Liquor Shops Close: తెలంగాణలో మే 27వ తేదీన పట్టభద్రుల ఎమ్మెల్సీ(నల్గొండ - ఖమ్మం - వరంగల్) ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది. ఇవాళ్టితో ప్రచారం కూడా ముగియనుంది. మరోవైపు ఈ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని వైన్స్ షాపులు కూడా సాయంత్రం నుంచే బంద్ కానున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు జరగని ప్రాంతంలో మాత్రం మద్యం దుకాణాలు తీసి ఉంటాయి.
మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని వైన్ షాపులు, బార్లు మూతపడున్నాయి. ఈ మేరకు ఈసీ నుంచి ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. 48 గంటల పాటు ఈ నిర్ణయం అమల్లో ఉండనుంది. మే 25వ తేదీ సాయంత్రం 4.00 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4.00 గంటల వరకు షాపులు మూసివేసి ఉంటాయి. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత తిరిగి ఓపెన్ అవుతాయి.
మరోవైౌపు రాచకొండ కమిషనరేట్ పరిధిలో కూడా పలు దుకాణాలు బంద్ కానున్నాయి. యాదాద్రి భువనగిరి జోన్ పరిధిలోని పలు గ్రామాలు రాచకొండ కమిషనరేట్ పరిధిలోకి వస్తాయి. ఈ నేపథ్యంలో రాచకొండ సీపీ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ నేపథ్యంలో వైన్స్ షాపులను బంద్ చేయాలన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
మరోవైపు జూన్ 4వ తేదీన కూడా తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఇదే రోజు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఫలితంగా ఆ రోజు కూడా లిక్కర్ షాపులను మూసివేయనున్నారు. ఎవరైనా అక్రమంగా మద్యం నిల్వ చేసి అమ్మితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణలో మే 13 తేదీన లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరిగింది. అయితే మే 11 సాయంత్రం 6 గంటల నుంచే మద్యం దుకాణాలు క్లోజ్ అయ్యాయి. మే 13వ తేదీ సాయంత్రం తర్వాత తిరిగి ఓపెన్ అయ్యాయి. ఇక హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాత్రం మే 14వ తేదీన దుకాణాలు తెరుచుకున్నాయి.
ఎమ్మెల్సీ ఉపఎన్నిక బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య గట్టి పోటీ ఉంది. కొందరు స్వతంత్ర అభ్యర్థులు కూడా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో కలిపి మొత్తం 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. మే 27వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. మే 25వ తేదీతో ప్రచారం కార్యక్రమం కూడా ముగియనుంది. జూన్ 5వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు.
వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైన బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి 2023 డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయన... ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.
ఫలితంగా మండలిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కాస్తా ఖాళీ అయ్యింది. 2021 మార్చి 14న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరగగా... ఆ సమయంలో మొత్తంగా 76 మంది వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ పడగా.. ఇండిపెండెంట్ గా బరిలో నిలిచిన తీన్మార్ మల్లన్న టఫ్ ఫైట్ ఇచ్చారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, తీన్మార్ మల్లన్న మధ్య హోరాహోరీ పోరు నడవగా... చివరకు పల్లా రాజేశ్వర్ రెడ్డి విజేతగా నిలిచారు. ఆయన ఆ పదవిలో ఆరేళ్ల పాటు కొనసాగాల్సి ఉంది. కానీ తాజా ఎన్నికల్లో జనగామ నుంచి పోటీ చేసి గెలవడంతో ఆయన రాజీనామా అనివార్యమైంది.
ఇక గతంలో ఈస్థానం నుంచి అత్యంత కష్టం మీద గెలిచిన బీఆర్ఎస్.... మరోసారి గెలవటం అతిపెద్ద సవాల్ గా మారనుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదాలో ఉండగా.. కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయితే ఈసారి కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి రాకేశ్ రెడ్డి బరిలో ఉండగా, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి రేసులో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్ కు గురైన బక్కా జడ్సన్ కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
టాపిక్