖమ్మం నాలుగు ఉమ్మడి జిల్లాలు సింగరేణి ఉద్యోగాలకు స్థానికతను Local Issue కలిగి ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
తెలంగాణాలో జిల్లాల పునర్విభజన లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న హుస్నాబాద్ , అక్కన్నపేట్ , కొహెడ , బెజ్జంకి లు నాలుగు మండలాలు సిద్దిపేట జిల్లాలో కలపడంతో అవి హైదరాబాద్ Hyderabad zone జోన్ లోకి వచ్చాయి. దీంతో ఆ జిల్లా వాసులు సింగరేణి ఉద్యోగాలకు స్థానికత కోల్పోయినట్టు చెప్పారు.
ఈ మండలాలకు సంబంధించిన పలువురు నిరుద్యోగులు మంత్రి పొన్నం ప్రభాకర్ ని కలిసి తమ సమస్యను మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. పాత కరీంనగర్ మండలాలను సిద్దిపేట లో కలపడం వల్ల సింగరేణి ఉద్యోగాలకు తాము అర్హత కోల్పోయామని వారు మంత్రి పొన్నం ప్రభాకర్‌తో వివరించారు.
భట్టి తో మాట్లాడిన పొన్నం...
స్థానికత అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ డిప్యూటీ సిఎం, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్ళారు. వెంటనే డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క సింగరేణి సిఎండితో మాట్లాడారు.
జిల్లాల పునర్విభజన సమయంలో సింగరేణి ఉద్యోగాల కోసం స్థానికత కోల్పోయిన మండలాలపై చర్చించారు.ఎవరికి అన్యాయం జరగకుండా చూడాలని సిఎండిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు.
సింగరేణి పరిధిలో ఉన్న పాత ఉమ్మడి నాలుగు జిల్లాలు అదిలాబాద్ , కరీంనగర్, వరంగల్, ఖమ్మం సింగరేణి పరిధిలోకి వస్తాయని ఆయ జిల్లాలో ఉన్న నిరుద్యోగులు సింగరేణి స్థానికత వస్తుందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క.. మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వివరించారు.
దీంతో కరీంనగర్ నుండి సిద్దిపేట జిల్లాలో కలిసిన నాలుగు మండలాలు అందులో హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన నాలుగు మండలాలైన హుస్నాబాద్ , అక్కన్నపెట్ , కొహెడ, బెజ్జంకి మండలాలకు న్యాయం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు.
ఇకపై సింగరేణి కాలరీస్ విడుదల చేసిన నోటిఫికేషన్ లో ఉమ్మడి నాలుగు జిల్లాల నిరుద్యోగులకు అర్హత ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వెంటనే సమస్య పరిష్కారానికి చొరవ చూపిన డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ధన్యవాదాలు తెలిపారు.
తమ సమస్య పైన వెంటనే స్పందించిన, మంత్రులు పొన్నం ప్రభాకర్ కు, భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు నాలుగు మండలాలకు చెందిన నిరుద్యోగులు వార్త తెలియగానే సంబరాలు చేసుకున్నారు.
(రిపోర్టింగ్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి, హిందుస్తాన్ టైమ్స్)