TG Local Body Elections 2025 : స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్...! 10 ముఖ్యమైన విషయాలు
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం కానున్నాయి. కుల గణన సర్వే మరోసారి చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించటంతో.. మరికొన్ని రోజులపాటు ఎన్నికలు జరిగే అవకాశం లేదు. ఏప్రిల్ లేదా మే మాసంలో ఎలక్షన్లు జరిగే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్రంలో స్థానిక ఎన్నికల సమరానికి బ్రేకులు పడినట్లు అయింది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఎన్నికల సంఘం నుంచి అధికారికంగా ప్రకటన వస్తుందని అంతా భావించారు. ఈ ఫిబ్రవరి మాసంలోనే ఎన్నికల నిర్వహణ తప్పనిసరిగా ఉంటుందని అనుకున్నప్పటికీ… చివరి నిమిషంలో సీన్ మారిపోయింది. కుల గణనపై మరోసారి ప్రభుత్వం ప్రకటన చేయటంతో… ఎన్నికల ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది.
ఈనెల 15వ తేదీలోపు రిజర్వేషన్ల ఖరారు తో పాటు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందన్న చర్చ జోరుగా జరిగింది. అయితే కుల గణన విషయంలో వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం….. బుధవారం కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 16వ తేదీ నుంచి మరోసారి కుల గణన సర్వే చేపడుతామని తెలిపింది. ఫిబ్రవరి 28 వరకు సర్వే సిబ్బందికి వివరాలు అందజేయవచ్చని పేర్కొంది. ఎవరైతే సర్వేలో పాల్గొనలేదో.. వారంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరింది. ఈ సర్వే ఆధారంగానే బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే… స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటనకు బ్రేకులు పడినట్లు అయింది.
స్థానిక ఎన్నికలు ఆలస్యం - ముఖ్యమైన అంశాలు:
- రాష్రంలోని గ్రామపంచాయతీల్లోని సర్పంచ్ లో పదవీ కాలం గతేడాది జనవరి 31వతో ముగిసింది. ఆ తర్వాత నుంచి గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. 2024 జూన్ మాసంలోనే ఎంపీటీసీలు, జడ్పీటీసీల పదవీ కాలం కూడా ముగిసింది. ఈ స్థానాలకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది.
- పదవీకాలం ముగిసిన తర్వాత వెంటనే నిర్వహించే అవకాశం ఉన్నప్పటికీ… ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత కుల గణన కార్యక్రమం చేపట్టడంతో ఆలస్యమైంది.
- ఈ ఫిబ్రవరి నెలలోనే స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతాయని అంతా భావించారు. కానీ చివరి నిమిషంలో ఈ ప్రక్రియకు మళ్లీ బ్రేకులు పడ్డాయి.
- ఫిబ్రవరి 16 నుంచి 28వ తేదీ వరకు మళ్లీ కుల గణన సర్వే జరగనుంది. గతంలో వివరాలు నమోదు చేసుకోని వారి కోసం ఈ అవకాశం కల్పించింది.
- తాజాగా జరగబోయే సర్వే ఆధారంగా పూర్తిస్థాయిలో కుల గణన సర్వే గణాంకాలు అందుబాటులోకి రానున్నాయి. వీటి ఆధారంగా బీసీల రిజర్వేషన్లను ఖరారు కానున్నాయి.
- బీసీల రిజర్వేషన్లపై మార్చి తొలి వారంలో కేబినెట్ తీర్మానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాసనసభ ముందుకు కూడా ఈ బిల్లును తీసుకువచ్చి…. చట్టబద్ధం చేయనుంది.
- కేవలం అసెంబ్లీలోనే కాకుండా కులగణన బిల్లును కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపనుంది. ఇదంతా జరగాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది అప్పటిదాకా స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం లేదు.
- మార్చి మాసంలో బడ్జెట్ సమావేశాలు ఉండనున్నాయి. ఇవే కాకుండా మార్చి నెలలో కీలకమైన పదో తరగతి ఎగ్జామ్స్ కూడా జరగనున్నాయి. దీంతో చాలా మంది అధికారులు, సిబ్బంది పరీక్షల విధుల్లో ఉండే అవకాశం ఉంటుంది.
- బీసీ రిజర్వేషన్ల ఖరారు, బడ్జెట్ సవేశాలు, విద్యార్థుల పరీక్షల నేపథ్యంలో… రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణ ఆలస్యం కానుంది. ఏప్రిల్ చివర్లో లేదా మే నెలలో గాని ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
- ఇప్పటికే స్థానిక ఎన్నికల కోసం ఈసీ ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై కూడా కసరత్తు చేపట్టింది. పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితా ముసాయిదాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేసింది. ఇటీవలనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పార్టీల గుర్తులను ఖరారు చేసింది. అయితే సర్కార్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే వెనువెంటనే ఈసీ నుంచి స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంటుంది.
సంబంధిత కథనం