TS Wines Shops Close : ఇవాళ్టి నుంచే వైన్స్ షాపులు బంద్ - ఎప్పటివరకంటే..?
Liquor Shops Close in Telangana : తెలంగాణలో ఇవాళ్టి నుంచి వైన్స్ షాపులు మూతపడనున్నాయి. మే 13వ తేదీ సాయంత్రం వరకు రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులు బంద్ కానున్నాయి. పోలింగ్ ముగిసిన తర్వాత తిరిగి ప్రారంభం కానున్నాయి.
48 గంటలు బంద్….
ఇవాళ (మే 11) సాయంత్రం 6 గంటల నుంచి మద్యం దుకాణాలు క్లోజ్ అవుతాయి. పోలింగ్ జరిగే మే 13వ తేదీ సాయంత్రం వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి. పోలింగ్ ముగిసిన తర్వాత తిరిగి ఓపెన్ అవుతాయి.
ఎన్నికల సంఘం ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా 48 గంటల పాటు మద్యం షాపులు ముూతపడనున్నాయి. కల్లు కంపౌండ్‌లు కూడా ఓపెన్ కావు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఈసీ ఆదేశాలను ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
జూన్ 4వ తేదీన కూడా….
మరోవైపు జూన్ 4వ తేదీన కూడా తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఇదే రోజు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఫలితంగా ఆ రోజు కూడా లిక్కర్ షాపులను మూసివేయనున్నారు. ఎవరైనా అక్రమంగా మద్యం నిల్వ చేసి అమ్మితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
పోలింగ్ కేంద్రాలు సిద్ధం…
మరోవైపు నేటితో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. నాల్గో విడత ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలతో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారం ముగించాల్సి ఉంటుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు నాల్గో విడతలో 10 రాష్ట్రాల్లో ఈసీ ఎన్నికలు నిర్వహిస్తోంది. మొత్తం 10 రాష్ట్రాల్లో 96 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇదే సమయంలో ఏపీ అసెంబ్లీ నియోజజకవర్గాలకు కూడా పోలింగ్ ఉండనుంది. జూన్ 4వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో చూస్తే మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఈసీ వెల్లడించింది. ఇందులో 65,707 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. ఏపీలో పోలింగ్ కోసం మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో కేంద్రంలో 1500 మంది ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. ఓటర్ల సంఖ్య అంతకంటే పెరిగినప్పుడు ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు ఈసీ పూర్తి ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 35809 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేసింది. 23,500 మంది ఉద్యోగులను ఎన్నికల సిబ్బందిగా నియమించారు. 155 కంపెనీల కేంద్ర బలగాలను ఎన్నికల భద్రతకు వినియోగిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ స్థానాలకు 454 మంది తలపడుతుంటే 175 అసెంబ్లీ స్థానాలకు 2387మంది పోటీలో నిలిచారు.13 న జరుగనున్న ఎన్నికల్లో వీరంతా వివిధ రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్ధులుగా ఎన్నికల్లో పోటీ పడనున్నారు. అసెంబ్లీ స్థానాలకు సంబందించి అత్యధికంగా 46 మంది అభ్యర్థులు తిరుపతి నియోజక వర్గంలో పోటీ చేస్తున్నారు. అత్యల్పంగా 6గురు అభ్యర్థులు చోడవరం అసెంబ్లీ నియోజక వర్గంలో పోటీపడుతున్నారు.