Bijli Mahadev temple : విచిత్రం.. అక్కడ 12 ఏళ్లకు ఒకసారి శివ లింగంపై పిడుగు పడుతుంది!
Bijli Mahadev temple : ఎత్తైన మంచు పర్వతాలు, స్వచ్ఛమైన నదీ ప్రవాహాలు, సహజ జలపాతాలు, సూర్య కిరణాలతో ముత్యాల్లా మెరుస్తున్న మంచులో ఉంటుంది బిజిలీ మహాదేవ ఆలయం. సముద్రానికి 2,400 మీటర్ల ఎత్తులో ఏడాదికి 3 నెలలు పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ ఆలయం బియాస్, పార్వతి నదుల సంగమ స్థానం.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కులూలో బిజిలీ మహాదేవ ఆలయం ఉంది. దేశంలోని అన్ని శివాలయాల పోలిస్తే.. ఈ దేవాలయానికి ఎన్నో ప్రత్యేకలు ఉన్నాయి. ఇక్కడ 12 ఏళ్లకు ఒకసారి శివానుగ్రహం భక్తులకు కనిపిస్తుంది. 12 ఏళ్లకు ఒకసారి పెద్ద మెరుపులు, భారీ శబ్దంతో పిడుగు పడుతుంది. ఆ పిడుగు పడేది లోయలోనో.. చెట్టుమీదో.. జనావాసాల మధ్యనో కాదు. నేరుగా ఆలయం లోపల ఉన్న శివలింగం మీదే పడుతుంది.
పిడుగు పాటుకు పర్వతాలు కంపించిపోతాయి, భూమి దద్దరిల్లుతుంది. ప్రజలు శివనామ స్మరణ చేస్తారు. పిడుగు పడిన తర్వాత లింగం ముక్కలవుతుంది. కానీ విచిత్రం ఏంటంటే.. ఆ మర్నాడే శివలింగం మళ్లీ యథావిధిగా కనిపిపిస్తుంది. ఆలయం చెక్కుచెదరదు. అదే శివానుగ్రహం. ఆ ప్రాంతానికి, అక్కడి ప్రజలకు ఏమాత్రం హాని జరగదు. ఈ శివలీలను ప్రత్యక్షంగా చూసేందుకు 12 ఏళ్లకు ఒకసారి భక్తులు తరలివస్తారు.
హిమాచల్ ప్రదేశ్ సుందర కులూవ్యాలీ ప్రాంతానికి అరుదైన శైవ క్షేత్రంగా పేరుంది. ఈ కులూ వ్యాలీలో ఉన్న బిజిలీ మహాదేవ్ ఆలయంలో పరమశివుడు మహదేవ్ భక్తులతో పూజలందుకుంటున్నాడు. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఈ మహదేవ్ మందిర్‌పై పిడుగుపడి ముక్కలైన శివలింగం.. తిరిగి మరుసటి రోజుకల్లా అతుక్కోవడం ఈ బిజిలీ మహదేవ్ మందిరం ప్రత్యేకత. ఇంతటి అద్భుతం దేశంలో మరెక్కడా చూడలేం.
ప్రతి 12 ఏళ్లకు సరిగ్గా బిజిలీ మహదేవ్ మందిరంపై పిడుగుపడుతుంది. పిడుగు తీవత్రకు మందిరం మాత్రం చెక్కుచెదరదు. కేవలం శివలింగం మాత్రమే ముక్కలవుతుంది. మరుసటి రోజు ఆ గుడికి వెళ్లిన పూజారి ఆ ముక్కలను సేకరించి, ఒక్కచోటికి చేర్చి వెన్నతో వాటికి అభిషేకం చేస్తారు. మరుసటి రోజుకు ముక్కలైన శివలింగం తిరిగి యధారూపంలోకి వచ్చేస్తుంది. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే అద్భుతం ఇది. ఇది ఎలా జరుగుతుందో శాస్త్రజ్ఞులు కూడా ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు.
ఆలయ చరిత్ర ..
పూర్వం కులూ వ్యాలీలో మహాబలవంతుడైన కులంత అనే రాక్షసుడు నివసించేవాడు. ఈ ప్రాంతంలో కొన్ని గ్రామాలు ఉన్నాయి. అక్కడి ప్రజలను, పశుపక్షులను నాశనం చేయడానికి ఆ రాక్షసుడు పెద్ద సర్పంగా మారుతాడంట. సర్పంగా మారిన ఆ రాక్షసుడు బియాస్ నది నీటి ప్రవాహానికి అడ్డుపడి చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలను ముంచెత్తాడు. దీని వెనుక అతని ఉద్దేశ్యం ఏమిటంటే.. ఇక్కడ నివసించే అన్ని జీవులు నీటిలో మునిగి చనిపోతాయని.
కులంతుని ఈ ఆలోచనతో పరమశివుడు చింతించాడు. రాక్షసుడుని తన విశ్వాసంలోకి తీసుకున్నాడు. నీ తోకకి నిప్పు అని చెవిలో గుసగుసలాడాడు. ఇది విన్న కులంత వెనుదిరిగిన వెంటనే, శివుడు కులంత తలపై త్రిశూలంతో దాడి చేశాడు. త్రిశూలం దెబ్బకు కులంత చనిపోతాడు. కులంత మరణించిన వెంటనే, అతని శరీరం ఒక పెద్ద పర్వతంగా మారింది. అతని శరీరం విస్తరించిన భూమి మొత్తం పర్వతాలుగా మారింది.
కులు లోయలోని బిజిలీ మహాదేవ్ నుండి రోహ్తంగ్ పాస్ వరకు, మరొక వైపు మండి ఘోఘర్ధర్ వరకు ఉన్న లోయ కులంత శరీరం నుండి సృష్టించినదని చెబుతుంటారు. అందుకే కులంత మరణం తర్వాత ఈ లోయకు కులు అని పేరు వచ్చింది. అయితే ప్రజలకు ముప్పు పొంచి ఉండటంతో పరమ శివుడు కూడా ఇదే కొండపై వెలిశాడని ప్రతీతి. ఆ రాక్షసుడి దేహాన్ని నాశనం చేయడానికి ఆ కొండపై పిడుగు వేయాల్సిందిగా ఇంద్రుడిని శివుడు ఆదేశించారట.
పిడుగుపడితే అక్కడున్న జనం, పశుపక్షాదులు నాశనం అయిపోతాయి. అందుకే తనపై పిడుగు పడేలా చేసి దాన్ని శివుడు నివారిస్తారనేది పురాణాల కథనం. మహాదేవుడి ఆజ్ఞ ప్రకారమే 12 ఏళ్లకు ఒకసారి పిడుగు పడుతుందని.. ఆ వెంటనే శివలింగం అతుక్కుంటుందని పెద్దలు చెబుతారు. అయితే పూజారి ఆచారం ప్రకారం వెన్నతో పాటు తృణధాన్యాలు, పప్పుల పిండిని ఉపయోగించి అన్నింటినీ కలిపి లింగానికి లేపనం చేస్తారు.
ఇలా 12 ఏళ్లకు ఒకసారి పిడుగు పడి శివలింగం ముక్కలై, తిరిగి అతుక్కోవడం మన దేశంలోనే అత్యంత అద్భుతంగా చెబుతారు. ఇక్కడి అమ్మవారు బిజలీ మహేశ్వరి. శివరాత్రి, శ్రావణ మాసంలో ఈ పుణ్యక్షేత్రంలో జాతర జరుగుతుంది, దీనికి స్థానిక, ఇతర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు.