Warangal Airport: వరంగల్ ఎయిర్ పోర్టుకు లైన్ క్లియర్.. భూ సేకరణకు రూ.205 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
Warangal Airport: రాష్ట్రంలో ప్రాచీన ఎయిర్ పోర్టుగా పేరున్న వరంగల్ లోని మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణకు లైన్ క్లియర్ అయింది. దాదాపు 32 ఏళ్ల కిందట మామునూరు ఎయిర్ పోర్టు మూత పడగా.. ఇన్నాళ్లు దాని పునరుద్ధరణ అంశం కాగితాలకే పరిమితం అయింది. ఎయిర్ పోర్టు పునరుద్ధరణపై ప్రభుత్వం సీరియస్ ఫోకస్ పెట్టింది.
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణకు లైన్ క్లియర్ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు జీఎంఆర్ సంస్థ 150 కిలోమీటర్ల నిబంధనను విరమించుకోగా.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్ పోర్టు పునరుద్ధరణకు అవసరమైన 253 ఎకరాల భూ సేకరణకు రూ.205 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ నెల 19న వరంగల్ కు రానున్న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎయిర్ పోర్టు పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
ఇన్నాళ్లు భూసేకరణ పెండింగ్
మామునూరు విమానాశ్రయానికి మొత్తం 1,875 ఎకరాల స్థలం ఉండేది. ఈ స్థలంలో 6.6 కి.మీ రన్ వే, పైలట్, సిబ్బంది క్వార్టర్స్, పైలట్ శిక్షణ కేంద్రం, ఒకటి కన్నా ఎక్కువ టెర్మినళ్లు ఉండేవి. కాగా, విమానాశ్రయానికి చెందిన 468 ఎకరాల భూమిలో టీజీఎస్పీ ఫోర్త్ బెటాలియన్, పోలీస్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 700 ఎకరాల్లో ప్రభుత్వ డెయిరీ పాం నిర్మించారు.
మిగిలిన స్థలం చుట్టూ రక్షణగా ఇటీవల ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ప్రహరీ నిర్మించారు. ఇక మిగిలిన దాంట్లో విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడానికి 943.14 ఎకరాల భూమి అవసరం కాగా ప్రస్తుతం 696.14 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. దానికి తోడు అదనంగా కావాల్సిన మరో 253 ఎకరాల భూమిని అధికారులు గతంలోనే గుర్తించారు. కానీ భూ సేకరణ అంశం కొన్నాళ్లుగా ఆగుతూ సాగుతూ వచ్చింది.
గత బీఆర్ఎస్ సర్కారు కూడా భూ నిర్వాసితులకు పరిహారం ఇచ్చి భూమిని సేకరించడం పట్ల అశ్రద్ధ వహించింది. బీఆర్ఎస్ సర్కారు దాదాపు పదేళ్ల పాటు నాన్చుతూ రాగా.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అడుగు ముందుకు వేసింది. దీంతో విమానాశ్రయం డీపీఆర్ రెడీ చేయాల్సిందిగా ఆర్ అండ్ బీ శాఖ ఎయిర్ ఆథారిటీ ఆఫ్ ఇండియాను కోరనుంది.
పునరుద్ధరణకు శ్రీకారం
మామూనూరు ఎయిర్ పోర్టు పునరుద్ధరణకు కావాల్సిన భూమిలో నక్కలపల్లి, గుంటూరుపల్లి, గాడిపల్లి గ్రామాలకు చెందిన 233 మంది రైతులకు సంబంధించిన వ్యవసాయం, అసైన్డ్ భూములు, లే అవుట్ ప్లాట్లు, 13 నివాస గృహాలున్నాయి. దీంతో ప్రభుత్వం భూ సేకరణకు నిధులు విడుదల చేసింది. దీంతో భూ సేకరణకు అడ్డంకి తొలగిపోయినట్టైంది. అంతేగాకుండా మామునూరు ఎయిర్ పోర్ట్ పునరుద్ధరణకు జీఎంఆర్ సంస్థ పెట్టిన 150 కి.మీ నిబంధనను విరమించుకుంది.
ఈ నేపథ్యలోనే భూ నిర్వాసితులకు తగిన న్యాయం చేస్తామని ఇటీవల మంత్రి కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ సత్యశారద సమక్షంలో హామీ ఇచ్చారు. దీంతో తొందర్లోనే కొత్త రన్ వే విస్తరణ, టెర్మినల్ భవనాలు, ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్), నేవిగేషనల్ ఇన్ స్ట్రుమెంట్ ఇన్స్టాలేషన్ జరగనున్నాయి. కాగా ఎయిర్ పోర్టు పునరుద్ధరణకు ఈ నెల 19న వరంగల్ పర్యటనకు రానున్న సిఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శ్రీకారం చుట్టనున్నారు. తొందర్లోనే ఇక్కడి నుంచి గాలి మోటార్లు ఎగరనుండటంతో ఓరుగల్లు జనాల్లో హర్షం వ్యక్తమవుతోంది.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)