Kurumurthy Swamy Jatara : కురుమూర్తి స్వామి జాతరకు వెళ్తున్నారా.. అయితే వీరితో జాగ్రత్త!
Kurumurthy Swamy Jatara : కురుమూర్తి స్వామి జాతరకు భక్తులు వేలాదిగా తరలి వెళ్తున్నారు. జాతరలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. ఇదే అదునుగా కొందరు రెచ్చిపోతున్నారు. భక్తులను నిండా ముంచుతున్నారు. కట్టిడి చేయాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
శ్రీకురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కురుమూర్తి స్వామి జాతరకు భక్తుల తాకిడి భారీగా పెరుగుతోంది. దీంతో దేవస్థానం ప్రాంగణంలో వ్యాపారాలు నిర్వహించే వారు ధరలను అమాంతం పెంచేశారు. కొబ్బరికాయలు మొదలు.. దీపం సామగ్రి వరకు.. అన్నింటిని అధిక ధరలకు అమ్మి భక్తుల జేబులకు చిల్లులు పెడుతున్నారు.
ధరల్ని కట్టడి చేయాల్సిన ఆలయ పాలకమండలి సభ్యులు, అధికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని.. భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొబ్బరికాయల విక్రయానికి వేలం పాటలో ఓ వ్యాపారి రూ.54 లక్షలకు టెండర్ దక్కించుకున్నారు. నిబంధనల ప్రకారం ఒక్కో కొబ్బరికాయ, అగరబత్తీలను రూ.25కే విక్రయించాలి. ఇతరులు విక్రయించడానికి అనుమతి ఉండదు.
అయితే.. ఆ వ్యాపారి నిబంధనలను ఉల్లంఘించి తన దుకాణాన్ని మూసివేశాడు. అక్కడి చిరు వ్యాపారులతో ఒప్పందం చేసుకున్నాడు. వారితో విక్రయిస్తున్నారు. వారు ఒక్కో కొబ్బరికాయను రూ.35 చొప్పున రెండు రూ.70కి తప్పనిసరిగా కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. దీపం వెలిగించడానికి కావాల్సిన సామగ్రి విక్రయానికి సదరు వ్యాపారి రూ.13 లక్షలకు టెండర్‌ను దక్కించుకున్నారు. సామగ్రిని రూ.30 విక్రయించాలి. ఇతను భక్తుల నుంచి అదనంగా రూ.20 వసూలు చేసి రూ.50 విక్రయిస్తున్నారని భక్తులు చెబుతున్నారు.
ఇక కూల్‌డ్రింక్స్ విక్రయాలకు సంబంధించి వేలం పాటలో కాంట్రాక్టర్ రూ.16.50 లక్షలకు టెండర్ దక్కించుకున్నారు. ఎమ్మార్పీకే విక్రయించాలని నిబంధన. 200 మిల్లీలీటర్ల బాటిల్‌పై ఎమ్మార్పీ రూ.10 ఉండగా రూ.20 విక్రయిస్తున్నారు. 500 మిల్లీలీటర్ల బాటిల్‌పై ఎమ్మార్పీ రూ.20 ఉండగా 30 రూపాయలకు అమ్ముతున్నారు.
అధికారులు కొబ్బరికాయ, అగరబత్తులు రూ.25కే అని బోర్డు ఏర్పాటు చేసినా ఫలితం శూన్యం అని భక్తులు చెబుతున్నారు. దీపం సామగ్రిని రూ.50 విక్రయిస్తున్నారని వాపోతున్నారు. వ్యాపారులతో బేరం చేయలేక తప్పనిసరిగా కొనుగోలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నామని.. వారి దోపిడీని కట్టడి చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. కొబ్బరికాయ రూ.25, దీపం రూ.30, కూల్ డ్రింక్స్ ఎమ్మార్పీకే విక్రయించాలని స్పష్టం చేస్తున్నారు. నిబంధనలు ఉల్లఘించి అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.